Share News

‘అసలు డీఎస్సీ అంటే నీకు అర్థం తెలుసా’.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్

ABN , Publish Date - Sep 22 , 2026 | 12:58 PM

డీఎస్సీపై ఓ క్రిమినల్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ పార్టీ ముసుగులో క్రిమినల్ రాజకీయం చేస్తున్నారన్నారు.

‘అసలు డీఎస్సీ అంటే నీకు అర్థం తెలుసా’.. జగన్‌పై మంత్రి అచ్చెన్నాయుడు ఫైర్
Minister Atchannaidu

ప్రకాశం, సెప్టెంబర్ 22: డీఎస్సీపై ఓ క్రిమినల్ ఆరోపణలు చేస్తున్నారని మంత్రి అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజకీయ పార్టీ ముసుగులో క్రిమినల్ రాజకీయం చేస్తున్నారన్నారు. నిన్న(సోమవారం) విజయవాడలో టీచర్లపై దాడి జరిగిన సంఘటన దారుణమన్నారు. వైసీపీకి చెందిన గూండాలు ధర్నాలో పాల్గొన్నారని తెలిపారు. గతంలో భూ దోపిడీ, మైనింగ్ కేసుల్లో ఉన్నవారు నిన్న పాల్గొన్నారన్నారు. తాము ప్రజాస్వామ్యబద్ధంగా పాలన చేయాలని చేస్తున్నామని చెప్పారు. ‘జగన్.. నీకు అసలు సిగ్గు ఉందా.. డీఎస్సీ గురించి మాట్లాడే అర్హత ఉందా. అసలు డీఎస్సీ అంటే నీకు అర్ధం తెలుసా’ అంటూ ఫైర్ అయ్యారు. తాము సిస్టమాటిక్‌గానే డీఎస్సీ ఉద్యోగాలు ఇచ్చామని స్పష్టం చేశారు.


వైసీపీ హయాంలో ఆంధ్రప్రదేశ్‌లో ఎప్పుడూ లేని విధంగా అవినీతి చేశారని మంత్రి ఆరోపించారు. అతి తక్కువ సమయంలో తమ నాయకుడు లోకేశ్‌కు కేంద్ర స్థాయిలో మంచి గుర్తింపు వచ్చిందన్నారు. దాన్ని తట్టుకోలేకే లోకేశ్‌పై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. వైసీపీ చేస్తున్న ఆరోపణలన్నీ అసత్యమని నిరూపించామన్నారు. నిన్న జరిగిన సంఘటనలో నిందితులను వదిలి పెట్టమని.. చర్యలు తప్పవు మంత్రి అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


కాగా.. ఈరోజు(మంగళవారం) ఒంగోలులో ది ప్రకాశం జిల్లా సహకార కేంద్ర బ్యాంకు లిమిటెడ్ కార్యాలయాన్ని మంత్రి డోలా శ్రీబాలా వీరాంజనేయ స్వామితో కలిసి అచ్చెన్నాయుడు ప్రారంభించారు. బ్యాంకులు గ్రామీణ ప్రాంతాలను ఆర్థికంగా బలపరుస్తూ వస్తున్నాయని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గత ఐదు సంవత్సరాల్లో సహకార బ్యాంకులకు ఎన్నికలు కూడా పెట్టలేదని.. వైసీపీ ప్రభుత్వంలో అవినీతి కార్యక్రమాలు చేస్తూ, సహకార బ్యాంకులను దోచుకున్నారని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దోపిడీని అరికట్టామని తెలిపారు. కమర్షియల్ బ్యాంక్‌లు పద్ధతి ప్రకారం ఖర్చు పెడతాయని.. ఆ మాదిరిగానే సహకార బ్యాంకులను కూడా ఆన్‌లైన్ చేసి అవినీతిని అరికట్టామని అన్నారు. ఈ ఏడాది సూపర్ ఎల్‌నినో వచ్చిందని.. చాలా ప్రాంతాల్లో కరవు వచ్చిందన్నారు. ఈనెల 30న కరవు ప్రాంతాలను వెల్లడించే అవకాశం ఉందని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్, ఉగ్ర నరసింహారెడ్డి, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మారిటైమ్ బోర్డు చైర్మన్ దామచర్ల సత్య, పీడీసీసీ బ్యాంక్ చైర్మన్ సీతారామయ్య హాజరయ్యారు.


ఇవి కూడా చదవండి...

తిరుమల నడకమార్గంలో చెట్టుపై చిరుత.. భక్తుల పరుగో పరుగు

విద్యుత్ డిమాండ్ బాగా పెరిగింది.. అంతరాయాలు లేకుండా చేస్తున్నాం: గొట్టిపాటి రవికుమార్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 22 , 2026 | 01:01 PM