Share News

పునరుత్పాదకంలో టార్గెట్‌ నం.1

ABN , Publish Date - Aug 26 , 2026 | 04:07 AM

పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలపడమే లక్ష్యమని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్‌ జెట్లు, రెన్యువబుల్‌ ఎనర్జీ అని చెప్పారు.

పునరుత్పాదకంలో టార్గెట్‌ నం.1
lokesh

  • ఇప్పుడు అనంతపురం అంటే వలసలు కాదు.. ఉద్యోగాలు

  • కియా కార్లు, ఫైటర్‌ జెట్లు, రెన్యువబుల్‌ ఎనర్జీ కూడా..

  • ఇదంతా ఏపీ బ్రాండ్‌, విజనరీ సీఎంతో సాధ్యమైంది

  • 2019-24 మధ్య పవన విద్యుత్‌ ప్రాజెక్టుల్లేవు

  • ఇప్పుడు సుజ్లాన్‌ రాకతో రెన్యువబుల్‌ ఎనర్జీ పెరిగింది

  • సుజ్లాన్‌ భాగస్వామ్యంతో యువతకు నైపుణ్య శిక్షణ

  • ఆ సంస్థ కల్పించే ఉద్యోగాల్లో 70 శాతం స్థానికులకే

  • 175 గిగావాట్ల ‘పునరుత్పాదక’ టార్గెట్‌ను సాధిస్తాం

  • అనంతపురం జిల్లా రాయదుర్గంలో మంత్రి లోకేశ్‌

  • సుజ్లాన్‌ విండ్‌ ఎనర్జీ ప్రాజెక్టులకు శంకుస్థాపన

అనంతపురం/బళ్ళారి, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రాన్ని నంబర్‌ వన్‌గా నిలపడమే లక్ష్యమని ఐటీ, మానవ వనరుల శాఖ మంత్రి లోకేశ్‌ అన్నారు. అనంతపురం జిల్లా అంటే కియా కార్లు, ఫైటర్‌ జెట్లు, రెన్యువబుల్‌ ఎనర్జీ అని చెప్పారు. ఒకప్పుడు ఈ జిల్లా నుంచి యువత ఉపాధి, ఉద్యోగాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లేవారని, ఇప్పుడు ఆ రోజులు పోయాయని, ఇతర ప్రాంతాల వాళ్లు ఉద్యోగాలు వెతుక్కుంటూ అనంతపురం జిల్లాకు వచ్చే రోజులు వచ్చాయని వివరించారు. ఇదంతా ఏపీ బ్రాండ్‌, విజనరీ ముఖ్యమంత్రి చంద్రబాబు వల్లే సాధ్యమైందని పేర్కొన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గంలోని కణేకల్లు మండలం హులికెర వద్ద సుజ్లాన్‌ విండ్‌ ఎనర్జీ సుమారు రూ. 10 వేల కోట్లతో చేపట్టిన 1325 మెగావాట్ల పవన విద్యుత్‌ ప్రాజెక్టులకు మంత్రి లోకేశ్‌ మంగళవారం శంకుస్థాపన చేశారు. అలాగే విండ్‌ ఎనర్జీ స్మార్ట్‌ బ్లేడ్‌ ఉత్పత్తి ప్లాంట్‌ విస్తరణను ప్రారంభించారు. అనంతరం నిర్వహించిన సభలో ఆయన ప్రసంగించారు. ఆయన ఏమన్నారంటే.. ‘‘సుజ్లాన్‌ పవన విద్యుత్‌ ప్రాజెక్టు ఏర్పాటుతో ఏపీలో నూతన అధ్యాయానికి నాంది పలికాం.


ఆ సంస్థతో ఏపీకి రెండు దశాబ్దాలకు పైగా బంధం ఉంది. తొలినాళ్లలోనే ఏపీకి వచ్చి, తయారీ సామర్థ్యాన్ని అభివృద్ధి చేసి, బలమైన విండ్‌ ఎనర్జీ ఎకో సిస్టమ్‌ నిర్మించింది. ఈ విషయంలో నాటి సుజ్లాన్‌ ఎండీ, దివంగత తులసి తంతిని స్మరించుకోవాలి. స్వచ్ఛ ఇంధనం ప్రపంచ ప్రాధాన్యతగా మారకముందే ఆయన పునరుత్పాదక ఇంధనంపై నమ్మకం ఉంచారు. ఆయన దార్శనికతకు అనంతపురంలోనే బలమైన పునాది పడింది. 2019-24 మధ్య రాష్ట్రంలో పవన విద్యుత్‌ అభివృద్ధి దాదాపుగా నిలిచిపోయింది. ఆ కాలంలో కేవలం 6 మెగావాట్ల పవన విద్యుత్‌ సామర్థ్యం మాత్రమే అదనంగా చేరింది. అనంతపురంలోని సుజ్లాన్‌ యూనిట్‌కు ఏడాదికి దాదాపు 1,260 మెగావాట్ల తయారీ సామర్థ్యం ఉంది. తద్వారా ప్రత్యక్షంగా దాదాపు 1200 మందికి ఉపాధి కల్పిస్తోంది. వారిలో 70 శాతానికి పైగా స్థానికులే. ఏపీ వ్యాప్తంగా సుజ్లాన్‌ ఇప్పటికే 2 వేలకు పైగా గ్రీన్‌ ఉద్యోగాలను సృష్టించింది. జిల్లాల్లో తయారీ రంగం అభివృద్ధి చెందాలి. యువతకు వారి సొంత జిల్లాలోనే ఉద్యోగాలు లభించాలి.


