Share News

నిర్మాణ రంగంపై యుద్ధ భారం!

ABN , Publish Date - Apr 04 , 2026 | 05:49 AM

పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తోంది.

నిర్మాణ రంగంపై యుద్ధ భారం!

  • 20 నుంచి 50 శాతం దాకా పెరిగిన గృహ నిర్మాణ సామగ్రి ధరలు

  • రంగులు, సిమెంట్‌, స్టీల్‌ వస్తువుల ధరల్లో పెరుగుదల

  • 30 శాతం దాకా పెరిగిన టైల్స్‌, శానిటరీ వేర్‌ రేట్లు

  • యూపీవీసీ ధరలపైనా ప్రభావం

  • మూతపడిన మోర్బి సిరామిక్‌ పరిశ్రమ

  • పెరిగిపోయిన గృహ నిర్మాణ బడ్జెట్‌

హైదరాబాద్‌, ఏప్రిల్‌ 3 (ఆంధ్ర జ్యోతి): పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ ప్రభావం క్రమంగా అన్ని రంగాలకు విస్తరిస్తోంది. ముడి చమురు, సహజ వాయువు సరఫరాలో ఏర్పడిన అంతరాయం నిర్మాణ రంగాన్ని కూడా కుదేలు చేస్తోంది. గృహ నిర్మాణ సామగ్రి ధరలు ఒక్కసారిగా పెరిగిపోతున్నాయి. ముఖ్యంగా రంగులు, స్టీల్‌, సిమెంట్‌, ప్లాస్టిక్‌, శానిటరీ వేర్‌, టైల్స్‌ తదితర వస్తువుల ధరలు పది రోజుల వ్యవధిలోనే 20 నుంచి 50 శాతం మేర పెరిగిపోయాయి. దీంతో నిర్మాణ వ్యయం అంచనాలు ఒక్కసారిగా పెరిగిపోయి గృహ నిర్మాణదారులు, బిల్డర్లు హడలెత్తిపోతున్నారు. కాగా, ముడి చమురు సరఫరాలో అంతరాయం రంగుల పరిశ్రమను తీవ్రంగా ప్రభావితం చేసింది. రంగుల తయారీకి వినియోగించే ముడిసరుకుల్లో ముడి చమురు అత్యంత ముఖ్యమైనది కావడమే ఇందుకు కారణం. గల్ఫ్‌ దేశాల నుంచి చమురు సరఫరా తగ్గడంతో రంగుల తయారీ భారంగా మారిందని ఆ రంగానికి చెందిన వారు వాపోతున్నారు. రంగు గోడకు అతుక్కుపోయేలా చేయడంలో బైండర్లు(రిజిన్స్‌) అత్యంత ముఖ్యమైనవి. యాక్రిలిక్‌, ఎపోక్సి, పాలీయురేతిన్‌ వంటి రసాయనాలతో ఈ బైండర్లను తయారు చేస్తారు. రంగునిచ్చే పదార్థంలో కీలకమైనది పిగ్మెంట్‌.. ఇందులో టైటానియం డయాక్సైడ్‌. తెలుపు రంగు కోసం వాడే అత్యంత ముఖ్యమైన రసాయనం. అలాగే, ఐరన్‌ ఆక్సైడ్‌ను ఎరుపు, పసుపు, గోధుమ రంగుల కోసం వినియోగిస్తారు. జింక్‌ ఆక్సైడ్‌.. రంగు పాడవకుండా వాడతారు. తయారైన రంగులు ద్రవ రూపంలో ఉండేందుకు వాడే సాల్వెంట్‌లను గల్ఫ్‌ దేశాల నుంచి దిగుమతి చేసుకుంటారు. గోడలకు బూజు పట్టకుండా చేసే యాంటీ ఫంగల్‌ ఏజెంట్స్‌, గోడకు వేసిన రంగు త్వరగా ఆరిపోయేలా చేసే డ్రైయర్స్‌, రంగు చిక్కదనం కోసం వాడే థిక్‌నర్స్‌ వంటి వాటిల్లో పెట్రోలియం అనుబంధ రసాయనాల నుంచి తయారు చేసేవి 70 శాతం ఉన్నాయి. ఆయా రసాయనాల ధరలు పెరగడంతో రంగుల ధరలను కూడా పెంచేస్తున్నారు. మినరల్‌ టర్పైటన్‌ ఆయిల్‌ లీటరు గతంలో రూ.90 ఉంటే ప్రస్తుతం రూ.135 వరకు విక్రయిస్తున్నారు. సాధారణంగా వినియోగించే రంగుల ధరలు కూడా 15 నుంచి 20 శాతం దాకా పెరిగాయి. ఇక, ప్లంబింగ్‌కు సంబంధించి పీవీసీ పైపులు, ఇతరత్రా వస్తువుల ధరలు కూడా 30 శాతం దాకా పెరిగాయి.


