నెల్లూరు రూరల్ ప్రగతి పథం.. రూ.2 కోట్లతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ABN , Publish Date - Mar 15 , 2026 | 03:16 PM
నెల్లూరు రూరల్ పరిధిలోని రామకోటయ్య నగర్ రూపురేఖలు మార్చేందుకు కూటమి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. స్థానిక సమస్యల పరిష్కారమే ధ్యేయంగా రూ.2 కోట్ల నిధులతో అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు ఎమ్మెల్యేలు.
నెల్లూరు, మార్చి 15: నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల జోరు కొనసాగుతోంది. రామకోటయ్య నగర్ లో రూ.2 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న పలు అభివృద్ధి పనులకు ఎమ్మెల్యేలు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదివారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఇద్దరు నేతలు ఒకరిపై ఒకరు ప్రశంసలు కురిపించుకుంటూనే, గత ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి(Kotamreddy Sridhar Reddy) మాట్లాడుతూ..‘రామకోటయ్య నగర్ ప్రజలతో నాకు ఎంతో అనుబంధం ఉంది. ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అధికారంలో ఉన్నా లేకపోయినా నిరంతరం ప్రజల సమస్యలపై పోరాడే వ్యక్తి. నన్ను ఎమ్మెల్యే కంటే మీ కుటుంబ సభ్యుడిగా చూసుకుంటేనే నాకు సంతోషం. ఏ చిన్న సమస్య ఉన్నా నాకు నేరుగా ఫోన్ చేయండి, వెంటనే స్పందిస్తా. ఎక్కడైనా పొరపాట్లు ఉంటే సరిదిద్దుకుని వెళ్దాం’ అని అన్నారు.
ఎమ్మెల్యే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి(Somireddy Chandramohan Reddy) మాట్లాడుతూ..‘కోటంరెడ్డి సోదరుల పనితీరు చూస్తుంటే ఎంతో గర్వంగా ఉంది. వందల కోట్ల నిధులు తెచ్చి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తున్నారు. విద్యుత్ పనులను వారు చేపట్టిన వేగం అద్భుతం. వారి పనితనాన్ని చూసి మేం ఎంతో నేర్చుకోవాలి. ఒక్క ఓటుతో ఇద్దరు సమర్థవంతమైన నేతలు ప్రజలకు దొరికారు. గత వైసీపీ ప్రభుత్వం వ్యవసాయ, హార్టికల్చర్ శాఖలను పూర్తిగా మూతవేశారు. అప్పట్లో రాయలసీమ రైతు కష్టాలను అప్పటి మంత్రి కన్నబాబు.. జగన్ దృష్టికి తీసుకువెళ్తే, ‘నన్ ఆఫ్ యువర్ బిజినెస్’ అంటూ తిట్టి పంపాడు. రైతులకు అందాల్సిన సబ్సిడీలను జగన్ నిలిపివేస్తే, మా కూటమి ప్రభుత్వం మళ్లీ వాటిని పునరుద్ధరించింది. వైసీపీ నేతలు ఒక్క పని కూడా చేయకుండానే కోట్లాది రూపాయలను బిల్లులు డ్రా చేసుకున్నారు’ అని అన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కొండగట్టును అభివృద్ధి చేస్తాం: బండి సంజయ్
ఆ జిల్లాలో దారుణం.. అచ్చం ‘రాజు వెడ్స్ రాంబాయి’ ఘటన రిపీట్
సంగారెడ్డి జిల్లాలో దారుణం.. దంపతుల హత్య
Read Latest Telangana News And AP News And International News And Telugu News