ఈవీ కారు చార్జింగ్ పాయింట్ పేలుడు
ABN , Publish Date - Mar 19 , 2026 | 03:40 AM
ఢిల్లీలో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం వేర్వేరు అగ్నిప్రమాదాలు చోటుచేసుకొని రెండు కుటుంబాలకు చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు....
చార్జింగ్ పెట్టిన భవనానికి వ్యాపించిన మంటలు
ఇండోర్‌లో ఒకే కుటుంబానికి చెందిన 8 మంది మృతి
ఢిల్లీలో షార్ట్‌సర్క్యూట్‌తో భవనంలో అగ్నిప్రమాదం
అగ్నికి ఆహుతైన 9 మంది కుటుంబ సభ్యులు
న్యూఢిల్లీ/ఇండోర్, మార్చి 18: ఢిల్లీలో, మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో బుధవారం వేర్వేరు అగ్నిప్రమాదాలు చోటుచేసుకొని రెండు కుటుంబాలకు చెందిన 17 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇండోర్‌లోని బ్రజేశ్వరి అనెక్స్ కాలనీలో ఓ మూడంతస్తుల భవనం బయట ఎలక్ర్ట్రిక్ (ఈవీ) కారుకు చార్జింగ్ పెట్టగా.. బుధవారం తెల్లవారు జామున 3.30 గంటలకు చార్జింగ్ పాయింట్ వద్ద పేలుడు సంభవించింది. దీంతో క్షణాల్లో భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో భవనంలోని వారంతా గాఢ నిద్రలో ఉండగా.. ఇంట్లోని గ్యాస్ సిలిండర్లకు మంటలు అంటుకుని మరింతగా వ్యాపించాయి. సమాచారాన్ని అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టినా.. అగ్ని ప్రమాదం కారణంగా విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇంటి తలుపులకు అమర్చిన ఎలక్ట్రానిక్ తాళాలను తెరవడం క్లిష్టంగా మారింది. తలుపులు పగలగొట్టేటప్పటికే ఇంట్లోని ఇద్దరు మైనర్ బాలలు, ముగ్గురు మహిళలు సహా ఎనిమిది మంది కుటుంబసభ్యులు అగ్నికి ఆహుతయ్యారు. మరో ఇద్దరిని పోలీసులు రక్షించగా.. గాయాలతో చికిత్స పొందుతున్నారు.
ఢిల్లీలో షార్ట్ సర్క్యూట్‌తో..
ఢిల్లీలోని పాళం ప్రాంతంలో ఓ భవనంలో షార్ట్ సర్క్యూట్‌తో అగ్నిప్రమాదం జరిగి ఒకే కుటుంబానికి చెందిన 9మంది మరణించారు. రాజేందర్ అనే వ్యాపారికి చెందిన భవనంలో బేస్‌మెంట్, గ్రౌండ్ ఫ్లోర్, ఒకటో ఫ్లోర్‌లో బట్టలు, కాస్మెటిక్ షోరూమ్‌లు నిర్వహిస్తుండగా.. రెండో, మూడో ఫ్లోర్‌లో ఆయన ఐదుగురు కుమారులు, నలుగురు కోడళ్లు, కుమార్తె, ఏడుగురు మనవలు, మనవరాళ్లతో నివాసముంటున్నారు. బుధవారం ఉదయం 6 గంటల సమయంలో గ్రౌండ్‌ఫ్లోర్‌లో మంటలు చెలరేగాయి. గ్రౌండ్ ఫ్లోర్‌లోని షోరూంలో కాస్మెటిక్స్ ఉన్న కారణంగా మంటలు మరింతగా పెరిగి భవనంలోని అన్ని అంతస్తులకూ వ్యాపించాయి. దీంతో ఆ సమయంలో భవనంలో ఉన్న రాజేందర్ భార్య లాదో (70) సహా ఆమె ఇద్దరు కుమారులు, ఇద్దరు కోడళ్లు, కుమార్తె ముగ్గురు మనవరాళ్లు మంటల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయారు. మరో కుమారుడు తన రెండేళ్ల కూతురిని రెండో ఫ్లోర్ నుంచి కిందికి విసిరేసి తాను కూడా దూకేశాడు. దీంతో వీరిద్దరు గాయాలపాలై చికిత్స పొందుతున్నారు. మరో కుమారుడు మరోవైపు దూకి గాయాలతో చికిత్స పొందుతున్నాడు.