విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదం.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల పరిహారం
ABN , Publish Date - Jun 09 , 2026 | 02:56 PM
విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రకటించారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు.
విశాఖపట్నం, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాద మృతుల కుటుంబాలకు రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.25 లక్షల పరిహారం అందజేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) ప్రకటించారు. గాయపడినవారికి రూ.10 లక్షల చొప్పున పరిహారం ఇస్తామని తెలిపారు. ఈరోజు (మంగళవారం) విశాఖపట్నంలో మంత్రి లోకేశ్ పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్టీల్ ప్లాంట్‌లో నిన్న జరిగిన ఘటన చాలా బాధాకరమని అన్నారు. 4.15 నిమిషాలకు ఈ ప్రమాదం జరిగిందని తెలియగానే కేంద్రమంత్రులు కుమారస్వామి, శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రులు ఇక్కడికి వచ్చారని తెలిపారు. ఈ ఘటనలో 9 మంది చనిపోయారని... 6 మంది గాయపడ్డారని చెప్పారు. తాము పరిహారం ఇవ్వడానికి ఇక్కడకు రాలేదని... శాశ్వతంగా బాధితులకు అండగా ఉంటామని లోకేశ్ భరోసా కల్పించారు. బాధిత కుటుంబాలతో సమావేశం ఏర్పాటు చేస్తామని అన్నారు. కార్మికులకు పూర్తిగా అండగా ఉంటామని భరోసా కల్పించారు.
చిత్తశుద్ధితో స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నాం..
తమకు ఉన్న చిత్తశుద్ధితో విశాఖ స్టీల్ ప్లాంట్‌ను కాపాడుకున్నామని లోకేశ్ స్పష్టం చేశారు. తమకు వాట్సాప్ గ్రూప్ ఒకటి ఉందని.. రాష్ట్రంలో ఎక్కడ ఏ ఘటన జరిగినా తాము తక్షణమే అక్కడకు వెళ్తామని.. అందులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా ఉన్నారని ప్రస్తావించారు. ఉక్కు కార్మికులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని మాటిచ్చారు. ‘విశాఖ ఉక్కు - ఆంధ్రుల హక్కు’తో స్టీల్ ప్లాంట్‌ని సాధించుకున్నామని వ్యాఖ్యానించారు. 32 మంది ప్రాణ త్యాగాలతో స్టీల్ ప్లాంట్ ఏర్పడిందని ప్రస్తావించారు.
అపోహలు సృష్టించొద్దు..
ఈ ఘటనపై కార్మిక సంఘాల నేతలు కావాలని అపోహలు సృష్టించొద్దని అన్నారు. 24 గంటలు గడవక ముందే ఇలా మాట్లాడటం భావ్యం కాదని చెప్పారు. విశాఖ ఉక్కును కాపాడాలని కార్మికులు తమను కోరుతున్నారని అన్నారు. విశాఖ ఉక్కుకు పూర్వవైభవం తీసుకువస్తామని చెప్పుకొచ్చారు. ఉత్తరాంధ్రలో పెద్దఎత్తున కంపెనీలు వస్తున్నాయని వివరించారు. మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయీ హయాంలో విశాఖ స్టీల్‌కు సంక్షోభం వస్తే.. ఆనాడు మనం కాపాడుకున్నామని మంత్రి లోకేశ్ తెలిపారు.
జగన్‌పై సెటైర్లు..
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి లోకేశ్ చురకలు అంటించారు. ‘ఇంత భారీ ప్రమాదం జరిగితే ఇక్కడకు ప్రతిపక్ష టీమ్ లెవెన్ నుంచి కెప్టెన్ వచ్చారా..?. టీం లెవెన్ కెప్టెన్‌కు సమాధానం చెప్పాల్సిన అవసరం మాకు లేదు. మాకు 124 స్థానాలు ఇచ్చిన ప్రజలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత మాకు ఉంది. పరదాలు కట్టుకొని వెళ్లే వారికి కాదు’ అని లోకేశ్ సెటైర్లు గుప్పించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. సీఎం తీవ్ర దిగ్భ్రాంతి
ప్రధాని మోదీ నేతృత్వంలో ఎన్డీఏ సమావేశం.. హాజరుకానున్న చంద్రబాబు, పవన్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News