Share News

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ గుర్తింపు

ABN , Publish Date - Jul 05 , 2026 | 01:08 PM

విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు.

విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ గుర్తింపు
Vizag Missing Fishermen,

విశాఖపట్నం, జులై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం చేపల రేవు నుంచి వేటకు వెళ్లిన ఏడుగురు మత్స్యకారులు సముద్రంలో గల్లంతైన ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు. గల్లంతైన మత్స్యకారుల్లో కారె చిన్నయ్యను సముద్రంలో ప్రయాణిస్తున్న ఒక వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి సురక్షితంగా కాపాడారు. చిన్నయ్యతో పాటు మరో నలుగురు మత్స్యకారులు కూడా అదే ప్రాంతంలో ఉన్నారు. అయితే వారు వాణిజ్య నౌకపైకి ఎక్కలేకపోయినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో ఆ నలుగురు మత్స్యకారులను సురక్షితంగా తీసుకురావడానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేపట్టారు.


సంబంధిత సముద్ర భద్రతా సంస్థలు, నౌకాదళం, కోస్ట్ గార్డ్ సమన్వయంతో రక్షణ చర్యలను వేగవంతం చేస్తున్నాయి. ఇంకా గల్లంతైన మరో ఇద్దరు జాలర్ల కోసం సముద్రంలో విస్తృత స్థాయిలో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. వాతావరణ పరిస్థితులు, సముద్ర అలల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక బృందాలు నిరంతరం అన్వేషిస్తున్నాయి. వీరిని సురక్షితంగా గుర్తించేందుకు అన్ని విధాలుగా ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. ఈ ఘటనతో మత్స్యకారుల కుటుంబాల్లో కొంత ఊరట నెలకొన్నప్పటికీ, ఇంకా ఇద్దరు జాలర్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతుండటంతో ఆందోళన కొనసాగుతోంది.


విశాఖపట్నానికి 10 మైళ్ల దూరంలో ప్రమాదం: మత్స్యకారుడు చిన్నయ్య

గల్లంతైన బోటు,IND-AP-MM-V5-83 డ్రైవర్, మత్స్యకారుడు కారె చిన్నయ్య సురక్షితoగా ఉన్నారు. ఆయనను యూనివర్సల్, కార్గో షిప్ రక్షించాయి. ఈ సందర్భంగా చిన్నయ్య మాట్లాడారు. విశాఖపట్నానికి సుమారుగా 10 మైళ్ల దూరంలో ఉండగా, ఒక్కసారిగా పెద్ద గాలి రావడంతో బోటు బోల్తా పడిందని.. అదే బోటును పట్టుకొని రాత్రి 9 గంటల వరకు, అలాగే ఉన్నామని చెప్పారు. రాత్రి బోటు మునిగిపోయిన తర్వాత, తెల్లవారేసరికి ఐదుగురం ఈత ఈదుకుంటూ కొంత దూరం వెళ్లామని.. అక్కడ తమకు భారీ నౌక కనిపించిందని తెలిపారు. ఆ భారీ నౌక ఎదురుగా వెళ్లి యాంగర్‌ని తాను పట్టుకున్నానని చెప్పారు. తాను గట్టిగా అరవడంతో కార్గో షిప్ వాళ్లు గమనించి తనను పైకి లాగారని అన్నారు. మిగతా ముగ్గురు అక్కడ వరకు వచ్చి గల్లంతయ్యారని చెప్పారు. బోట్లో ఉన్న వాళ్లందరూ తమ కుటుంబ సభ్యులు తన కళ్లముందే.. గల్లంతయ్యారని కారె చిన్నయ్య తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.


జులై 1న సముద్రంలో వేటకు..

కాగా, జులై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 నంబర్ గల బోటులో ఏడుగురు వ్యక్తులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారడంతో తిరిగి హార్బర్‌కు చేరుకోవాలని నిర్ణయించారు.


జులై 4న మత్స్యకారుల గల్లంతు..

అయితే, జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మధ్యాహ్నం 3 గంటల్లోపు హార్బర్‌కు చేరుకుంటామని మత్స్యకారులు తెలిపారు. కానీ సాయంత్రం 5 గంటలు దాటినా వారి బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం మత్స్యకారుల వద్ద ఉన్న ఆరు మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ కావడంతో అధికారులకు సమాచారం అందించారు.


గాలింపు చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు..

ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన మత్స్యకారులను గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.


ఈ వార్తలు కూడా చదవండి...

అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్

డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్‌లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Jul 05 , 2026 | 02:46 PM