టీసీలు ఇవ్వడానికి ససేమిరా!
ABN , Publish Date - May 06 , 2026 | 01:18 AM
ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి.
టీసీలు ఇవ్వడానికి ససేమిరా!
ప్రభుత్వ పాఠశాలల్లో చేరేందుకు సిద్ధమైన
విద్యార్థులకు ప్రైవేటు స్కూళ్ల మోకాలడ్డు
విద్యా శాఖ అధికారులకు హెచ్‌ఎంల ఫిర్యాదు
ఎంఈవోల మెతక వైఖరే కారణమని ఆరోపణ
ప్రైవేటు పాఠశాలలకు అంగన్‌వాడీల పిల్లలు
కొన్ని కేందాల్లో కార్యకర్తల సహకారం
విశాఖపట్నం, మే 5 (ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల ప్రవేశాలు భారీగా పెంచాలన్న సర్కారు లక్ష్యానికి జిల్లాలో కొన్ని ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయి. తమ వద్ద చదువుతూ ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి సిద్ధమైన విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. ఆయా ప్రైవేటు పాఠశాలల పట్ల మండల విద్యాశాఖాధికారులు మెతక వైఖరితో ఉండడమే ఇందుకు కారణమనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి.
వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలల్లో ప్రవేశాలు పెంచాలనే ఉద్దేశంతో గత నెల రెండో వారం నుంచి ప్రత్యేక డ్రైవ్ చేపట్టారు. పాఠశాలలకు వేసవి సెలవులు ప్రకటించే సమయానికి జిల్లాలో ఒకటి, ఆరో తరగతిలో చేర్పించడానికి 3,200 మంది విద్యార్థుల తల్లిదండ్రులు సమ్మతి తెలిపారు. వేసవి సెలవులు ప్రకటించినప్పటికీ పాఠశాలలు తెరిచేంత వరకు చేరికలపై రోజువారీ సమీక్ష నిర్వహించాలని విద్యా శాఖ నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొన్ని ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వ్యవహరిస్తున్న తీరును పలువురు హెచ్‌ఎంలు విద్యా శాఖ అధికారుల దృష్టికి తీసుకువచ్చారు. తల్లిదండ్రులకు పలు రకాలుగా నచ్చజెబుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చేర్చేంచేలా ప్రయత్నిస్తున్నామని, అయితే విద్యార్థులకు టీసీలు ఇవ్వడానికి ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు నిరాకరిస్తున్నాయని ఫిర్యాదు చేశారు.
ప్రభుత్వ పాఠశాలల్లో చేరడానికి ముందుకువచ్చే విద్యార్థులు టీసీలు సమర్పిస్తే ఆన్‌లైన్‌లో పేర్లు నమోదుచేసి ప్రవేశాలు కల్పించాల్సి ఉంది. రోజువారీ ఎంతమంది విద్యార్థులకు ప్రవేశాలు కల్పించారనేది విద్యా శాఖ అధికారులు సమీక్షిస్తున్నారు. చేరతామని చెబుతున్న విద్యార్థుల సంఖ్యకు, ప్రవేశాలు కల్పించిన విద్యార్థుల సంఖ్యకు మధ్య తేడా ఉండడంతో అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఒక పాఠశాల నుంచి మరో పాఠశాలకు విద్యార్థి వెళ్లినప్పుడు ముందుగా చదివిన పాఠశాల యూడైస్ నుంచి విద్యార్థి పేరు తొలగించి, ఆ వివరాలను ఆన్‌లైన్‌లోని డ్రాప్ బాక్స్‌లో వేయాలి.
డ్రాప్ బాక్స్‌లో విద్యార్థి పేరు, ఐడీ నంబరును కొత్తగా చేరనున్న పాఠశాల ప్రతినిధులు తీసుకుని తమ ఖాతాలో నమోదు చేసుకోవాలి. అయితే ఐడీ నంబర్లను తొలగించి, డ్రాప్ బాక్స్‌లో వేయకుండా పలు ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలు మోకాలడ్డుతున్నాయని పలువురు హెచ్‌ఎంలు తాజాగా ఉన్నతాఽధికారులకు నివేదించారు. పాఠశాలలు తెరిచిన తరువాత టీసీలు ఇస్తామని కొందరు, ప్రస్తుతం తమ స్కూల్‌లో నాన్‌టీచింగ్ స్టాఫ్ లేరని మరికొందరు చెబుతున్నారని హెచ్‌ఎంలు ఫిర్యాదు చేశారు. దీనిపై ఎంఈవోలకు ఫిర్యాదు చేస్తున్నా అంతగా పట్టించుకోవడం లేదని ఆరోపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల పట్ల ఎంఈవోలు మెతకవైఖరి ప్రదర్శిస్తున్నారంటున్నారు. రాష్ట్రస్థాయిలో ఎన్‌రోల్‌మెంట్‌లో విశాఖ జిల్లా చివరి స్థానంలో ఉండడానికి ప్రైవేటు యాజమాన్యాలు టీసీలు ఇవ్వకపోవడం ఒక కారణమని ఆరోపిస్తున్నారు.
ఇదిలావుండగా అంగన్‌వాడీల్లో చదువుకునే పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో ఒకటో తరగతిలో చేరేందుకు కొన్నిచోట్ల కేంద్రాల కార్యకర్తలు సహకరించడం లేదని హెచ్‌ఎంలు ఫిర్యాదు చేస్తున్నారు కొందరు అంగన్‌వాడీ కేంద్రాల నిర్వాహకులు స్థానికంగా ఉన్న ప్రైవేటు పాఠశాలల యాజమాన్యాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని, దీనిపై జిల్లా స్థాయిలో అధికారులు జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు.