అమరజీవి జలధార
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:58 AM
రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ కింద ఇప్పటికే కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న సింగిల్ విలేజ్ స్కీమ్స్, మల్టీ విలేజ్ స్కీమ్స్ అన్నింటికీ జేజేఎం-అమరజీవి జలధారగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.
గ్రామీణ తాగునీటి పథకాలకు పొట్టి శ్రీరాములు పేరు
పట్టణాభివృద్ధికి బ్రిటన్ సహకారం
ఏపీ, యూకే ప్రభుత్వాల మధ్య కీలక ఒప్పందం
అమరావతి: రాష్ట్రంలో జల్‌జీవన్ మిషన్ కింద ఇప్పటికే కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టనున్న సింగిల్ విలేజ్ స్కీమ్స్, మల్టీ విలేజ్ స్కీమ్స్ అన్నింటికీ జేజేఎం-అమరజీవి జలధారగా నామకరణం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పాటు కోసం పొట్టిశ్రీరాములు చేసిన అసమాన త్యాగం, పోరాటాన్ని గౌరవిస్తూ జల్‌జీవన్ మిషన్ కింద చేపట్టే తాగునీటి ప్రాజెక్టులకు అమరజీవి జలధార అని పేరు పెట్టాలని గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం ఇంజనీర్ ఇన్‌చీఫ్ ప్రతిపాదించారు. ప్రభుత్వం ఆ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది. గ్రామీణ ప్రాంతాల్లో ప్రతి కుటుంబానికి కొళాయి కనెక్షన్ ఇవ్వడం, ప్రతి వ్యక్తికి రోజుకు 55 లీటర్ల చొప్పున సురక్షితమైన తాగునీటిని అందించడం జలజీవన్ మిషన్ లక్ష్యాలుగా పేర్కొన్నారు. జేజేఎం 2.0లో తాగునీటి సరఫరా వ్యవస్థకు పటిష్ఠమైన సంస్థాగత వ్యవస్థతో పాటు డిజిటల్ డేటా నిర్వహణకు ప్రాధాన్యం ఇస్తున్నారు. జేజేఎం-అమరజీవి జలధార పేరుతో చేపట్టే ప్రాజెక్టులు జల్‌జీవన్ మిషన్ 2.0 జాతీయ మార్గదర్శకాలకు అనుగుణంగానే కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఆ మేరకు చర్యలు తీసుకోవాలని గ్రామీణ నీటి సరఫరా, పారిశుధ్య విభాగం ఇంజనీర్ ఇన్‌చీఫ్, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ కమిషనర్‌ను ఆదేశించింది.