Share News

దంచికొట్టిన వాన

ABN , Publish Date - May 02 , 2026 | 12:24 AM

Heavy rain.. Damage to crops జిల్లాలో అకాల వర్షం భారీగా కురిసింది. శుక్రవారం వేకువజామున ఓవైపు ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా.. మరోవైపు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం 8 గంటల తర్వాత ఎండకాచినా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్లీ వాతావరణం మారిపోయింది.

దంచికొట్టిన వాన
శ్రీకాకుళంలో కురుస్తున్న వర్షం

  • ఉరుములు మెరుపులతో వర్షం

  • ఈదురుగాలుల బీభత్సం

  • మామిడి, జీడి, అరటి పంటలకు నష్టం

  • పలుచోట్ల విరిగిన విద్యుత్‌ స్తంభాలు

  • గోతుల్లో చేరిన వర్షపునీటితో ఇబ్బందులు

  • శ్రీకాకుళం/ నరసన్నపేట/ గార/ బూర్జ/ టెక్కలి/ సరుబుజ్జిలి/ సంతబొమ్మాళి, మే 1(ఆంధ్రజ్యోతి):

  • జిల్లాలో అకాల వర్షం భారీగా కురిసింది. శుక్రవారం వేకువజామున ఓవైపు ఉరుములు, మెరుపులతో వర్షం కురవగా.. మరోవైపు ఈదురుగాలులు బీభత్సం సృష్టించాయి. ఉదయం 8 గంటల తర్వాత ఎండకాచినా.. మధ్యాహ్నం 3 గంటల నుంచి మళ్లీ వాతావరణం మారిపోయింది. సాయంత్రం 5 గంటల సమయంలో ఉరుములు, మెరుపులు, పిడుగులతో.. భారీ వర్షం కురిసింది. అత్యధికంగా ఆమదాలవలస మండలంలో 30.75 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈదురుగాలుల ధాటికి జిల్లాలో పలుచోట్ల విద్యుత్‌ స్తంభాలు విరిగిపోయాయి. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో కొన్ని గంటలపాటు విద్యుత్‌ సరఫరా నిలిచిపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్‌ సిబ్బంది పునరుద్ధరణ పనులు చేపట్టారు.

  • అన్నదాతకు తీవ్రనష్టం

  • అకాల వర్షాలతో అన్నదాతకు నష్టం వాటిల్లింది. ఈదురుగాలులతో వర్షం పడటంతో వరి, మొక్కజొన్న, అరటి, మామిడి, జీడిమామిడి,నువ్వు పంటలకు తీవ్ర నష్టం కలిగింది. నరసన్నపేట మండలంలో జమ్ము, తామరాపల్లి, ఉర్లాం, కంబకాయి. చోడవరం కిళ్లాం, మాకివలస, మబుగాం , కోమర్తి గ్రామాల్లో అరటి పంట దెబ్బతింది. కళ్లాల్లో ధాన్యం, మొక్కజొన్న పంటలు తడిసిపోయాయి. గార మండలంలో వత్సవలస, తూలుగు, నిజామాబాద్‌, గార, బూరవెల్లి, కళింగపట్నం, వమరవెల్లి తదితర ప్రాంతాల్లో వేలాది ఎకరాల్లో మొక్కజొన్న పంటకు నష్టం వాటిల్లింది. బూర్జ మండలంలో వై.పర్త, కిలంతర, జీబీపురం, అల్లెన, బూర్జ గ్రామాల్లో మామిడి పంట నేలరాలింది. జీడిమామిడి పంటకు కూడా తీవ్ర నష్టం వాటిల్లిందని రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు.

  • విరిగిపడిన చెట్లు

  • గార మండలంలో గాలుల బీభత్సానికి వమరవెల్లి నుంచి కళింగపట్నం రహదారిలో పెద్దచెట్టుతోపాటు కొమ్మలు విరిగిపోయాయి. ట్రాఫిక్‌ నిలిచిపోయి.. రాకపోకలకు ఇబ్బందులు ఎదురయ్యాయి. అధికారులు, సిబ్బంది ఆ చెట్టు, కొమ్మలను పక్కకు తొలగించి.. ట్రాఫిక్‌ క్లియర్‌ చేశారు. అలాగే అలికాం- బత్తిలి ప్రధాన రహదారిపై కొత్తకోట వద్ద భారీ వృక్షం కూలిపోయింది. సుమారు రెండు గంటల పాటు శ్రీకాకుళం, సరుబుజ్జిలి, హిరమండలం, బత్తిలి, రాకపోకలతో ప్రధాన రహదారిపై వాహనాలు బారులుదీరాయి.

