కేటుగాడు దొరికేశాడు
ABN , Publish Date - Feb 25 , 2026 | 09:23 AM
ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సీఎంఎస్ వాహనంలోని డబ్బులతో పారిపోయిన డ్రైవర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రూ.34.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు.
సిబ్బంది ఏటీఎంలో డబ్బులు నింపుతుండగా సీఎంఎస్ వాహనంతో పరార్
నిందితుడిని అరెస్ట్ చేసి రూ.34.90లక్షలు స్వాధీనం చేసుకున్న పోలీసులు
హైదరాబాద్: ఏటీఎంలకు నగదు సరఫరా చేసే సీఎంఎస్ వాహనంలోని డబ్బులతో పారిపోయిన డ్రైవర్‌ను గచ్చిబౌలి పోలీసులు అరెస్టు చేసి రూ.34.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు గచ్బిబౌలి పోలీస్‌స్టేషన్‌లో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నార్సింగ్ డివిజన్ ఏసీపీ రమణగౌడ్ వివరాలను వెల్లడించారు. ఈ నెల 12న గోపన్‌పల్లి తండాలోని ఏటీఎంలో డబ్బులు నింపేందుకు సీఎంఎస్ ఏజెన్సీ వ్యాన్‌లో సిబ్బంది వచ్చారు.
ఇద్దరు సిబ్బంది ఏటీఎం(ATM)లో డబ్బులు లోడ్ చేస్తుండగా, గార్డు వాష్‌రూంకు వెళ్లడంతో ఇదే అదనుగా భావించిన వ్యాన్ డ్రైవర్ అజిత్(34) వ్యాన్‌లో ఉన్న డబ్బులతో ఉడాయించాడు. అనంతరం వ్యాన్‌ను నిర్మానుష్య ప్రాంతంలో వదిలిపెట్టి అందులో ఉన్న రూ.56.90లక్షలు తీసుకుని పరారయ్యాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. రెండు గంటల పాటు వివిధ ప్రాంతాల్లో తిరిగిన అజిత్ తెల్లాపూర్‌లోని గద్దర్ చౌరస్తా వద్ద ఆటో మాట్లాడుకుని ఆర్టీసీ క్రాస్‌రోడ్డులోని ఓ లాడ్జిలో ఉన్నాడు.
అనంతరం ట్రంక్‌పెట్టెలో ఉన్న నగదును బ్యాగ్‌లో వేసుకుని అనంతపురం వెళ్లాడు. అక్కడి నుంచి బళ్లారి, పుణే, బెంగళూరు తదితర ప్రాంతాల్లో తిరిగాడు. ఎట్టకేలకు శంషాబాద్ ఎయిర్ పోర్టులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ.22లక్షలు జల్సాలకు ఖర్చు చేయగా, రూ.34.90లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండ్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏజెన్సీపైనా చర్యలు తీసుకుంటామని పోలీసులు వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News