Share News

విలీనం... మోదం, ఖేదం

ABN , Publish Date - Aug 26 , 2026 | 01:01 AM

గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో విలీనంపై పంచాయతీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది.

విలీనం... మోదం, ఖేదం

జీవీఎంసీలో కలిసేందుకు కొందరు అనుకూలం

మరికొందరు వ్యతిరేకం

పన్నుల భారం మోపకుండా ఉపాధి హామీ పథకం కొనసాగిస్తామంటే అభ్యంతరం లేదన్న ఇంకొందరు

గ్రామసభలు మొదలు

ఆనందపురం మండలంలో 9 పంచాయతీలు ఓకే

మూడు నో

పెందుర్తి/ఆనందపురం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

గ్రేటర్‌ విశాఖ నగర పాలక సంస్థ (జీవీఎంసీ)లో విలీనంపై పంచాయతీల్లో మిశ్రమ స్పందన కనిపిస్తోంది. కొన్నిచోట్ల ఆమోదం లభించగా, మరికొన్నిచోట్ల అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. పదేళ్లపాటు పన్నులు పెంచబోమని, ఉపాధి హామీ పథకం కొనసాగుతుందని హామీ ఇస్తే విలీనానికి అభ్యంతరం లేదని ఇంకొన్నిచోట్ల ప్రజలు స్పష్టంగా చెప్పారు.

జీవీఎంసీలో పంచాయతీల విలీనం ప్రతిపాదనపై అధికారులు ప్రజాభిప్రాయ సేకరణ మొదలెట్టారు. మంగళవారం పెందుర్తి మండలం గుర్రమ్మపాలెం, వాలిమెరకజుత్తాడలో గ్రామ సభలు నిర్వహించారు. ఎంపీడీవో గుండు అప్పలరాజు జీవీఎంసీలో పంచాయతీల విలీనం ప్రతిపాదన, ప్రయోజనాల గురించి ప్రజలకు వివరించారు. అనంతరం అభిప్రాయాలను తెలపాల్సిందిగా కోరారు. జీవీఎంసీలో విలీనమైతే పన్నుల భారం పెరుగుతుందని, ఉపాధి పథకం దూరమవువుతుందని, అదేవిధంగా ఇంటి నిర్మాణం చేపట్టాలంటే ప్లాన్‌ అప్రూవల్‌ కోసం, ఇతరత్రా చాలా ఖర్చవుతుందని పలువురు ఆందోళన వ్యక్తంచేశారు. గ్రేటర్‌లో విలీనం జరిగే 15 పంచాయతీల్లో కనీసం పదేళ్లు పన్నుల భారం పడకుండా చూడాలని గుర్రంపాలేనికి చెందిన అక్కిరెడ్డి చినరమణ కోరారు. ఉపాధి హామీ పథకం ఎప్పటిలాగే కొనసాగించాలన్నారు. తమ డిమాండ్లు నెరవేర్చేందుకు హామీ ఇచ్చినట్టయితే....విలీనానికి అభ్యంతరం లేదని అన్నారు. గ్రామసభలో ప్రజల నుంచి సేకరించిన అభిప్రాయాలను ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఎంపీడీవో చెప్పారు. గ్రామసభలపై ప్రజలు పెద్దగా ఆసక్తి కనబరచలేదు. అధికారులు కూడా మొక్కుబడిగా సభలు ముగించేశారు.

భూ సమస్య పరిష్కారం తరువాతే: బోని

దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న మాన్సాస్‌ భూముల సమస్యను పరిష్కరించి రైతులకు పూర్తిస్థాయిలో న్యాయం చేసిన తరువాతే గ్రామాన్ని జీవీఎంసీలో విలీనం చేసే అంశాన్ని పరిశీలించాలని బోని గ్రామస్థులు స్పష్టంచేశారు. ఈ మేరకు అధికారులకు వినతిపత్రం సమర్పించారు. మంగళవారం మండలంలోని 12 పంచాయతీల్లో ఎంపీడీవో ఆధ్వర్యంలో ప్రజాభిప్రాయ సేకరణ నిమిత్తం గ్రామ సభలు నిర్వహించారు. ఈ సందర్భంగా బోనిలో జరిగిన గ్రామ సభలో పలువురు మాట్లాడుతూ భూములకు 1923 నుంచి రిజిస్ట్రేషన్లు జరిగేవని, గత 15 ఏళ్లుగా రిజిస్ట్రేషన్లు నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆడపిల్లల వివాహాలు, పిల్లల ఉన్నత విద్య, ఇతర అత్యవసరాలకు భూములను విక్రయించుకోలేని పరిస్థితి నెలకొందని పేర్కొన్నారు. ముందు దశాబ్దాలుగా తమను వేధిస్తున్న మాన్సాస్‌ భూముల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, ఆ తరువాతే విలీనం గురించి మాట్లాడాలని స్పష్టంచేశారు. అలాగే పాలవలస, భీమన్నదొరపాలెం పంచాయతీల్లో జరిగిన సభల్లో జీవీఎంసీలో విలీనానికి కొంతమంది ఆమోదం తెలపగా, మరికొంతమంది వ్యతిరేకించారు.

