Share News

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంపై సీరియస్‌

ABN , Publish Date - Aug 26 , 2026 | 03:04 AM

ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో నిర్లక్ష్యంతోపాటు అసంతృప్తికర పనితీరుపై కలెక్టర్‌ రాజాబాబు సీరియస్‌ అయ్యారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో అర్జీల పరిష్కారంలో లోపాలను ఆయన గుర్తించారు.

అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంపై సీరియస్‌

ముగ్గురు ఉన్నతాధికారులు, ఒక మండల స్థాయి అధికారికి షోకాజ్‌ నోటీసులు

వారంలో వివరణ ఇవ్వాలని కలెక్టర్‌ రాజాబాబు ఆదేశం

లేనిపక్షంలో క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరిక

ఒంగోలు కలెక్టరేట్‌, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్‌ఎస్‌)లో నిర్లక్ష్యంతోపాటు అసంతృప్తికర పనితీరుపై కలెక్టర్‌ రాజాబాబు సీరియస్‌ అయ్యారు. ఇటీవల నిర్వహించిన సమీక్ష సమావేశంలో అర్జీల పరిష్కారంలో లోపాలను ఆయన గుర్తించారు. ఇప్పటివరకు పరిష్కరించిన అర్జీలపై ఆడిట్‌ నిర్వహించగా అనేక అంశాలు వెలుగులోకి రావడంతో కలెక్టర్‌ ఆయా అధికారులపై చర్యలకు ఉపక్రమించారు. జిల్లా పంచాయతీ అధి కారి ఎం.అనుపమ, జిల్లా వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్‌ ఎ.బాలాంజనేయులు, కొత్తపట్నం మండల వ్యవసాయ అధికారి ఎం.కిషోర్‌బాబులకు నోటీసులు జారీచేశారు. జిల్లా పంచాయతీ పరిధిలో ఈ ఏడాది జూన్‌ 1 నుంచి 14వ తేదీ వరకు 293 అర్జీలను పరిష్కరించగా అందులో 282 ఫిర్యాదులను ఆడిట్‌ చేశారు. ఆయితే ఆడిట్‌ చేసిన ఫిర్యాదుల్లో 222 పరిష్కారం పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. దీని కారణంగా 74 అర్జీలను తిరిగి ఓపెన్‌ చేయాల్సి వచ్చింది. ఫిర్యాదుదారులకు ఇచ్చిన సమాధానాలు అస్పష్టంగా, మొక్కుబడిగా ఉన్నట్లు కలెక్టర్‌ గుర్తించారు. ఆయా అర్జీలకు ఎటువంటి చర్యలు తీసుకున్నారో, సమస్య ఎలా పరిష్కారమైందో వివరణ లేదు. ఆశాఖ పనితీరు పట్ల 78.72శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో ఆ శాఖ అఽధికారి అనుపమకు షోకాజ్‌ నోటీసును జారీచేశారు.

అర్జీల పరిష్కారంపై అసంతృప్తి

జిల్లా వ్యవసాయశాఖ పరిధిలో 49 అర్జీలు పరిష్కరించగా అందులో 26ను ఆడిట్‌ చేశారు. వాటిలో 8 అర్జీలపై అసంతృప్తి వ్యక్తం కావడంతో మూడింటిని తిరిగి ఓపెన్‌ చేయాల్సి ఉంది. ఆ శాఖలో పరిష్కరించని అర్జీల పట్ల 30.76 శాతం మంది ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేయడంతో డీఏవో శ్రీనివాసరావుకు షోకాజ్‌ నోటీసును జారీచేశారు. జిల్లా రిజిస్ట్రేషన్‌ శాఖ పరిధిలో 29 అర్జీలను పరిష్కరించగా అందులో 24ను ఆడిట్‌ చేశారు. 15 అర్జీల పట్ల ప్రజలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఐదు అర్జీలను రీఓపెన్‌ చేయాల్సి వచ్చింది. మొత్తం ఆ శాఖ ద్వారా పరిష్కరించిన అర్జీల పట్ల అసంతృప్తి వ్యక్తం చేయడంతో జిల్లా రిజిస్ర్టార్‌ బాలాంజనేయులుకు కలెక్టర్‌ నోటీసు ఇచ్చారు. మీకోసంలో వచ్చిన అర్జీని మొక్కుబడిగా పరిష్కరించడంపై కొత్తపట్నం ఏవో ఎం.కిషోర్‌బాబుకు షోకాజ్‌ నోటీసు జారీచేశారు. మిట్నసల ప్రసన్నకుమార్‌ అనే వ్యక్తి ఇచ్చిన అర్జీ పరిష్కారాన్ని పీజీఆర్‌ఎస్‌ గైడ్‌లైన్స్‌ పాటించకపోవడంతో నోటీసు ఇచ్చారు. వారం రోజుల్లో సంతృప్తికర వివరణ ఇవ్వకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని ఆ నోటీసుల్లో కలెక్టర్‌ రాజాబాబు హెచ్చరించారు.

Updated Date - Aug 26 , 2026 | 03:04 AM