Share News

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలే లక్ష్యం

ABN , Publish Date - Feb 26 , 2026 | 06:14 AM

ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగా పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు.

ఐదేళ్లలో 20లక్షల ఉద్యోగాలే లక్ష్యం

  • 20నెలల్లో 1.09 లక్షలు కల్పించాం: మంత్రి లోకేశ్‌

  • స్కిల్‌ సెన్సె్‌సకు ఇబ్బందులు

  • ఏఐ ద్వారా స్కిల్‌ అసెస్మెంట్‌ చేస్తామన్న మంత్రి

అమరావతి, ఫిబ్రవరి 25(ఆంధ్రజ్యోతి): ఐదేళ్లలో ఇరవై లక్షల ఉద్యోగాల కల్పనే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోందని, అందులో భాగంగా పార్ట్‌నర్‌షిప్‌ సమ్మిట్‌లో ఒప్పందాలు చేసుకున్నామని మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి నారా లోకేశ్‌ చెప్పారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన 20నెలల్లో 1.09లక్షల ఉద్యోగాలు కల్పించినట్లు తెలిపారు. నిరుద్యోగ యువత కోసం ఉద్దేశించిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలు ఆశించిన ఫలితాలు అందిస్తున్నాయా.? అంటూ ఎమ్మెల్యే కన్నా లక్ష్మీనారాయణ అడిగిన ప్రశ్నకు బుధవారం అసెంబ్లీలో మంత్రి సమాధానం ఇచ్చారు. క్లస్టర్‌ విధానంలో ఉపాధి అవకాశాలు మెరుగు పరిచేందుకు ప్రయత్నిస్తున్నామని, ఇప్పటికే 760ప్రాజెక్టులు గుర్తించామని చెప్పారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో మూడు నెలలకు ఒకసారి ఉద్యోగ మేళా నిర్వహించబోతున్నామని, రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1,587నిర్వహించామన్నారు. ఇందులో 11,373పరిశ్రమలు పాల్గొని 1.09లక్షల మందికి ఉద్యోగాలు ఇచ్చాయని లోకేశ్‌ తెలిపారు. రాష్ట్రంలో నైపుణ్య పోర్టర్‌ ప్రారంభిస్తామన్న మంత్రి... స్కిల్‌ సెన్సెస్‌ చేద్దామనుకుంటే ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. అందుకే ఏఐ ద్వారా స్కిల్‌ అసెస్మెంట్‌ చేయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇందులో ఎలక్ట్రికల్‌, ప్లంబర్‌ వర్కర్స్‌ సహా ఇతరులు ఎవరికివారే యాప్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చన్నారు. వారికి తగిన శిక్షణ ఇస్తామని చెప్పారు. రాష్ట్రంలోని ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక స్కిల్‌ సెంటర్‌ ఏర్పాటు చేస్తామని చెప్పిన వైసీపీ.. అధికారంలోకి వచ్చిన తర్వాత మడమ తిప్పిందన్నారు. అప్పటికే ఉన్న స్కిల్‌ కార్పొరేషన్‌ ఉద్యోగుల్ని వైసీపీ నేతలు ఇళ్లల్లో పనికి పెట్టుకున్నారని, దీనిపై విచారణ జరుగుతోందని తెలిపారు. ఇంటర్న్‌షిప్‌ ముఖ్యమని భావించిన తాము ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావ్‌ నేతృత్వంలో కమిటీ ఏర్పాటు చేశామని చెప్పారు.


  • రాత్రింబవళ్లు అభివృద్ధి పనులు జరుగుతున్న రాజధాని ప్రాంతంలోని అన్ని పోలీసు స్టేషన్లలోనూ సిబ్బంది కొరత ఎక్కువగా ఉందని తాడికొండ ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ చెప్పారు. పోలీసు స్టేషన్‌కు ఎవరు.. ఎప్పుడు వెళ్లినా బందోబస్తు డ్యూటీల్లో ఉన్నారని సమాధానం వస్తోందని, ఈ విషయం డీజీపీకి చెప్పినా ఫలితం లేదని ఎమ్మెల్యే పెదవి విరిచారు. ఈ సమస్య అందరి వద్దా ఉంది.. మీరు మాట్లాడతారా.. అంటూ డిప్యూటీ స్పీకర్‌ హోం మంత్రి అనితను అడగ్గా ఆమె తల అడ్డంగా ఊపారు.

  • ఎచ్చెర్ల నియోజకవర్గంలోని కొవ్వాడలో న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌కు భూములిచ్చిన నిర్వాసితులకు అటు పునరావాస కాలనీ పూర్తిచెయ్యక, ఇటు ఉన్నచోట కనీస సౌకర్యాల్లేక తీవ్ర ఇబ్బంది పడుతున్నారని ఎచ్చెర్ల ఎమ్మెల్యే ఎన్‌.ఈశ్వరరావు ఆవేదన వ్యక్తం చేశారు. తాగునీటి సౌకర్యం కల్పించాలని అడిగితే.. ఎలాగూ ఆర్‌.ఆర్‌. కాలనీకి మారుతారు కదా.? అనే సమాధానం వస్తోందని, అది పూర్తయ్యేవరకూ ఆ ప్రజలు శిక్ష అనుభవించాల్సిందేనా.? అని ప్రశ్నించారు. ఎచ్చెర్ల ప్రాంతంలోని పారిశ్రామిక వ్యర్థాలతో అక్కడి మత్స్యకారులు మత్స్య సంపద కోల్పోయి ఉపాధికి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.

  • ‘మదనపల్లె ఫైల్స్‌ తరహాలోనే సర్వేపల్లి ఫైల్స్‌ ఉన్నాయి.. వందల కోట్ల విలువైన భూముల స్కామ్‌ వైసీపీ హయాంలో జరిగింది. ప్రభుత్వం ఖరీదైన భూముల్ని కాపాడుకోవాలి. విచారించి చర్యలు తీసుకోవాలి’ అని ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్‌ రెడ్డి కోరారు.

  • పేదలకు ఉచితంగా ఇస్తున్న రేషన్‌ బియ్యంలో 80శాతానికి పైగా దారి మళ్లుతున్నాయని, ప్రభుత్వానికి ఆర్థిక భారమైన ఈ సరఫరాపై సమీక్షించి సముచిత నిర్ణయం తీసుకోవాలని పొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులురెడ్డి కోరారు.

Updated Date - Feb 26 , 2026 | 06:14 AM