పెండింగ్ పనులను పూర్తి చేయండి
ABN , Publish Date - Aug 26 , 2026 | 03:06 AM
వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంగళవారం రాత్రి పరిశీలించారు.
అధికారులకు మంత్రి నిమ్మల ఆదేశం
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పెద్ద దోర్నాల, ఆగస్టు 25 (ఆంధ్రజ్యోతి) వెలిగొండ ప్రాజెక్టుకు సంబంధించిన పెండింగ్ పనులను త్వరగా పూర్తి చేయాలని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు ఈ నెల 31న వెలిగొండ ప్రాజెక్టును ప్రారంభించనున్న నేపథ్యంలో అందుకు సంబంధించిన ఏర్పాట్లను మంత్రి మంగళవారం రాత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టులోని పెండింగ్ పనులపై సంబంధిత ఇంజనీరింగ్ అధికారులతో ఆరా తీశారు. టన్నెల్-2లో 25 మీటర్ల లైనింగ్, ఫీడర్ కెనాల్‌లో 4.2 కిలో మీటర్ వద్ద ఏర్పాటు చేస్తున్న గేట్ల నిర్మాణం, దానికి సమీపంలోనే సీఎం జలహారతి ఇచ్చేందుకు అనువుగా కరకట్టను చదును పనులను రామానాయుడు పరిశీలించారు. అనంతరం ఇంజనీరింగ్ అధికారులు, నిర్మాణ ఏజెన్సీలకు పలు సూచనలు చేశారు. సీఎం పర్యటనలో ఎలాంటి తప్పిదాలు లేకుండా భద్రతా అంశాలను దృష్టిలో ఉంచుకొనిఏర్పాట్లు చేయాలని దిశానిర్దేశం చేశారు. ఆయన వెంట ప్రాజెక్టు ఎస్‌ఈ అబూతలీమ్, టీడీపీ ఇన్‌చార్జి గూడూరి ఎరిక్షన్‌బాబు, సీనియర్ నాయకులు కందుల రామిరెడ్డి, టీడీపీ మండలాధ్యక్షుడు షేక్ మాబు, నాయకులు దొడ్డా శేషాద్రి, సుబ్బారెడ్డి ఉన్నారు.