అనాథ శవంగా అమ్మ..
ABN , Publish Date - Jun 05 , 2026 | 12:25 PM
గత నెల 31వ తేదీన తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన హిందూపురానికి చెందిన ఓ మహిళకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు.
కొడుకులకు దక్కని చివరిచూపు
మంత్రాలయంలోనే అంత్యక్రియలు
మృతురాలిది హిందూపురం
ఆ కుటుంబం ఉన్నతంగా బతికింది. భర్త టైలర్‌గా పనిచేస్తూ పిల్లలను ఉన్నత చదువులు చదివించారు. నాలుగేళ్ల క్రితం అనారోగ్యంతో భర్త మృతిచెందాడు. ఇద్దరు కొడుకులు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్లుగా పనిచేస్తున్నారు. పెద్ద కొడుకుకు రెండేళ్ల క్రితం వివాహం చేసింది ఆ మాతృమూర్తి. సొంత ఇల్లు ఉంది. సాఫీగా సాగుతున్న జీవితంలో పెద్ద కొడుకు చిచ్చుపెట్టాడు. తల్లి పేరు మీద ఉన్న ఇంటిని తనపేరు మీదకు రాయించు కున్నాడు. ఆ తల్లి మనస్సు విలవిలలాడింది. మనస్తాపం చెందింది. వృద్ధాప్యంలో తనకు ఆసరా ఏమిటని బాధ పడింది. కన్న కొడుకు చేసిన మోసాన్ని తట్టుకోలేక పోయింది. హిందూపురం నుంచి మంత్రాలయానికి వచ్చి తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడింది. కొడుకులున్నా ఆ ‘అమ్మ’ అనాథ శవంగా మారింది.
మంత్రాలయం(కర్నూలు): గత నెల 31వ తేదీన తుంగభద్ర నదిలో దూకి బలవన్మరణానికి పాల్పడిన హిందూపురానికి చెందిన ఓ మహిళకు మంత్రాలయంలోనే అంత్యక్రియలు నిర్వహించారు. కొడుకులున్నా అనాథ శవంగా అంత్యక్రియలు కొనసాగిన ఈవిషాద ఘటన పట్టణంలో చోటుచేసుకున్నట్లు ఎస్‌ఐ మల్లికార్జున తెలిపారు.
వివరాలు.. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురంలోని అజాద్‌నగర్‌లో నేత్రావతి(54) అనే మహిళ నివాసం ఉంటుంది. ఈమె భర్త నాగరాజు అనారోగ్యంతో మృతిచెందాడు. ఆమె తన ఇద్దరు కొడుకులైన మహేష్, మురళితో కలిసి ఉంటుంది. గత నెల 30న తాను నివాసం ఉంటున్న ఇంటిని పెద్ద కొడుకైన మహేష్ తన పేరిట రాయించుకున్నాడు. మనస్తాపం చెందిన ఆమె గత నెల 31న మంత్రాలయంకు వచ్చి తుంగభద్ర నదిలో ఆత్మహత్య చేసుకుంది. తల్లి కుటుంబ సమస్యలతో ఇంటినుంచి వెళ్లిపోయిందని హిందూపూర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో చిన్నకొడుకు మురళి ఫిర్యాదు చేశాడు. ఈ మే రకు అక్కడి పోలీసులు మహిళ అదృశ్యం కేసు నమోదుచేశారు.
ఈనెల 1వ తేదీన తుంగభద్ర నదిలో సోమవారం గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యమైంది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఎమ్మిగనూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. రెండు రోజులువేచి చూశారు. బంధువులు, కుటుంబీకులు ఎవరూ రాకపోవడంతో గురువారం పోస్టుమార్టం నిర్వహించి మంత్రాలయంలోనే పోలీసులు, పంచాయతీ సిబ్బంది అంత్య క్రియలు నిర్వహించారు. మృతురాలు ధరించిన వస్తువులు గుర్తించిన హిందూపురం పోలీసులు నేత్రావతిగా గుర్తించి కొడుకులకు సమాచారం ఇచ్చారు. కొడుకులకు కనీసం తల్లి చివరి చూపు కూడా దక్కలేదు.
ఈ వార్తలు కూడా చదవండి:
కవరు తొడిగిన మామిడికి గిట్టుబాటు ధర
Read Latest AP News And Telangana News And International News And Telugu News