విలీనానికి గిడిజాల, రామవరం, వెల్లంకి, చందక, ముచ్చర్ల, ముకుందపురం, శిర్లపాలెం, కుసులువాడ, శొంఠ్యాం పంచాయతీలు ఆమోదం తెలపగా, బోని, భీమన్నదొరపాలెం, పాలవలస వ్యతిరేకించాయి.

ఎంపీడీవో జానకి, డిప్యూటీ ఎంపీడీవో సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం గ్రామ సభలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.


జీవీఎంసీలో ‘భోగాపురం’ విలీనం ప్రతిపాదన

భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు

విశాఖపట్నం, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి):

స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిన నేపథ్యంలో భోగాపురాన్ని కూడా జీవీఎంసీలో కలిపితే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తున్నామని, దీనిపై ఇప్పటికే ఆ నియోజకవర్గం ఎమ్మెల్యేతో కూడా మాట్లాడామని భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు వెల్లడించారు. ఎంవీపీ కాలనీలోని క్యాంపు కార్యాలయంలో ఆయన మంగళవారం విలేకరుల సమావేశం ఏర్పాటుచేశారు. భీమిలి నియోజకవర్గంలోని మూడు ముండలాలు, పెందుర్తి నియోజకవర్గంలోని ఒక మండలం...నాలుగు మండలాల్లోని మొత్తం 79 పంచాయతీలను ఇప్పుడు జీవీఎంసీలో విలీనం చేయాల్సి ఉందన్నారు. భీమిలి మండలంలో 16, ఆనందపురం మండలంలో 26, పద్మనాభం మండలంలో 22, పెందుర్తి మండలంలో 17 పంచాయతీలు ఉన్నాయన్నారు. ఆయా మండలాల అధికారులు, పార్టీల నాయకులతో ఇప్పటికే చర్చించామన్నారు. జీవీఎంసీ ప్రస్తుతం వార్డులు 98 కాగా వాటిని 120 చేస్తున్నారన్నారు. కొత్త పంచాయతీలు విలీనమైనా సాంకేతికంగా వారికి ఈ ఎన్నికల్లో పాల్గొనే అవకాశం ఉండదన్నారు. ఆయా పంచాయతీలకు ఉపాధి హామీ పనులు లభించేలా, ఐదేళ్ల నుంచి పదేళ్లపాటు పన్నులు తక్కువగా ఉండేలా చూడాలని ఆ ప్రాంత ప్రజలు కోరుతున్నారన్నారు. దీనిపై ప్రభుత్వంతో చర్చిస్తామన్నారు.

కూటమి అభ్యర్థి గెలుపు తథ్యం

కొత్త పంచాయతీలు కలిస్తే జీవీఎంసీ పెద్ద కార్పొరేషన్‌ అవుతుందని, ఎనిమిది అసెంబ్లీ నియోజకవర్గాలు, రెండు పార్లమెంటు నియోజకవర్గాలు అందులో ఉంటాయన్నారు. ఈ నేపథ్యంలో మేయర్‌ పదవి కీలకం కానుందన్నారు. ఈ ఎన్నికల్లో ఎవరు పోటీ చేసినా కూటమి గెలుపు తథ్యమన్నారు. ప్రజలు నేరుగా మేయర్‌ను ఎన్నుకుటారు కాబట్టి ఆ స్థాయి కలిగినవారు పోటీలో ఉంటారన్నారు. అభ్యర్థుల గురించి ఇప్పుడు మాట్లాడుకోవడం చాలా తొందరపాటు చర్చ అవుతుందని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో డేటా సెంటర్ల గురించి ప్రశ్నించగా, లక్ష్యానికి మించి అనుమతించబోమని ఐటీ శాఖ మంత్రే ప్రకటించారని గుర్తుచేశారు. వాటికి అవసరమైన విద్యుత్‌, నీటికి ప్రభుత్వం తగిన చర్యలు చేపడుతున్నదని వివరించారు.

Updated Date - Aug 26 , 2026 | 01:01 AM