Share News

పెళ్లి దుస్తుల్లో యువకుడి ఆత్మహత్య

ABN , Publish Date - Apr 04 , 2026 | 08:17 AM

తెల్లవారితే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఆ యువకుడు.

పెళ్లి దుస్తుల్లో యువకుడి ఆత్మహత్య

  • హోటల్‌ రూమ్‌లో ఉరేసుకున్న వైనం

హైదరాబాద్: తెల్లవారితే ప్రేమించిన అమ్మాయితో పెళ్లి.. దానికి కావాల్సిన ఏర్పాట్లు కూడా చేసుకున్నాడు ఆ యువకుడు. కాబోయే భార్యతో ఓ హోటల్‌లో దిగిన ఆ యువకుడు.. భోజనం తెమ్మని ప్రియురాలిని బయటకు పంపాడు. ఇంతలో ఏమైందో ఏమో కానీ ఆమె తిరిగి వచ్చేసరికి పెళ్లి దుస్తుల్లోనే ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో గురువారం జరిగిన ఈ ఘటనలో ఏపీలోని అనంతపురం జిల్లా పుట్లూరు మండలం చెర్లోపల్లికి చెందిన లోకేశ్‌(29) బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇందుకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.


మూడేళ్లుగా హైదరాబాద్‌లోని చింతల్‌లో నివాసముంటున్న లోకేశ్‌ ప్రస్తుతం ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్నాడు. లోకేశ్‌ గతంలో ఓ ఫార్మా కంపెనీలో ఉద్యోగం చేసిన సమయంలో అంబిక అనే యువతితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. వారిద్దరూ పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకోగా, ఇరు కుటుంబాలు కూడా అంగీకరించాయి. అయితే, ఆర్యసమాజ్‌ లేదా ఏదైనా గుడిలో శనివారం పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ నిశ్చయించుకున్నారు. ఇందుకోసం దుస్తులు కూడా కొనుగోలు చేశారు.


city2.2.jpgఅయితే, లోకేశ్‌, అంబిక శుక్రవారం మధ్యాహ్నం కేపీహెచ్‌బీ పోలీస్‌ స్టేషన్‌ పరిధిలోని అడ్డగుట్టలో ఓయో రూమ్‌ అద్దెకు తీసుకున్నారు. గదిలో దిగిన తర్వాత తాను పెళ్లి దుస్తుల్లో ఉన్నానని, బయటకు వెళ్లి భోజనం తీసుకురమ్మని లోకేశ్‌.. అంబికను బయటకు పంపించాడు. ఆమె తిరిగి వచ్చేసరికి గది తలుపు లోపలి నుంచి గడియ పెట్టి ఉండడమే కాక.. ఎన్నిసార్లు తలుపు కొట్టినా లోకేశ్‌ స్పందించడం లేదు.


హోటల్‌ సిబ్బంది సాయంతో అంబిక గది తలుపులు తెరిచి చూడగా లోకేశ్‌ గదిలోని ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఉన్నాడు. లోకేశ్‌ను వెంటనే ఆస్పత్రికి తరలించగా అప్పటికే మరణించినట్టు వైద్యులు నిర్ధారించారు. లోకేశ్‌ ఆత్మహత్య చేసుకునే ముందు ‘‘మిస్‌ యూ’’ అని తనకు మెసేజ్‌ పెట్టాడని తన అన్నయ్య ప్రకాశ్‌ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదు చేసిన పోలీసులు.. లోకేశ్‌ ఆత్మహత్యకు కారణం తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి:

స్థిరంగా కొనసాగుతున్న బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..

పాత పేరు.. కొత్త అజెండా!

Read Latest Telangana News and National News

Updated Date - Apr 04 , 2026 | 08:17 AM