Share News

కేంద్రం ఇచ్చేలా లేదు.. మనమే ఇద్దాం

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:48 AM

కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పీఎంఏవై నిధుల విడుదలలో నేటికీ స్పష్టత లేకపోవడంతో... ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తానే బిల్లుల చెల్లింపులకు సమాయత్తమైంది.

కేంద్రం ఇచ్చేలా లేదు.. మనమే ఇద్దాం
Cm Revanth reddy

  • ఇందిరమ్మ ఇళ్ల బకాయిలపై రాష్ట్ర సర్కారు నిర్ణయం

  • చివరి దశ బిల్లులకు మోక్షం

  • రూ.185 కోట్ల నిధుల విడుదల

  • 18,500 మందికి లబ్ధి

  • రేపు ఖాతాల్లో జమ కానున్న సొమ్ము

హైదరాబాద్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): కేంద్ర ప్రభుత్వం నుంచి అందాల్సిన పీఎంఏవై నిధుల విడుదలలో నేటికీ స్పష్టత లేకపోవడంతో... ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా రాష్ట్ర ప్రభుత్వం తానే బిల్లుల చెల్లింపులకు సమాయత్తమైంది. దీంతో గ్రామీణ ఇందిరమ్మ ఇళ్ల పథకంలో నిలిచిపోయిన చివరిదశ బిల్లులకు మోక్షం లభించింది. తుది విడత కింద ఇవ్వాల్సిన రూ.లక్షను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలుతీసుకుంది. ఈ మేరకు మార్చి వరకు పూర్తయిన ఇళ్ల చివరిదశ బిల్లుల కోసం రూ.185 కోట్లను గృహ నిర్మాణ శాఖ విడుదల చేసింది. దీని ప్రకారం 18,500 మంది లబ్ధిదారులకు నిధులు అందనున్నాయి. బుధవారం బ్యాంకులకు సెలవుదినం కావడంతో.. ఆ నిధులు గురువారం లబ్ధిదారుల ఖాతాలో జమవుతాయని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. కాగా రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రాంతాల్లో ప్రారంభించిన ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు మంజూరైన లబ్ధిదారులకు 4 దశల్లో రూ.5లక్షలను అందిస్తోంది. ఈ పథకం కింద రెండు దశల్లో కలిపి దాదాపు 7లక్షల ఇళ్లు మంజూరు చేయగా వీటిలో ఇప్పటివరకు దాదాపు 1.50 లక్షల ఇళ్లు పూర్తయినట్టు గృహ నిర్మాణ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, ఇల్లు పూర్తయి నెలలు గడుస్తున్నా.. చివరి బిల్లు కింద అందించాల్సిన రూ.లక్ష తమ ఖాతాల్లో జమ చేయకపోవడంపై లబ్ధిదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. చివరిదశకు కేంద్ర ప్రభుత్వ పథకమైన ప్రధాన మంత్రి ఆవాస యోజన గ్రామీణ పథకం (పీఎంఏవై-జీ) కింద అందే నిధులను కలిపి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం భావించింది. ఈ పథకం కింద ఒక్కో ఇంటికి కేంద్రం రూ.72వేలను అందిస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం రూ.28వేలు కలిపి లబ్ధిదారులకు ఇవ్వాలని భావించింది. కేంద్రం ఆశించిన స్థాయిలో సహకరించలేదు.

ఈ వార్తలు కూడా చదవండి...

మోదీ నాయకత్వంలో భారత అంతరిక్ష రంగం కొత్త శకంలోకి: పవన్ కల్యాణ్

అల్పపీడన ప్రభావం.. ఏపీలో వర్షాలు

వెలిగొండ ప్రాజెక్ట్.. ఆఖరి లబ్ధిదారుడి వరకూ పరిహారం అందిస్తాం: మంత్రి డీజీవీ స్వామి

Read Latest AP News And Telangana News And National News


దీంతో పూర్తయిన లక్షన్నర ఇళ్లకు రూ.లక్ష చొప్పున దాదాపు రూ.1,500 కోట్ల వరకు చివరి బిల్లు నిలిచిపోయినట్టు సమాచారం. లబ్ధిదారుల ఆందోళన నేపథ్యంలో కేంద్ర నిధులతో సంబంధం లేకుండానే రాష్ట్ర ప్రభుత్వం చెల్లింపునకు చర్యలు తీసుకుంది. ఇప్పుడు చేసిన పేమెంట్లకు చెందిన ఖాతాలను సాంకేతికంగా కూడా మూసివేయనున్నారు. దాంతో పీఎంఏవై-జీ కింద కేంద్రం ఇళ్లను మంజూరు చేస్తే.. మళ్లీ ఈ ఇళ్లకు డబుల్‌ పేమెంట్‌ అయ్యేందుకు అవకాశం లేకుండా ఉంటుందని అధికారులు చెబుతున్నారు. అయితే కేంద్రం ఇచ్చిన ఆవాస్‌ ప్లస్‌ యాప్‌లో ఇప్పటికే గ్రామీణ ప్రాంతాల్లో 11 లక్షల ఇళ్ల వివరాలను నమోదు చేశామని, భవిష్యత్‌లో ఏమైనా ఇళ్లను మంజూరు చేస్తే.. వాటికి కేంద్రం నుంచి వచ్చే నిధులను కొత్తగా మంజూరు చేసే ఇళ్లకు కేటాయించనున్నట్టు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి. వెరసి ఇందిరమ్మ ఇళ్ల చివరి బిల్లులను ప్రభుత్వం విడుదల చేయడంతో ఆయా లబ్ధిదారులకు ఆర్థికంగా ఉపశమనం లభించినట్టైంది.

Updated Date - Aug 26 , 2026 | 04:03 AM