కాపు కాసి.. కత్తులతో వెంబడించి..
ABN , Publish Date - Feb 26 , 2026 | 06:36 AM
సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున చీకట్లో కాపుకాసిన దుండగులు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కత్తులతో వెంబడించి దారుణంగా పొడిచి చంపేసి పారిపోయారు.
భరత్‌నగర్‌లో వ్యక్తి దారుణ హత్య.. మృతుడు కర్ణాటకకు చెందిన వ్యక్తిగా గుర్తింపు
హైదరాబాద్ సిటీ: సనత్‌నగర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. బుధవారం తెల్లవారుజామున చీకట్లో కాపుకాసిన దుండగులు నడుచుకుంటూ వెళ్తున్న వ్యక్తిని కత్తులతో వెంబడించి దారుణంగా పొడిచి చంపేసి పారిపోయారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కర్ణాటకకు చెందిన శంకర్(55) కొంతకాలం క్రితం భార్య, పిల్లలతో కలిసి బతుకుదెరువు కోసం నగరానికి వచ్చాడు. భరత్‌నగర్(Bharatnagar)లో నివసిస్తూ మెట్రోస్టేషన్ వద్ద ఫేమస్ టీ అండ్ ఉడిపి సెంటర్‌లో హెడ్ కుక్‌గా పనిచేస్తున్నాడు.
బుధవారం తెల్లవారు జామున 4 గంటలకు విధులకు హాజరయ్యేందుకు నడుచుకుంటూ బయలుదేరాడు. భరత్‌నగర్ బ్రిడ్జి సమీపంలోకి రాగానే అక్కడ చీకట్లో కాపుకాసిన కొందరు గుర్తుతెలియని వ్యక్తులు అతడిని వెంబడించారు. కత్తులతో దాడిచేసి విచక్షణారహితంగా కడుపులో, ఇతర భాగాల్లో పొడిచి పారిపోయారు. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్‌లో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.
సమాచారం అందుకున్న సనత్‌నగర్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ప్రత్యేక క్రైమ్ టీమ్ రంగంలోకి దిగి సీసీ పుటేజీలను పరిశీలిస్తోంది. హత్య ఎవరు చేశారు..? ఎందుకు చేశారు..? అనేదానిపై స్పష్టత రాలేదు. వివాహేతర సంబంధమే హత్యకు కారణంగా పోలీసులు గుర్తించినట్లు తెలిసింది. మృతుడి ఫోన్‌కాల్స్, సీసీటీవీ ఫుటేజీలు, టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest Telangana News and National News