ఐటీ షేర్లతో మార్కెట్ జోష్.. వరుస నష్టాలకు బ్రేక్
ABN , Publish Date - Jul 27 , 2026 | 03:58 PM
వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి.
ఇంటర్నెట్ డెస్క్: వరుసగా ఐదు ట్రేడింగ్ సెషన్ల పాటు నష్టాలను చవిచూసిన దేశీయ స్టాక్ మార్కెట్లు సోమవారం బలంగా పుంజుకున్నాయి. కొనుగోళ్లు ఊపందుకోవడంతో ప్రధాన సూచీలన్నీ లాభాల్లో ముగిశాయి. సెన్సెక్స్ 776.01 పాయింట్లు ఎగబాకింది. నిఫ్టీ 228.5 పాయింట్లు పెరిగి 24 వేల మార్కుకు చేరువైంది. ప్రపంచ మార్కెట్ ర్యాలీ సహా అమెరికా, ఇరాన్‌లు సైనిక దాడులను నిలిపివేస్తామనే నిర్ణయం నేపథ్యంలో ముడి చమురు ధరలు తగ్గడంతో భారత ఈక్విటీలు ఈ వారాన్ని బలంగా ప్రారంభించాయి.
ఐటీ, మీడియా, రియాల్టీ, ఆటో, ఫార్మా రంగాల షేర్లలో కొనుగోళ్లు మార్కెట్‌కు ప్రధాన బలంగా నిలిచాయి. ఇక రంగాల వారీగా చూస్తే.. నిఫ్టీ మీడియా సూచీ 2.50 శాతం లాభంతో అగ్రస్థానంలో నిలిచింది. మరోవైపు.. నిఫ్టీ ఆయిల్ అండ్ గ్యాస్ మాత్రం స్వల్ప నష్టం(0.12శాతం)తో ముగిసింది. నిఫ్టీ సూచీలో ఎటర్నల్, ఇంటర్‌గ్లోబ్ ఏవియేషన్, ఇన్ఫోసిస్, బజాజ్ ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్ షేర్లు గరిష్ఠ లాభాలను నమోదు చేయగా.. ఓఎన్‌జీసీ, సిప్లా, హెచ్‌డీఎఫ్‌సీ లైఫ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, అదానీ పోర్ట్స్ షేర్లు ఒత్తిడికి లోనై నష్టాలను చవిచూశాయి.
అటు.. విదేశీ మారకద్రవ్య మార్కెట్లో రూపాయి కూడా బలపడింది. అమెరికా డాలర్‌తో పోలిస్తే రూపాయి 68 పైసలు పెరిగి డాలర్‌కు ₹95.89 వద్ద ముగిసింది. గత ట్రేడింగ్ సెషన్‌లో రూపాయి ₹96.57 వద్ద ముగిసింది.
ఇవీ చదవండి:
పేపర్ లీక్‌లపై కఠిన చర్యలు.. 'యాంటీ పేపర్ లీక్ బిల్లు'లో మార్పులివే..
విద్యార్థులపై దాడులు.. ప్రధాని మోదీ క్షమాపణ చెప్పాల్సిందే: ఎంపీ రాహుల్ గాంధీ