Share News

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. రూ. 2 కోట్లకు పైగా నగదు సీజ్..

ABN , Publish Date - Feb 20 , 2026 | 08:13 PM

నెల్లూరు జిల్లాలో సంచలనం సృష్టించిన క్రికెట్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మాఫియా గుట్టును పోలీసులు రట్టు చేశారు. ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఇవాళ (శుక్రవారం) మీడియా సమావేశంలో వెల్లడించారు..

నెల్లూరులో క్రికెట్ బెట్టింగ్ మాఫియా గుట్టురట్టు.. రూ. 2 కోట్లకు పైగా నగదు సీజ్..
Nellore Cricket Betting Mafia Arrest

నెల్లూరు, ఫిబ్రవరి 20 (ఆంధ్రజ్యోతి): నెల్లూరు జిల్లాలోని బుచ్చిరెడ్డిపాలెం కేంద్రంగా సాగుతున్న భారీ క్రికెట్ బెట్టింగ్, ఇన్వెస్ట్‌మెంట్ మోసాల నెట్‌వర్క్‌ను (Nellore Cricket Betting Mafia Arrest) నెల్లూరు జిల్లా పోలీసులు ఛేదించారు. అమాయక యువకులను లక్ష్యంగా చేసుకుని కోట్ల రూపాయల దందా నిర్వహిస్తున్న ముఠా నాయకులను కటకటాల్లోకి నెట్టారు. ఈ భారీ ఆపరేషన్‌కు సంబంధించిన వివరాలను నెల్లూరు జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల ఇవాళ (శుక్రవారం) మీడియా సమావేశంలో వెల్లడించారు.


నిందితుల అరెస్ట్..

ఈ కేసులో ప్రధాన నిందితులైన బెట్టింగ్ మాఫియా లీడర్లు కూసెట్టి వేణుగోపాల్, బిట్ర వెంకటరమణలను పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిద్దరూ ఒక ముఠాగా ఏర్పడి నెల్లూరు జిల్లా వ్యాప్తంగా తమ నెట్‌వర్క్‌ను విస్తరించినట్లు పోలీసుల విచారణలో తేలింది. అధిక లాభాలు వస్తాయంటూ ఇన్వెస్ట్‌మెంట్ పేరుతో యువకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేశారని తెలిపారు.

NELLORE-POLICE--2.jpg


బెదిరింపులు..

వసూలు చేసిన సొమ్మును అక్రమ క్రికెట్ బెట్టింగ్ యాప్స్, పలు సైట్లకి మళ్లించేవారని ఎస్పీ అజితా వెజెండ్ల వివరించారు. తాము పెట్టిన పెట్టుబడిని తిరిగి ఇవ్వమని అడిగిన బాధితులను నిందితులు కత్తులతో బెదిరిస్తూ భయబ్రాంతులకు గురిచేసేవారని అన్నారు. పోలీసులు నిందితుల నుంచి భారీ ఎత్తున నగదు, ఎలక్ట్రానిక్ వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. నిందితుల నుంచి రూ. 34,65,800ల నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే వివిధ బ్యాంకు అకౌంట్లలో ఉన్న రూ.1,64,74,600 నగదును పోలీసులు సీజ్ చేశారు. మొత్తం రికవరీ విలువ సుమారు రూ.2 కోట్లు దాటిందని పోలీసులు చెప్పారు. 13 సెల్ ఫోన్లు, ఒక ల్యాప్‌టాప్, LED టీవీ, ఒక మానిటర్, కత్తులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ అజితా వెజెండ్ల పేర్కొన్నారు.

NELLORE-POLICE-3.jpg


జిల్లా ఎస్పీ అజితా వెజెండ్ల హెచ్చరిక..

యువత ఇటువంటి ఈజీ మనీ, క్రికెట్ బెట్టింగ్ వ్యసనాలకు దూరంగా ఉండాలని ఎస్పీ అజితా వెజెండ్ల సూచించారు. ఎవరైనా పెట్టుబడి పేరుతో ఆశ చూపిస్తే నమ్మొద్దని, ఇలాంటి ముఠాల సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేయాలని ఆమె కోరారు. బుచ్చి కేంద్రంగా సాగుతున్న ఈ దందాలో ఇంకా ఎవరికైనా సంబంధం ఉందా అనే కోణంలో దర్యాప్తు కొనసాగుతోందని స్పష్టం చేశారు. సైబర్ నేరాలు, బెట్టింగ్ ముఠాలపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ అజితా వెజెండ్ల సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 20 , 2026 | 08:20 PM