Jawan Satyanarayana: స్వగ్రామానికి జవాన్ సత్యనారాయణ మృతదేహం.. అంత్యక్రియలకు ఏర్పాట్లు
ABN , Publish Date - Jan 02 , 2026 | 03:17 PM
పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలం బొండాడపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొర్రా సత్యనారాయణ ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జవాన్ మృతితో బొండాడపేట గ్రామం మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
పశ్చిమగోదావరి, జనవరి2 (ఆంధ్రజ్యోతి): పశ్చిమగోదావరి జిల్లాలోని కాళ్ల మండలం బొండాడపేట గ్రామానికి చెందిన ఆర్మీ జవాన్ బొర్రా సత్యనారాయణ (26) (Army Jawan Borra Satyanarayana) ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంలో మృతి చెందడం తీవ్ర విషాదాన్ని నింపింది. జవాన్ మృతితో బొండాడపేట గ్రామం మొత్తం తీవ్ర శోకసంద్రంలో మునిగిపోయింది.
దేశ సేవలో నిమగ్నమైన యువ సైనికుడు ప్రమాదవశాత్తు ప్రాణాలు కోల్పోవడం పశ్చిమగోదావరి జిల్లాలో తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. బొర్రా సత్యనారాయణ భారత సైన్యంలో విధులు నిర్వహిస్తూ, క్రమశిక్షణతో పాటు దేశభక్తితో గుర్తింపు పొందిన జవాన్ బొర్రా సత్యనారాయణ అని స్థానికులు పేర్కొంటున్నారు. ఆయన మృతి వార్త తెలియగానే కుటుంబ సభ్యులు, బంధువులు, గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు.
బొర్రా సత్యనారాయణ మృతదేహాన్ని ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి రాజమండ్రి విమానాశ్రయానికి తరలించారు. అక్కడి నుంచి సైనిక, ప్రభుత్వ అధికారుల సమక్షంలో మృతదేహాన్ని స్వగ్రామమైన బొండాడపేటకు తీసుకెళ్లారు. ఆర్మీ అధికారులు అధికారిక లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు.
బొండాడపేట గ్రామంలో జవాన్ సత్యనారాయణకు ఘన నివాళులు అర్పించేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, రాజకీయ నాయకులు జవాన్ కుటుంబాన్ని పరామర్శించి సంతాపం తెలియజేశారు.
యువ వయసులోనే దేశ రక్షణ కోసం సేవలందించిన సత్యనారాయణ మృతి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి తీరని లోటుగా రాజకీయ నేతలు, గ్రామస్తులు పేర్కొంటున్నారు. ఆయన కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా సహాయం అందిస్తామని అధికారులు హామీ ఇచ్చారు. అలాగే ఆర్మీ నిబంధనల ప్రకారం పరిహారం, ఇతర సదుపాయాలు కుటుంబానికి అందనున్నట్లు సమాచారం.
మరోవైపు.. ఢిల్లీలో జరిగిన రైలు ప్రమాదంపై అధికారులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలపై స్పష్టత రావాల్సి ఉంది. అయితే దేశానికి సేవ చేస్తూ ప్రాణాలు కోల్పోయిన ఈ యువ జవాన్ త్యాగాన్ని ప్రజలు ఎప్పటికీ మర్చిపోరని గ్రామస్తులు భావోద్వేగంగా తెలిపారు. బొర్రా సత్యనారాయణ ఆత్మకు శాంతి చేకూరాలని, ఆయన కుటుంబానికి దేవుడు మనోధైర్యం ఇవ్వాలని గ్రామస్తులు ప్రార్థించారు.
ఇవి కూడా చదవండి...
శంకర్ విలాస్ ఆర్ఓబీ పనులపై పెమ్మసాని క్లారిటీ
వైసీపీకి ఊహించని షాక్.. టీడీపీలోకి కీలక నేత
Read Latest AP News And Telugu News