డిజిటల్ అరెస్ట్ పేరుతో రూ.33.50 లక్షలకు టోకరా
ABN , Publish Date - Jul 16 , 2026 | 09:51 AM
మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామని విశ్రాంత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు రూ.33.50 లక్షలు కొల్లగొట్టారు.
బాధితుడు విశ్రాంత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి
హైదరాబాద్: మీపై మనీ లాండరింగ్ కేసు నమోదైందని, ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామని విశ్రాంత ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగిని బెదిరించిన సైబర్ నేరగాళ్లు రూ.33.50 లక్షలు కొల్లగొట్టారు. బొల్లారం ప్రాంతంలో నివసిస్తున్న రిటైర్డ్ ఎయిర్‌ఫోర్స్ ఉద్యోగి (73)ని సైబర్ నేరగాళ్లు ప్రభుత్వ అధికారులమంటూ ఫోన్ చేశారు. తర్వాత ఢిల్లీ పోలీస్, ఈడీ అధికారుల పేర్లతో వీడియో కాల్స్ చేసిన సైబర్ నేరగాళ్లు, మీపై ఢిల్లీ పోలీసులు మనీ లాండరింగ్ కేసులు నమోదు చేశారని బెదిరించారు.
చెప్పినట్లు వినకపోయినా, విచారణకు సహకరించకున్నా ఏ క్షణంలోనైనా అరెస్ట్ చేస్తామని భయపెట్టారు. మీ ఖాతాల్లో ఉన్న డబ్బు ఎలా వచ్చిందన్న విషయంపై దర్యాప్తు చేస్తామని, చెబుతూ పలు దఫాలుగా రూ.33.50 లక్షలు వేర్వేరు ఖాతాల్లో జమ చేయించుకున్నారు. ఈ విషయం గురించి ఎవరికైనా చెబితే తీవ్ర పరిణామాలుంటాయని హెచ్చరించారు. వెరిపికేషన్ పూర్తి చేసిన తర్వాత తిరిగి జమ చేస్తామన్న డబ్బు ఎంతకూ రాకపోవడంతో మోసపోయానని గ్రహించిన బాధితుడు సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించాడు.
పార్ట్ టైమ్ జాబ్ పేరుతో రూ. 9లక్షలు..
హైదరాబాద్ సిటీ: పార్ట్ టైమ్ ఉద్యోగం పేరుతో గూగుల్ రివ్యూలు పోస్టు చేయిస్తామని నమ్మించి ఓ నిరుద్యోగి నుంచి రూ.9 లక్షలకు పైగా సైబర్ నేరగాళ్లు కాజేశారు. మియాపూర్‌కు చెందిన రిమ్మనపూడి నిశాంత్ ఫణీంద్ర (32) ఆన్‌లైన్‌లో పార్ట్‌టైమ్ ఉద్యోగాల కోసం వెతుకుతుండగా, జూలై 7న నీతా శర్మ (8680065272) అనే మహిళ వాట్సాప్ ద్వారా సంప్రదించింది. తాను పిన్‌స్ర్టామ్ సంస్థ హెచ్‌ఆర్ ఎగ్జిక్యూటివ్‌నని పరిచయం చేసుకుని, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ అవుట్‌లెట్లకు గూగుల్ రివ్యూలు పోస్ట్‌చేస్తే రోజుకు రూ.1,000 నుంచి రూ.10,000 సంపాదించవచ్చని తెలిపింది.
మొదటి రోజే జాయినింగ్ బోన్‌సగా రూ. 150, 13 రివ్యూ టాస్కులు పూర్తిచేసినందుకు రూ.1,500 చెల్లించడంతో ఆ ఉద్యోగం నిజమేనని బాధితుడు నమ్మాడు. రీఫండ్ కోడ్ పేరుతో రూ.1.55 లక్షలు చెల్లిస్తే సుమారు రూ.5 లక్షలు తిరిగి వస్తాయని మభ్యపెట్టారు. అనంతరం రీఫండ్ ప్రక్రియలో తప్పు జరిగిందని మరో రూ.2.55 లక్షలు వసూలు చేశారు. అయినా డబ్బు చెల్లించకుండా వివిధ కారణాలు చెబుతూ రూ.9,19,200 వసూలు చేసి, కేవలం రూ.7,600 మాత్రమే చెల్లించడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు.
పెట్టుబడికి లాభం వచ్చిందని రూ.9.67 లక్షలు కాజేత
హైదరాబాద్ సిటీ: అధిక లాభాల ఆశ చూపిస్తూ వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల ద్వారా పెట్టుబడులు పెట్టించిన సైబర్ మోసగాళ్లు ఓ ప్రైవేట్ ఉద్యోగి నుంచి రూ.9.67లక్షలకు పైగా కాజేశారు. మూసాపేటకు చెందిన వ్యక్తికి జూన్ 30న 9799546979 నంబర్ నుంచి వాట్సాప్ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు సంప్రదించారు. లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.3,87,600 లాభం వస్తుందని నమ్మించారు. లాభాల స్ర్కీన్‌షాట్లు, ఇతరులు భారీ మొత్తాలు ఉపసంహరించుకున్నట్లు చూపించే సందేశాలను వాట్సాప్, టెలిగ్రామ్ గ్రూపుల్లో పోస్ట్ చేశారు. రూ. 3.87 లక్షల లాభం వచ్చినట్లు బాధితుడికి చూపించారు.
ఆ డబ్బు తీసుకోవాలంటే కమీషన్, జీఎస్టీ, నెఫ్ట్ చార్జీలు చెల్లించాలన్నారు. అనంతరం మరోసారి రూ.9,48,415 అదనపు లాభం వచ్చిందని చెబుతూ, ఆ డబ్బు తీసుకోవాలంటే మరిన్ని చార్జీలు చెల్లించాలని ఒత్తిడి చేశారు. గ్రూపులోని ఇతర సభ్యులు తాము డబ్బులు తీసుకున్నట్లు సందేశాలు పంపడంతో నిజమని నమ్మిన బాధితుడు దశలవారీగా వివిధ బ్యాంకు ఖాతాలు, యూపీఐ ఐడీలకు రూ.9,67,262 బదిలీ చేశాడు. తన పెట్టుబడి, లాభాలను తిరిగి ఇవ్వాలని బాధితుడు కోరగా.. నిందితులు వివిధ కారణాలు చెబుతూ మరింత డబ్బు డిమాండ్ చేయడంతో మోసపోయినట్లు గుర్తించి సైబరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
కేబీఆర్ పార్క్ చుట్టూ వన్‌వే
పసిడి ధరలు స్వల్పంగా పెరిగాయ్.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News