Share News

లోకేష్ ప్రకటన.. చరిత్రాత్మక నిర్ణయం: డిప్యూటీ స్పీకర్ రఘురామ

ABN , Publish Date - May 27 , 2026 | 05:53 PM

మహానాడు వేడుక వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు.

లోకేష్ ప్రకటన.. చరిత్రాత్మక నిర్ణయం: డిప్యూటీ స్పీకర్ రఘురామ
AP Assembly Dy Speaker Raghurama Krishnam Raju

భీమవరం, మే27: మహానాడు వేడుక వేదికగా రాబోయే ఎన్నికల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇస్తామని టీడీపీ కార్యనిర్వాహాక అధ్యక్షుడు నారా లోకేష్ ప్రకటించటం చరిత్రాత్మక నిర్ణయమని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు తెలిపారు. దీంతో దేశంలో అందరికన్నా ముందుగా మహిళలకు అత్యంత గౌరవం ఇచ్చే పార్టీగా ఈ నిర్ణయంతో టీడీపీ గుర్తించబడిందన్నారు. ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని ప్రకటించిన నారా లోకేష్, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడు వేడుకలు అద్భుతంగా జరుగుతున్నాయని పేర్కొన్నారు.


బుధవారం పశ్చిమగోదావరి జిల్లా ఉండిలో నిర్వహించిన మహానాడులో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు మాట్లాడుతూ.. రఘురామకు షాక్ ఇచ్చిన సుప్రీంకోర్టు అంటూ జడ శ్రవణ్ కుమార్ పచ్చి అబద్ధాలు ఆడుతున్నారని మండిపడ్డారు. అతడు ఎన్ని అబద్ధాలు ఆడాడో సుప్రీంకోర్టులో రికార్డ్ చేయడం జరిగిందని.. వాటిని చూపిస్తానని చెప్పారు. వాటిని చూసి అతడికి విజ్ఞులైన ప్రజలు బుద్ధి చెప్పాలని సూచించారు. ఆకివీడులో ఆలయ నిర్మాణానికి ఒక్కరోజు కూడా ఆలస్యం జరగదని ఈ సందర్భంగా రఘురామకృష్ణరాజు తెలిపారు. దీనిపై సుప్రీంకోర్టు తీర్పు మనకు అనుకూలంగా వస్తుందన్నారు. అందులో ఎటువంటి సందేహము లేదని చెప్పారు.


అనుకున్న సమయానికి రామాలయాన్ని పూర్తి చేస్తామని శ్రీరామభక్తులకు తెలియజేస్తున్నానన్నారు. తెలుగువీర లేవరా అనే ఫోరంను స్థాపించామని వివరించారు. దీనికి చాలా చక్కటి స్పందన వస్తుందన్నారు. అలాగే తెలుగువీర లేవరా వెబ్‌సైట్‌ కూడా ఒకటి రెండు రోజుల్లో ప్రారంభిస్తామని ప్రకటించారు. ఓట్ల రాజకీయం కోసం మనకెందుకులే అని వదిలేస్తున్న అంశాలను తీసుకుని న్యాయం చేయడమే ఈ తెలుగు వీర లేవరా ఫారం ముఖ్య ఉద్దేశమని ఏపీ అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ వివరించారు. తాను ప్రాతినిధ్యం వహించే ఉండి నియోజకవర్గంలో అన్ని ప్రార్ధన మందిరాలలో లౌడ్ స్పీకర్లు సమూలంగా నిర్మూలించామని చెప్పారు.


ప్రజలకు లౌడ్ స్పీకర్ల వల్ల ఇబ్బంది ఉంటే వెంటనే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలని ప్రజలకు స్పష్టం చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు చర్యలు తీసుకోకుంటే.. వారిపై తాము చర్యలు తీసుకుంటామని ప్రజలకు రఘురామకృష్ణరాజు పేర్కొన్నారు. ఈ శబ్ద కాలుష్య అంశాన్ని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దృష్టికి తీసుకెళ్తానన్నారు. పవన్ కళ్యాణ్ సర్జరీ అయిన తర్వాత రెట్టింపు ప్రోత్సాహంతో పర్యావరణాన్ని పరిరక్షించాలంటూ ఆయన స్పందిస్తున్న తీరు అత్యంత ప్రశంసనీయమని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు సంతోషం వ్యక్తం చేశారు.


ఈ వార్తలు కూడా చదవండి..

కొనసాగుతున్న మాటల యుద్ధం.. కేటీఆర్‌కు పొంగులేటి సవాల్..

పోలీసుల కస్టడీకి భగీరథ్.. మొయినాబాద్‌లో ఫామ్‌హౌస్‌కు తరలింపు..

For More TG News And Telugu News

Updated Date - May 27 , 2026 | 06:01 PM