విండ్‌ ఎనర్జీ రంగంలో సుజ్లాన్‌ సత్తా

భారతదేశ పవన విద్యుత్‌ రంగాన్ని ప్రపంచ పటంలో నిలిపిన సంస్థల్లో సుజ్లాన్‌ ఒకటి. ప్రస్తుత ప్లాంట్‌లో 4 వేల మందికి పైగా ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగాలను కల్పిస్తామన్నారు. ఏపీలో సుజ్లాన్‌కు ఇప్పటికే దాదాపు 1600 మెగావాట్ల స్థాపిత సామర్థ్యం ఉంది. మరో 2700 మెగావాట్లు అభివృద్ధి, నిర్మాణ దశలో ఉన్నాయి. రాష్ట్రంలో 6.5 గిగావాట్ల డేటా సెంటర్‌ సామర్థ్యాన్ని అభివృద్ధి చేస్తున్నాం. ఈ డిజిటల్‌ మౌలిక వసతులకు అవసరమైన విద్యుత్‌ను అందించేందుకు దాదాపు 25 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన అవకాశాన్ని సృష్టించవచ్చు. క్లీన్‌ ఎనర్జీలో సౌదీ అరేబియాగా ఏపీని తీర్చిదిద్దాలన్నదే లక్ష్యం. వివిధ రూపాల్లో స్వచ్ఛ ఇంధనాన్ని ప్రపంచానికి ఎగుమతి చేయగల రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ను తీర్చిదిద్దాలి. రాష్ట్ర స్థాయిలో 175 గిగావాట్ల పునరుత్పాదక ఇంధన సామర్థ్యాన్ని లక్ష్యంగా పెట్టుకున్నాం. పూర్తిస్థాయి ఇండస్ట్రియల్‌ ఎకోసిస్టమ్‌ నిర్మాణంలో భాగంగా ఎనర్జీ, డేటా సెంటర్లు, ఎలక్ర్టానిక్స్‌, ఫార్మాసూటికల్స్‌, ఆటోమొబైల్‌, కెమికల్స్‌, ఫిషరీస్‌, ఆక్వాకల్చర్‌, మాన్యుఫ్యాక్చరింగ్‌ వంటి అధిక వృద్ధి రంగాల్లో 22 పారిశ్రామిక క్లస్టర్ల ఏర్పాటు చేస్తున్నాం. రాష్ట్ర ప్రభుత్వం, సుజ్లాన్‌ కలిసి 12వేల మంది యువతకు, అందులో 25 శాతం మహిళలకు గ్రీన్‌ ఎనర్జీ ఉద్యోగాల కోసం శిక్షణ అందిస్తున్నాం. ఉరవకొండ, విజయవాడలోని స్కిల్‌ డెవల్‌పమెంట్‌ సెంటర్లు పునరుత్పాదక ఇంధన రంగానికి కావాల్సిన ఇంజనీర్లు, సాంకేతిక నిపుణులను సిద్ధం చేస్తున్నాయి. ఒక్క కియా పరిశ్రమ ఎన్ని కుటుంబాల్లో వెలుగు నింపిందో నేను పాదయాత్రలో స్వయంగా చూశాను. అప్పుడే 20 లక్షల ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. ప్రపంచమంతా తిరిగి కంపెనీలను తీసుకువస్తున్నాం. ప్రధాని మోదీ కూడా మన రాష్ర్టానికి కంపెనీలను తీసుకురావడానికి సహకరిస్తున్నారు. కంపెనీలను తీసుకురావడం మా బాధ్యత. అవకాశాలను అందిపుచ్చుకోవడం యువత బాధ్యత. అందుకే పరిశ్రమలతో నేరుగా అనుసంధానం చేసి, యువతకు అవసరమైన నైపుణ్యాలను నేర్పిస్తున్నాం’’ అని లోకేశ్‌ అన్నారు.


రోడ్‌ షోలో జన నీరాజనం..

బళ్లారి నుంచి ఉదయం 11.30 గంటలకు రాయదుర్గం చేరుకున్న లోకేశ్‌కు పార్టీ శ్రేణులు, ప్రజలు ఘనంగా స్వాగతం పలికారు. ఇక్కడి శాంతినగర్‌ వద్ద ఎన్టీఆర్‌ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్‌ కాలవ శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిర్వహించిన రోడ్‌ షోలో మంత్రి లోకేశ్‌కు పార్టీ శ్రేణులు, ప్రజలు నిరాజనం పలికారు. అడుగడుగునా పూల వర్షం కురిపించారు. వర్షాన్ని సైతం లెక్క చేయకుండా లోకేశ్‌ దాదాపు 2 గంటల పాటు రోడ్‌ షో నిర్వహించారు. అంతకుముందు రాయదుర్గం నియోజకవర్గం పార్టీ నాయకులు, కార్యకర్తలతో లోకేశ్‌ ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


తెలుగువారు ఎక్కడున్నా అండగా ఉంటాం: లోకేశ్‌

ప్రపంచంలో ఏ మూలన తెలుగు ప్రజలు నివసిస్తున్నా వారి సంక్షేమం, అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ కట్టుబడి ఉంటుందని లోకేశ్‌ అన్నారు. రాయదుర్గం వెళ్లేందుకు ఆయన మంగళవారం బళ్లారి జిందాల్‌ విజయనగర విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన ప్రయాణించిన లోకేశ్‌కు దారి పొడువునా జనం ఘన స్వాగతం పలికారు. కుడితిన్ని గ్రామం వద్ద రైతులు, ప్రజలు ఏర్పాటు చేసిన ఆత్మీయ సభలో ఆయన ప్రసంగించారు.

Updated Date - Aug 26 , 2026 | 04:16 AM