యూపీవీసీ ధరలపైనా ప్రభావం

యూపీవీసీ ధరలు కూడా 10 శాతం దాకా పెరిగాయి. పెట్రోలియం ఉత్పత్తుల నుంచే వచ్చే పీవీసీ రెసిన్‌ను యూపీవీసీ తయారీకి ముడిసరుకుగా ఉపయోగిస్తారు. యుద్ధం వల్ల అంతర్జాతీయ మార్కెట్‌లో ముడి చమురు ధరలు పెరిగాయి. ఫలితంగా రెసిన్‌ ధరలు కూడా పెరిగాయని తయారీదారులు చెబుతున్నారు. ఇక, దేశ అవసరాలకు కావాల్సిన పీవీసీ కోసం ఎక్కువగా ఇతర దేశాల మీద ఆధారపడే పరిస్థితి ఉందని, దీంతో దిగుమతి చేసుకునే యూపీవీసీ కిటికీలు, తలుపులు వంటి వాటి ధరలను కూడా పెంచారని విక్రేతలు చెబుతున్నారు. విండో ఫ్రేమ్‌ కోసం వినియోగించే అల్యూమినియం, గ్లాస్‌ ప్యానల్స్‌ ధరలు కూడా పెరిగాయి. కాగా, రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం ఎక్కువగా ఉండే హైదరాబాద్‌ లాంటి చోట్ల ఈ ధరల పెరుగుదల వల్ల ప్రాజెక్టు బడ్జెట్‌ 10 నుంచి 15 శాతం వరకు పెరిగినట్లు బిల్డర్లు వాపోతున్నారు.

బోసిపోయిన మోర్బి

భారతదేశ సిరామిక్‌ రాజధాని అయిన గుజరాత్‌లోని మోర్బి పారిశ్రామిక నగరం పశ్చిమాసియాలోని పరిస్థితుల వల్ల కొద్ది రోజులుగా వెలవెలబోతోంది. దేశ వ్యాప్తంగా వినియోగించే సిరామిక్‌ ఉత్పత్తుల్లో 90 శాతం మోర్బిలోని పరిశ్రమల్లోనే తయారవుతాయి. మోర్బిలో ఉత్పత్తయ్యే టైల్స్‌ 150 దేశాలకు ఎగుమతి అవుతాయి. తెలుగు రాష్ట్రాల్లోనూ మోర్బి టైల్స్‌ అమ్మకాలే అధికంగా ఉంటాయి. చైనా తర్వాత రెండో అతిపెద్ద సిరామిక్‌ క్లస్టర్‌ మోర్బిలోనే ఉంది. వీటితోపాటు గడియారాల తయారీకి ఈ ప్రాంతం ప్రసిద్ధి. టైల్స్‌ ప్యాకేజీకి అవసరమైన కోరగేటెడ్‌ బాక్సుల తయారీ పరిశ్రమలు అధికంగానే ఉన్నాయి. ఇరాన్‌ యుద్ధం నేపథ్యంలో గ్యాస్‌ కొరత వల్ల సిరామిక్‌ పరిశ్రమ ప్రస్తుతం సంక్షోభంలో పడిపోయింది. 800కుపైగా సిరామిక్‌ పరిశ్రమలు ఉన్న మోర్బిలో టైల్స్‌ తయారీకి అవసరమైన సహజ వాయువు లభ్యం కాకపోవడంతో సుమారు 450కిపైగా పరిశ్రమలు మూతపడ్డాయి. హోర్మోజ్‌ జలసంధి వద్ద నెలకొన్న ఉద్రిక్తతల వల్ల ప్రొపేన్‌ గ్యాస్‌ సరఫరా నిలిచిపోయింది. దీంతో మోర్బిలో ప్రొపేన్‌ గ్యాస్‌పై ఆధారపడిన 250కి పైగా పరిశ్రమలు మూతపడ్డాయి. మోర్బిలోని పరిశ్రమల్లో రోజుకు సగటున 55 లక్షల క్యూబిక్‌ మీటర్ల ప్రొపేన్‌ గ్యాస్‌ను వినియోగిస్తారు.


