Share News

డీఎస్సీపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తా.. సిద్ధమా?.. మంత్రి లోకేశ్ సవాల్

ABN , Publish Date - Aug 28 , 2026 | 04:43 PM

ప్రకాశం జిల్లా ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు ఐక్యతగా పని చేస్తున్నారని తెలిపారు. ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు.

డీఎస్సీపై చర్చించేందుకు ఎక్కడికైనా వస్తా.. సిద్ధమా?.. మంత్రి లోకేశ్ సవాల్
Nara Lokesh

ప్రకాశం, ఆగస్టు 28: ఒంగోలులో టీడీపీ కార్యకర్తలు, నాయకుల సమన్వయ సమావేశంలో మంత్రి నారా లోకేశ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఉమ్మడి ప్రకాశం జిల్లా అంటే తనకెంతో ఇష్టమన్నారు. ఉమ్మడి ప్రకాశం జిల్లా ప్రజా ప్రతినిధులు ఐక్యతగా పని చేస్తున్నారని తెలిపారు. ఒంగోలులో గత ప్రభుత్వ హయాంలో అభివృద్ధి పడకేసిందని విమర్శించారు. అధ్వాన స్థితిలో రోడ్లు, ఎక్కడబడితే అక్కడ చెత్త ఉండేదన్నారు. ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ వచ్చిన తర్వాతే ఒంగోలు రూపురేఖలు మారాయని చెప్పుకొచ్చారు. గొడ్డలి పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కనీసం ఒక్క తాగునీటి ప్రాజెక్టు కూడా నిర్మించలేదన్నారు.


కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కోట్ల రూపాయలు కేటాయించి వెలిగొండ పూర్తి చేశామని మంత్రి తెలిపారు. ఈనెల 31న వెలిగొండ ప్రాజెక్ట్ ప్రారంభిస్తున్నామని అన్నారు. ‘ప్రభుత్వం ఉన్నా లేకున్నా.. మనం మన బలంపై ఆధారపడాలి. మనం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కార్యకర్తలపై దాడులు చేశారు. పార్టీ ఇప్పుడు వారికి అండగా ఉంది. హత్యకు గురైన చంద్రయ్య కుమారుడికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చాం. ఇచ్చిన హామీలు పద్ధతి ప్రకారం నిలబెట్టుకుంటూ వెళ్తున్నాం’ అని వెల్లడించారు. 16 వేల DSC ఉద్యోగాలు ఇచ్చామని.. 6 వేల కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేశామని అన్నారు. రాబోయే మూడేళ్లూ డీఎస్సీ ఇస్తామని ప్రకటించారు. గొడ్డలి పార్టీ అధ్యక్షుడికి ఒక శాపం ఉందని.. ఆయన నిజం చెప్తే తల వెయ్యి ముక్కలవుతుందని జ్యోతిష్యులు చెప్పారంటూ ఎద్దేవా చేశారు.


‘జగన్... టైమ్, డేట్ నువ్వే ఫిక్స్ చెయ్.. పులివెందుల రమ్మంటే వస్తా.. లేదా తాడేపల్లి రమ్మంటే వస్తా. డీఎస్సీపై చర్చించడానికి నేను సిద్ధం .. నువ్వు సిద్ధమా?’ అంటూ పదోసారి డీఎస్సీపై జగన్‌కు మంత్రి సవాల్ విసిరారు. డీఎస్సీకి, ఏపీపీఎస్సీకి తేడా లేకుండా మాజీ ముఖ్యమంత్రి జగన్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు. జగన్ ప్రభుత్వంలో గ్రూపు 1 పరీక్షలో అవకతవకలు జరిగాయని కోర్టు చెప్పిందన్నారు. ఈగోలు లేకుండా పార్టీ నాయకులు, కార్యకర్తలు కలిసి పని చేయాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు.


ఇవి కూడా చదవండి..

2047 నాటికి 50 శాతం పచ్చదనమే లక్ష్యం: నాగబాబు

తిరుపతిలో డ్రోన్ ఆపరేషన్.. పేకాటరాయుళ్ల అరెస్ట్

Read Latest AP News And Telugu News

Updated Date - Aug 28 , 2026 | 05:15 PM