విదేశీ ఉద్యోగం పేరుతో యువకులకు టోకరా
ABN , Publish Date - Feb 13 , 2026 | 07:54 AM
పశ్చిమ గోదావరి జిల్లాలో నిరుద్యోగులే లక్ష్యంగా కేటుగాళ్లు పంజా విసిరారు. విదేశాల్లో ఉద్యోగం, లక్షల్లో జీతం అంటూ కలలు చూపించి, అమాయకుల నుంచి భారీగా వసూళ్లకు పాల్పడ్డారు. నర్సాపురం నియోజకవర్గంలో వెలుగుచూసిన ఈ ఘటన ఇప్పుడు స్థానికంగా సంచలనం సృష్టిస్తోంది.
పశ్చిమగోదావరి, ఫిబ్రవరి 13 (ఆంధ్రజ్యోతి): ఇటీవల గల్ఫ్ ఉద్యోగాల పేరుతో మోసాలు (Job Scam) పెరుగుతున్నాయి. నిరుద్యోగం పెరుగుతుండటంతో యువత విదేశాల వైపు చూస్తోంది. ఈ పరిస్థితిని సొమ్ము చేసుకుంటూ కొందరు మోసగాళ్లు సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపుల ద్వారా నకిలీ ప్రకటనలు ఇస్తున్నారు. తక్షణం వీసా, అధిక జీతం, ఉచిత వసతి వంటి ప్రకటనలతో యువతను ఆకర్షిస్తున్నారు. కానీ చాలా సందర్భాల్లో ఇవి పూర్తిగా నకిలీగా తేలుతున్నాయి. తాజాగా.. పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురంలో విదేశీ ఉద్యోగాల పేరుతో మరో భారీ మోసం వెలుగులోకి వచ్చింది. దుబాయ్‌లో మంచి జీతాలతో ఉద్యోగాలు కల్పిస్తామని నమ్మబలికి 11 మంది నిరుద్యోగుల నుంచి మొత్తం రూ.27 లక్షలు వసూలు చేసి, నకిలీ వీసాలు, అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలు ఇచ్చి మోసం చేసిన ఘటన స్థానికంగా సంచలనం సృష్టించింది. ఈ ఘటనతో బాధిత కుటుంబాలు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయాయి. మోసపోయిన యువకులు నరసాపురం రూరల్ పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని కోరుతున్నారు.
విదేశీ ఉద్యోగాలపై ఆశ..
ప్రస్తుతం గల్ఫ్ దేశాల్లో ముఖ్యంగా దుబాయ్‌లో ఉద్యోగాలపై యువత అధిక ఆసక్తి కనబరుస్తున్నారు. మంచి జీతాలు, సౌకర్యవంతమైన జీవితం అనే ఆశతో చాలామంది యువకులు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారు. ఈ ఆశనే ఆసరాగా తీసుకున్న కొందరు మోసగాళ్లు నకిలీ రిక్రూట్‌మెంట్ ఏజెన్సీల పేరుతో నిరుద్యోగులను వలలో వేసుకుంటున్నారు. నర్సాపురం పరిసర ప్రాంతాలకు చెందిన 11 మంది యువకులను లక్ష్యంగా చేసుకున్న ఈ మోసగాళ్లు.. దుబాయ్‌లో ప్రముఖ కంపెనీల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఒక్కొక్కరితో రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు వసూలు చేసినట్లు సమాచారం. మొత్తం రూ.27 లక్షలు సేకరించి.. కొంతకాలం తర్వాత నకిలీ వీసాలు, ఫేక్ అపాయింట్మెంట్ ఆర్డర్లు అందజేశారు.
నకిలీ వీసాలు..
ఏజెంట్లు ఇచ్చిన వీసాలు, అపాయింట్మెంట్ ఆర్డర్ కాపీలను చూసి మొదట బాధితులు ఆనందపడ్డారు. విమాన టికెట్ల ఏర్పాట్లు చేస్తున్నామని కూడా చెప్పడంతో వారు పూర్తిగా నమ్మారు. కానీ ప్రయాణానికి ముందు వీసా వెరిఫికేషన్ సమయంలో అవి నకిలీవని బయటపడింది. దీంతో బాధితులు ఏజెంట్లను సంప్రదించగా.. వారు ఫోన్‌లు స్విచ్ఛాఫ్ చేసి పరారయ్యారు. కొన్ని రోజులు వెతికినా ఫలితం లేకపోవడంతో చివరకు బాధితులు నరసాపురం రూరల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించారు.
కుటుంబాలపై తీవ్ర ఆర్థిక భారం
మోసపోయిన యువకుల్లో కొందరు రైతు కుటుంబాలకు చెందినవారు కాగా మరికొందరు చిన్నచిన్న పనులు చేసి సొమ్ము కూడబెట్టిన వారు ఉన్నారు. కొందరు తమ ఇళ్లను పణంగా పెట్టి, మరికొందరు అప్పులు చేసి డబ్బులు సమకూర్చినట్లు తెలుస్తోంది. విదేశీ ఉద్యోగం వస్తే అప్పులు తీర్చి కుటుంబ పరిస్థితి మెరుగుపడుతుందని ఆశించారు. కానీ ఇప్పుడు అప్పుల భారం, అవమానం, నిరాశ మాత్రమే మిగిలాయని యువకులు లబోదిబోమంటున్నారు.
పోలీసుల చర్యలు..
బాధితుల ఫిర్యాదు మేరకు నరసాపురం రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఏజెంట్ల వివరాలు, వారి బ్యాంక్ ఖాతాలు, డబ్బుల లావాదేవీలపై సమాచారం సేకరిస్తున్నారు. ఫేక్ వీసాలు ఎక్కడ తయారయ్యాయి? ఇంకెవరైనా బాధితులున్నారా? అనే అంశాలపై పోలీసుల విచారణ కొనసాగుతోంది. పోలీసులు యువతకు పలు సూచనలు చేశారు. విదేశీ ఉద్యోగాల విషయంలో గుర్తింపు పొందిన, ప్రభుత్వ అనుమతితో ఉన్న ఏజెన్సీలను మాత్రమే సంప్రదించాలని, ఎలాంటి రసీదులు లేకుండా డబ్బులు చెల్లించవద్దని సూచించారు.
బాధితుల వేదన
మోసపోయిన యువకులు మాట్లాడుతూ, ‘మా జీవితాలను చీకట్లోకి నెట్టేశారు. మా కుటుంబాలు అప్పుల్లో మునిగిపోయాయి. మాకు న్యాయం చేయాలి’ అని కోరుతున్నారు. కొందరు భావోద్వేగంతో కన్నీళ్లు పెట్టుకున్నారు. విదేశీ ఉద్యోగ మోసాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. మోసగాళ్లపై కఠిన శిక్షలు విధిస్తేనే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. జిల్లా స్థాయిలో ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని కూడా సూచిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగంపై ధన్యవాదాల తీర్మానం, చర్చలు
ప్రైవేట్ కంపెనీలకు భూముల కేటాయింపుపై శాసనమండలిలో వాడివేడి చర్చ
Read Latest Telangana News And AP News And Telugu News