  • అంధకారంలో నరసన్నపేట

  • నరసన్నపేటలో శుక్రవారం ఈదురుగాలుల ప్రభావంతో పలు ప్రాంతాల్లో విద్యుత్‌ స్తంభాలు నేలకొరిగాయి. పట్టణంలో పలు ప్రాంతాల్లో వైర్లు తెగిపడిపోవడంతో విద్యుత్‌ సరఫరా నిలిచిపోయింది. నరసన్నపేట, దేవాది, ఉర్లాం సబ్‌స్టేషన్‌ పరిధిలోని నరసన్నపేట, పోలాకి మండలాల్లో పలు గ్రామాల్లో అంధకారం నెలకొంది. విద్యుత్‌ సరఫరా పునరుద్ధరణ చేస్తామని ఏడీఏ శ్రీనివాసరావు, ఏఈ కిరణ్‌ గుప్త తెలిపారు.

  • నీటిమయమైన గోతులు..

  • జిల్లా కేంద్రంలోని శ్రీకాకుళం-పాలకొండ రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా అధికారులు ఇరువైపులా దుకాణాలను తొలగించారు. కాలువల నిర్మాణం కోసం యంత్రాలతో పెద్దపెద్ద గోతులు తీశారు. ఆ గోతుల్లో వర్షపునీరు చేరడంతో ప్రజలు రాకపోకలకు ఇబ్బందులు పడ్డారు. శ్రీకాకుళం ఆర్టీసీ కాంప్లెక్స్‌ జలమయమైంది. ప్రయాణికుల అవస్థలు అన్నీఇన్నీ కావు. అలాగే నరసన్నపేటలో బజారువీధి, మఠంవీధి, మారుతీనగర్‌, పాతబస్టాండ్‌, కొత్తబస్టాండ్‌, బండి వీధి, శ్రీరామనగర్‌ , శివనగర్‌ కాలనీలో మురికినీరు రోడ్లుమీద ప్రవహించింది. దీంతో ప్రజలు ఇబ్బందులు పడ్డారు. అలాగే టెక్కలిలో నౌపడా-మెళియాపుట్టి రోడ్డు జంక్షన్‌, జగతిమెట్ట కూడలి, తొలుసూరుపల్లి రోడ్డు తదితర ప్రాంతాల్లో నీరు నిలిచిపోవడంతో పాదచారులు, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఎన్‌ఎం రోడ్డు కూడలి పరిధిలో బస్సు షెల్టర్‌లో కూడా నీరు వెళ్లడంతో పలువురు ఇబ్బందులు పడ్డారు.

  • ఉప్పు కరిగిపోయింది

  • సంతబొమ్మాళి మండ లంలో గత రెండు రోజుల్లో కురిసిన అకాల వర్షాల కారణంగా ఉప్పు పంటకు అపార నష్టం వాటిల్లింది. మండలంలో నౌపడ, సీతానగరం, శెలగపేట, మర్రిపాడు తదితర గ్రామాల్లో రైతు లు ఉప్పు పంట సాగు చేస్తున్నారు. ఏటా డిసెంబరు నుంచి జూన్‌ వరకు ఉప్పు పంట సాగవుతుంది. ఉష్ణోగ్రతలు ఎంత ఎక్కువ ఉంటే.. అంత ఎక్కువ ఉప్పు పంట దిగుబడి వస్తుం ది. కాగా.. ప్రస్తుతం వర్షాల కారణంగా ఉప్పుమడుల్లో నీరు చేరి పంట కరిగిపోయి.. పూర్తిగా దెబ్బతిందని రైతులు ఆవే దన వ్యక్తం చేస్తున్నారు. వేలాది రూపాయలు పెట్టుబడి పెట్టి తీవ్రంగా నష్టపోయామని వాపోతున్నారు. మళ్లీ వర్షం నీరు ఆరి ఉప్పు మడులు చదును చేయాలంటే చాలారోజులు పడు తుందని.. ఈలోగా సీజన్‌ ముగుస్తుందని పేర్కొంటున్నారు.

  • శుక్రవారం నమోదైన వర్షపాతం (మిల్లీమీటర్లలో) :

  • -----------------------------------------

  • ఆమదాలవలస 30.75

  • బూర్జ 20.0

  • గార 16.5

  • సరుబుజ్జిలి 15.25

  • నరసన్నపేట 15.0

  • లావేరు 13.75

  • శ్రీకాకుళం 12.75

  • జి.సిగడాం 7.75

  • కోటబొమ్మాళి 7.5

  • రణస్థలం 7.25

  • మెళియాపుట్టి 6.75

  • జలుమూరు 6.0

  • నందిగాం 4.25

  • పలాస 2.0

  • సంతబొమ్మాళి 1.0

Updated Date - May 02 , 2026 | 12:24 AM