సుమారు 500 యూనిట్లు దీనిపై ఆధారపడి పని చేస్తాయి. పైపులైన్‌ ద్వారా వచ్చే సహజవాయువు రోజూ సుమారు 25 లక్షల క్యూబిక్‌ మీటర్ల వినియోగం ఉంటుంది. పరిశ్రమ సజావుగా సాగాలంటే రోజుకు సుమారు 80 లక్షల క్యూబిక్‌ మీటర్ల గ్యాస్‌ అవసరమని పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. పరిస్థితి తీవ్రతను అధిగమించేందుకు మోర్బి సిరామిక్‌ తయారీదారుల సంఘం ఏప్రిల్‌ 15 వరకు పరిశ్రమలను మూసివేయాలని నిర్ణయించింది. మోర్బిలోని సిరామిక్‌ పరిశ్రమపై ఆధారపడి ప్రత్యక్షంగా, పరోక్షంగా సుమారు పది లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు. వీరిలో 70 శాతం మంది బిహార్‌, ఉత్తరప్రదేశ్‌, ఒడిశా రాష్ట్రాలకు చెందిన వారే ఉంటారు. ప్రస్తుతం పనులు లేకపోవడంతో ఆయా కార్మికులంతా స్వగ్రామాలకు వెళ్లిపోయే పరిస్థితి ఏర్పడింది. తెలుగు రాష్ట్రాల్లోనూ సిరామిక్‌ వ్యాపారులు, డీలర్లు ఇప్పటికే తమ వద్ద ఉన్న స్టాక్‌ ధరలు పెంచి విక్రయిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.

స్టీల్‌ నుంచి సిమెంట్‌ వరకు..

నిర్మాణ రంగంలో కీలకమైన స్టీల్‌ ధరలు టన్నుకు 18 శాతం దాకా పెరిగాయి. కొన్ని బ్రాండెడ్‌ స్టీల్‌ సంస్థలు టన్ను ధరను 25 శాతం దాకా పెంచాయనే ప్రచారం జరుగుతోంది. ఇక, సిమెంట్‌ ధరలు బస్తాకు రూ.50 వరకు పెంచారు. మరోపక్క, టైల్స్‌, శానిటరీ వేర్స్‌ తయారీకి వాడే ప్రొపేన్‌ గ్యాస్‌ సరఫరా తగ్గడంతో శానిటరీ వేర్‌ ధరలు రకాన్ని బట్టి 8 నుంచి 12 శాతం వరకు పెరిగాయని చెబుతున్నారు. సిమెంట్‌తోపాటు ఇసుక, ఇటుక ధరలు కూడా పెంచారు. వాహనాలకు డీజిల్‌, పెట్రోల్‌ దొరకడం లేదనే సాకుతో రవాణాచార్జీల రూపంలో అదనపు భారాన్ని మోపుతున్నారు. మొన్నటి వరకు రూ.8 ఉన్న ఇటుక ప్రస్తుతం రూ.10 నుంచి రూ.12 దాకా విక్రయిస్తున్నారని చెబుతున్నారు.

Updated Date - Apr 04 , 2026 | 05:49 AM