తిరుపతి జిల్లాలో ప్రమాదం.. క్రేన్ బోల్తాపడి ముగ్గురు కార్మికుల మృతి
ABN , Publish Date - Sep 30 , 2026 | 08:37 AM
తిరుపతి జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భవన నిర్మాణ ప్రాంతంలో ప్రమాదవశాత్తు క్రేన్ అదుపుతప్పి ముగ్గురు కార్మికులు మృతి చెందారు. వివరాల్లోకి వెళితే..
తిరుపతి, సెప్టెంబర్ 30: జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. టౌన్ ప్లానింగ్ అధికారుల నిర్లక్ష్యం ముగ్గురు కార్మికుల ప్రాణాలను బలి తీసుకుంది. డీబీఆర్ హాస్పిటల్ రోడ్డులోని శ్రీ కన్వెన్షన్ హాల్ సమీపంలో నిర్మాణ ప్రాంతంలో ప్రమాదవశాత్తు క్రేన్ అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు కార్మికులు అక్కడికక్కడే మృతి చెందారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే కార్మికులు మృతి చెందారని తోటి కార్మికులు ఆరోపిస్తున్నారు.
ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. కాగా.. ఈ ఘటనపై మున్సిపల్ కమిషనర్ జయకృష్ణ స్పందించారు. ఈ ప్రమాదానికి నైతిక బాధ్యత వహించాలంటూ ఇద్దరు టౌన్ ప్లానింగ్ అధికారులు పూర్ణ చంద్రబాబు, భాను ప్రకాష్ రెడ్డిలపై సస్పెన్షన్ వేటు వేశారు. ఈ నేపథ్యంలో భవన నిర్మాణ పర్యవేక్షణలో లోపాలపై విచారణకు కమిషనర్ ఆదేశాలు జారీ చేశారు. ఈ ప్రమాద ఘటనపై పారదర్శక, సమగ్ర విచారణ చేపట్టడానికి ఉన్నతస్థాయి అధికారులను నియమించారు. ఘటనలో ప్రమేయం ఉన్న అధికారులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ జయకృష్ణ ప్రకటించారు.
ఈ మేరకు సర్వేపల్లి రాధాకృష్ణ మున్సిపల్ స్కూల్ భవన నిర్మాణంపై పూర్తి స్థాయి నివేదిక ఇవ్వాలని సంబంధిత అధికారులను కమిషనర్ ఆదేశించారు. అనుమతులు లేకుండా అక్రమ నిర్మాణాలు చేపడితే కఠిన చర్యలు తప్పవని కమిషనర్ జయకృష్ణ హెచ్చరికలు జారీ చేశారు.
ఈ వార్తలనూ చదవండి..
హై బీమ్ ఎల్‌ఈడీ లైట్లతో అగచాట్లు
వేర్వేరు ఘటనల్లో ఐదుగురి బలవన్మరణం