Share News

పాత పేరు.. కొత్త అజెండా!

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:44 AM

తాను స్థాపించనున్న పార్టీకి పాత పేరు, కొత్త అజెండా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరు ఖాళీగా ఉందని..

పాత పేరు.. కొత్త అజెండా!

  • టీఆర్‌ఎస్‌ పేరు ఖాళీగా ఉంది.. ఎవరైనా వాడుకోవచ్చు

  • ప్రొ. జయశంకర్‌ సిద్ధాంతాల ప్రకారం పని చేస్తాం

  • పార్టీ ఆవిర్భావం తర్వాత భారీగా చేరికలుంటాయి

  • సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వు అయితే వాటిలో ఒక దాన్నుంచి పోటీ చేస్తా

  • నిద్రావస్థలో బీఆర్‌ఎస్‌.. ప్రథమ శత్రువు కాంగ్రెస్సే

  • ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల దోపిడీని ప్రభుత్వం అడ్డుకోవటం లేదు

  • ప్రైవేటు టీచర్ల హక్కుల కోసం పోరాడుతాం: కవిత

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్రజ్యోతి): తాను స్థాపించనున్న పార్టీకి పాత పేరు, కొత్త అజెండా ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత ప్రకటించారు. తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్‌) పేరు ఖాళీగా ఉందని.. దాన్ని ఎవరైనా వాడుకోవచ్చునని అభిప్రాయపడ్డారు. పార్టీ రిజిస్ట్రేషన్‌ కోసం ప్రత్యేకంగా ఒక టీమ్‌ పని చేస్తోందని తెలిపారు. శుక్రవారం జాగృతి కార్యాలయంలో మీడియాతో కవిత ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. తమ పార్టీకి బిహార్‌ సిద్ధాంతకర్త ఎవరూ లేరంటూ.. ఎన్నికల వ్యూహాకర్త ప్రశాంత్‌ కిశోర్‌తో ఒప్పందాలు చేసుకునే పార్టీలపై పరోక్షంగా చెణుకులు విసిరారు. ప్రొఫెసర్‌ జయశంకర్‌ సిద్ధాంతాల ప్రకారం తమ పార్టీ నడుస్తుందన్నారు. ఆవిర్భావ సభకు ఇతర పార్టీల నేతలను ఆహ్వానించడం లేదని, వేదికపైనే తమ అజెండా చెబుతామని, యువతకు అధిక ప్రాధాన్యత ఇస్తామని కవిత వెల్లడించారు. ఎజెండా తెలియజేసిన తర్వాత పెద్దఎత్తున చేరికలు ఉంటాయని, విదేశాల్లో ఉంటున్న తెలంగాణ బిడ్డలు కూడా పార్టీలో చేరతామంటున్నారని తెలిపారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్‌ తమకు గొప్ప అవకాశమని చెబుతూ.. సిద్దిపేట, గజ్వేల్‌ నియోజకవర్గాలు మహిళలకు రిజర్వు అయితే వాటిలో ఒకదాన్నించి పోటీ చేస్తానని చెప్పారు. బీఆర్‌ఎస్‌ నిద్రావస్థలో ఉందని, తమకు ప్రథమ శత్రువు కాంగ్రెస్సేనని.. తమ పోరాటం ఆ పార్టీపైనే ఉంటుందన్నారు. ఫ్యూచర్‌ సిటీ పేరుతో రేవంత్‌రెడ్డి హైదరాబాద్‌ను ఆగం చేయాలని చూస్తున్నారని, అసలు సిటీని చంపకుంటే చాలని కవిత అన్నారు. రేవంత్‌ రెడ్డి మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారంచేసి ఆ పార్టీని ఓడించారని.. ప్రస్తుతం కేరళలో ప్రచారం చేస్తున్నారని, అక్కడా కాంగ్రెస్‌ను ఓడిస్తారని ఎద్దేవా చేశారు. అమరావతి బిల్లు సందర్భంగా భద్రాచలం ఐదు గ్రామాల గురించి పార్లమెంటులో తెలంగాణ ఎంపీలు ప్రస్తావించాల్సి ఉండాల్సిందని, కానీ వారు పట్టించుకోలేదన్నారు.


ఫీజుల పేరిట ప్రైవేటు విద్యాసంస్థల దోపిడీ

ప్రైవేటు విద్యాసంస్థల ఫీజుల నియంత్రణలో బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం విఫలమైందని ఆరోపించి అధికారంలోకి వచ్చిన రేవంత్‌రెడ్డి.. ప్రస్తుతం ఏం చర్యలు తీసుకున్నారని కవిత ప్రశ్నించారు. విద్యాశాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి ఫీజుల నియంత్రణ చట్టం ఎందుకు తీసుకురాలేదని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం నియమించిన విద్యాకమిషన్‌ అతి చెత్త నివేదిక ఇచ్చిందని.. ఫీజుల నియంత్రణకు చట్టం చేయాలనే సిఫారసు తప్ప దాంట్లో ఆమోద యోగ్యమైనది మరేదీ లేదని విమర్శించారు. రాష్ట్రంలో 12 వేల ప్రైవేటు స్కూళ్లలో 38 లక్షలమంది విద్యార్థులు చదువుతున్నారని, యాజమాన్యాలు ఒకేసారి 30 నుంచి 40 శాతం ఫీజులు పెంచి, దోపిడీకి పాల్పడుతున్నాయన్నారు. తాను బీఆర్‌ఎస్లో ఉన్నప్పుడు తనను నిజామాబాద్‌ కే పరిమితం చే సినప్పటికీ.. నారాయణ, చైతన్యలాంటి కార్పొరేట్‌ సంస్థలు అక్కడికి రాకుండా అడ్డుకున్నానని కవిత తెలిపారు. కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే వేర్వేరు పేర్లతో ఆ సంస్థలు నిజామాబాద్‌కు వచ్చాయన్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు ఫీజులు పెంచుతున్న స్థాయిలో విద్యార్థుల తల్లిదండ్రుల జీతాలు పెరగడం లేదని.. 7 శాతం నుంచి 8 శాతం ఫీజు పెంపునకు మాత్రమే ప్రభుత్వం అనుమతి ఇవ్వాలని సూచించారు. ఏటా భారీగా ఫీజులు పెంచుతున్న ప్రైవేట్‌, కార్పొరేట్‌ విద్యాసంస్థల యాజమాన్యాలు వాటిలో పనిచేస్తున్న టీచర్లు, ఉద్యోగుల జీతాలు మాత్రం పెంచడం లేదన్నారు. కార్పొరేట్‌, నార్త్‌ఇండియన్‌ స్కూళ్ల వారు తెలంగాణ వారికి కనీసం ధోబీగా కూడా అవకాశం ఇవ్వడం లేదని, అలాంటి వాటికి పర్మిషన్‌ ఇవ్వొద్దని కోరారు. ప్రైవేటు, కార్పొరేట్‌ స్కూళ్లలో పనిచేస్తున్న టీచర్ల పరిస్థితి దుర్భరంగా ఉందని, వారి హక్కుల సాధన కోసం పోరాడుతామన్నారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిల కోసం ఉద్యమిస్తామని కవిత తెలిపారు.

Updated Date - Apr 04 , 2026 | 07:49 AM