‘గిన్నిస్’కు ఎక్కిన థింసా
ABN , Publish Date - Aug 01 , 2026 | 07:53 AM
13 వేలమంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్య ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది.
13 వేల మంది గిరిజన బాలికలతో ప్రదర్శన
విజయనగరం, జూలై 31 (ఆంధ్రజ్యోతి): 13 వేలమంది గిరిజన బాలికలతో ప్రదర్శించిన థింసా నృత్యం గిన్నీస్ బుక్ అఫ్ రికార్డ్సులో చోటు దక్కించుకుంది. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా థింసా నృత్య ప్రదర్శనను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. దీనికి సన్నాహంగా శుక్రవారం రిహార్సల్స్ నిర్వహించారు. ఆకుపచ్చ అంచు కలిగిన పింక్ రంగు చీరలను అందరూ ధరించారు. నుదుటిన బొట్టు, చేతికి ఆకుపచ్చ గాజులు, గిరిజన సంస్కృతిలో భాగంగా శిరోజాలను ముడివేసి పూలు పెట్టుకుని, చేత్తో నెమలి పింఛాలను ఆడిస్తూ నృత్యం చేశారు. గిరిజన సంప్రదాయాలను ప్రతిబింబించేలా.. ఏకరూప వస్త్రధారణ, ఆలంకరణతో నృత్యం అదరగొట్టారు. వేలాదిమందితో ఉత్సాహంగా సాగిన ప్రదర్శనను గిన్నిస్ బుక్ ఆఫ్ రికార్ట్సు ప్రతినిధులు ప్రత్యక్షంగా తిలకించారు. అనంతరం గిన్నిస్ రికార్డ్సుకు సబంధించిన సర్ఠిఫికెట్‌ను గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణికి అందజేశారు. ఉత్తరాంధ్ర సంస్కృతి, సంప్రదాయాల విశిష్ఠతను ప్రపంచానికి చాటిచెప్పేలా.. ఈ వేడుకను ఘనంగా నిర్వహించారు.
7 వేలమంది పోలీసులతో భద్రత
భోగాపురం విమానాశ్రయం పండగ శోభ సంతరించుకుంది. విద్యుత్ కాంతులతో విరాజిల్లుతోంది. ఏటీసీ, టెర్మినల్, ఎయిర్ పోర్టుకు చేరుకునే మార్గాలు, సభా ప్రాంగణాలను విద్యుత్ దీపాలతో అలంకరించారు. విమానాశ్రయ ప్రారంభోత్సవాన్ని కూటమి ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా తీసుకుంది. సీఎం చంద్రబాబు, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌నాయుడు నిత్య సమీక్షలు నిర్వహిస్తున్నారు. మంత్రి లోకేశ్ నేతృత్వంలో 11 మంది మంత్రుల బృందం నాలుగు రోజులుగా ఇక్కడే ఉండి ఏర్పాట్లను పర్యవేక్షిస్తోంది. రాష్ట్రంలోని అనేక ప్రాంతాలనుంచి ఐపీఎస్ అధికారులతో పాటు, 7,000 పోలీసులతో పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశారు. అలాగే 700 మంది డాక్టర్లు, వైద్యసిబ్బందితో పాటు 130 వైద్యశిబిరాలను నెలకొల్పారు. విద్యుత్‌కు అంతరాయం కలగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. 50 హైఓల్టేజీ ట్రాన్స్‌ఫార్మర్లు అందుబాటులో ఉంచారు. ఎస్‌ఈ, డీఈ, ఏఈఈ సహా 200 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు.