4 కేసులు.. 1.99 కోట్లు
ABN , Publish Date - Mar 19 , 2026 | 06:36 AM
నగరవాసుల నుంచి ఒకేరోజులో భారీ మొత్తాన్ని సైబర్‌నేరగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడుల పేరుతో నలుగురిని నమ్మించి నట్టేట ముంచారు.
ఒకేరోజు దోచుకున్న సైబర్ నేరగాళ్లు
పెట్టుబడుల పేరుతో భారీ మోసం
హైదరాబాద్ సిటీ: నగరవాసుల నుంచి ఒకేరోజులో భారీ మొత్తాన్ని సైబర్‌నేరగాళ్లు దోచుకున్నారు. పెట్టుబడుల పేరుతో నలుగురిని నమ్మించి నట్టేట ముంచారు. ఓ ప్రైవేటు ఉద్యోగి నుంచి ఏకంగా రూ.67.37 లక్షలు కొల్లగొట్టారు. బడంగ్‌పేట్(Badangpet)కు చెందిన ఉద్యోగి (57)ని సంప్రదించిన సైబర్ నేరగాళ్లు ఆన్‌లైన్‌లో ట్రేడింగ్ చేస్తే మంచి లాభాలు వస్తాయని నమ్మించారు. అతడిని ‘ఏసీఎంఈ వెల్త్ ప్రైవేటు లిమిటెడ్’ వాట్సప్ గ్రూప్‌లో చేర్చి ఇతర సభ్యులు పెద్ద మొత్తంలో లాభాలు పొందుతున్నట్లు నమ్మించారు.
వారి మాటలను నమ్మిన బాధితుడు పలు ఖాతాలకు దఫాలుగా రూ.67.37 లక్షలు బదిలీ చేశాడు. వర్చువల్‌గా రూ.కోట్లలో లాభాలు వచ్చినట్లు కనిపించినా విత్‌డ్రా అవకాశం లేదు. ఆ లాభాలు తీసుకోవాలంటే మరో రూ.70లక్షలు పెట్టుబడి పెట్టాలని, లేకపోతే మీ ఖాతా ఫ్రీజ్ అవుతుందని నేరగాళ్లు భయపెట్టారు. దాంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు హైదరాబాద్ సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
రిటైర్డ్ రైల్వే ఉద్యోగి నుంచి రూ.56.88 లక్షలు
హైదరాబాద్ సిటీ: ఆన్‌లైన్ ట్రేడింగ్ చేస్తే తక్కువ సమయంలోనే పెద్ద మొత్తాలు లాభం సంపాదించవచ్చని నమ్మించిన సైబర్ నేరగాళ్లు ఉప్పల్‌కు చెందిన రిటైర్డ్ రైల్వే ఉద్యోగిని మోసం చేసి రూ.56.88 లక్షలు కాజేశారు. ‘యాక్సిస్ సెక్యూరిటీస్’ సంస్థ ప్రతినిధులుగా పరిచయమైన వ్యక్తులు ఆయనతో ‘ఆర్‌యూడీప్రో’ పేరుతో ఉన్న అప్లికేషన్‌ను డౌన్‌లోడ్ చేయించారు. ముందుగా రూ.50 వేలు పెట్టుబడి పెట్టగా, రూ.11 వేలు లాభం వచ్చినట్లు చూపించారు. వాటిని విత్‌డ్రా చేసుకున్న బాధితుడు ఇదంతా నిజమని నమ్మి పలు దఫాలుగా వారు సూచించిన ఖాతాలకు రూ. 56.88 లక్షలు బదిలీ చేశాడు. విత్‌డ్రా చేసుకునే అవకాశం ఇవ్వకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు మల్కాజిగిరి సైబర్ క్రైం ఠాణాలో ఫిర్యాదు చేశాడు.
ఇదే తరహాలో మరో ఇద్దరి నుంచి..
యూట్యూబ్‌లో చూసిన పెట్టుబడి ప్రకటనను నమ్మి స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడి పెట్టిన ఓ ఉద్యోగి రూ.47.59 లక్షలు పోగొట్టుకున్నాడు. మియాపూర్‌కు చెందిన బాధితుడిని ఆదిత్య బిర్లా సన్‌లైఫ్ హైనెట్ వర్త్ ఎకౌంట్ పేరిట నిర్వహిస్తున్న ట్రేడింగ్ యాప్‌లో చేర్చిన నేరగాళ్లు భారీ లాభాల పేరుతో ఆయనను నమ్మించి మోసం చేశారు. రూ.5 కోట్లకు పైగా లాభం వచ్చిందని యాప్‌లో చూపించారు. డబ్బు ఉపసంహరణకు ఆ ఉద్యోగి ప్రయత్నించగా 15 శాతం బ్రోకరేజ్ ఫీజు పేరుతో రూ.87.56 లక్షలు ముందుగా చెల్లించాలని డిమాండ్ చేశారు.
బాధితుడికి అనుమానం వచ్చి విచారణ చేయగా ఇది నకిలీ యాప్ ద్వారా జరిగిన మోసం అని గుర్తించి బోరుమన్నాడు. పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మరో కేసులో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నకిలీ ట్రేడింగ్ యాప్ ద్వారా రూ.27లక్షలు పెట్టుబడి పెట్టి మోసపోయాడు. వీఐపీ 25 స్టాక్ షేరింగ్ గ్రూపులో అతడిని చేర్చి భారీ లాభాలు వస్తాయంటూ అతడి నుంచి రూ.లక్షలు దోచుకున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News