ఇవేమి ఆహ్వానాలు!
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:44 AM
భోగాపురంలో నిర్మించిన నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవ ఆహ్వానాల్లో అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ముఖ్యులైన వారికి ఆహ్వానపత్రాలు నేరుగా ఇవ్వలేదు.
రీల్స్ అప్‌లోడ్ చేసేవారికి వీవీఐపీ పాస్‌లు
వ్యాపార ప్రముఖులకు వీఐపీ పాస్‌లే
విశాఖపట్నం, జూలై 31(ఆంధ్రజ్యోతి): భోగాపురంలో నిర్మించిన నూతన విమానాశ్రయం ప్రారంభోత్సవ ఆహ్వానాల్లో అధికారులు కొంత నిర్లక్ష్య వైఖరి ప్రదర్శించారు. ముఖ్యులైన వారికి ఆహ్వానపత్రాలు నేరుగా ఇవ్వలేదు. ఇంకో 20 గంటల్లో ప్రారంభోత్సవం ఉందనగా వ్యాపార ప్రముఖులకు ఫోన్లు చేసి... మీ ఇన్విటేషన్, కారు పాస్ ఫలానా దగ్గర ఉన్నాయని, వెళ్లి తీసుకోవాలని సూచించారు. విశాఖ నగరానికి చెందిన పలువురు వ్యాపార ప్రముఖులకు వీఐపీ పాస్‌లు మాత్రమే ఇచ్చారు. కానీ సోషల్ మీడియాలో రీల్స్ అప్‌లోడ్ చేసేవారికి మాత్రం ‘వీవీఐపీ’ పాస్‌లు ఇవ్వడం చర్చనీయాంశమైంది.
‘వైజాగ్’ పేరు అధికారికమా..?
విశాఖపట్నాన్ని చాలామంది ‘వైజాగ్’ అని కూడా పిలుచుకుంటారు. ఇది వాడుకకే పరిమితం తప్ప అధికారికం కాదు. అధికారికంగా విశాఖపట్నం అనే రాయాలి. కానీ విమానాశ్రయం ప్రారంభోత్సవం ఆహ్వాన పత్రాలపై ‘వైజాగ్’ అని పెద్ద అక్షరాలు ముద్రించి దాని కింద అల్లూరి సీతారామరాజు ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు అని ముద్రించారు. ఈ పత్రాలను విజయనగరం జిల్లా జాయింట్ కలెక్టర్ పేరుతో పంపిణీ చేశారు.