Share News

నేను బటన్‌ నొక్కే వ్యక్తిని కాదు.. ప్రజల్లో ఉండే వ్యక్తిని: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jul 01 , 2026 | 03:03 PM

పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని అన్నారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు.

నేను బటన్‌ నొక్కే వ్యక్తిని కాదు.. ప్రజల్లో ఉండే వ్యక్తిని: సీఎం చంద్రబాబు
CM Chandrababu Naidu

నెల్లూరు, జులై 1: పేదలను ఆనందంగా చూడాలన్నదే తన లక్ష్యమని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. ఈరోజు(బుధవారం) పున్నపువారిపాలెంలో నిర్వహించిన ప్రజావేదిక సభలో సీఎం మాట్లాడుతూ.. ఇంటింటికీ వెళ్లి పెన్షన్లు ఇస్తున్నామని.. 62.20 లక్షల మందికి పెన్షన్లు ఇస్తున్నట్లు తెలిపారు. పెన్షన్ల కోసం ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు పెడుతున్నామని చెప్పారు. 28 కేటగిరీలకు పెన్షన్లు అందిస్తున్నామని అన్నారు. పేదల జీవితాల్లో శాశ్వతంగా వెలుగులు తీసుకువస్తామన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందాలని అన్నారు. ‘నేను బటన్‌ నొక్కే వ్యక్తిని కాదు.. ప్రజల్లో ఉండే వ్యక్తిని’ అని స్పష్టం చేశారు. ఒక నెలలో తీసుకోకపోయినా..3 నెలలకు ఒకేసారి పెన్షన్‌ ఇస్తున్నామని అన్నారు.


సుపరిపాలనకు నాంది...

రాష్ట్ర పునర్నిర్మాణానికి తాను, డిప్యూటీ సీఎం పవన్‌ కలిసి ముందుకొచ్చామని సీఎం తెలిపారు. అభివృద్ధితో పాటు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నారు. సుపరిపాలనకు నాంది పలికామని.. ఏ ఆఫీస్‌కు వెళ్లకుండా మనమిత్ర యాప్‌ తెచ్చామని అన్నారు. మనమిత్ర యాప్‌లో ప్రభుత్వ సేవలు అందుబాటులోకి తెచ్చామన్నారు. ఇప్పుడిప్పుడే అన్ని డిపార్ట్‌మెంట్లను గాడిలో పెడుతున్నామని వెల్లడించారు. పారిశ్రామిక అభివృద్ధిలో ఏపీ చాలా ముందుందని తెలిపారు. ప్రతి ఇంటి నుంచి ఒక వ్యాపారవేత్తను తయారు చేస్తామని చెప్పారు. కేంద్రాన్ని ఏం అడిగినా సాయం చేస్తోందన్నారు.


నదుల అనుసంధానమే నీటి సమస్యకు పరిష్కారం..

దేశంలోనే నం.1 జిల్లాగా నెల్లూరును మారుస్తామని వెల్లడించారు. నెల్లూరుకు 27 భారీ పరిశ్రమలు వస్తున్నాయని.. దేశంలోనే మెగా ఫర్నిచర్‌ పార్క్‌ గూడూరులో వస్తోందని తెలిపారు. దేశానికి వచ్చే పెట్టుబడుల్లో 25 శాతం ఏపీకే వచ్చాయన్నారు. నదుల అనుసంధానమే నీటి సమస్యకు పరిష్కారమని చెప్పుకొచ్చారు. వెలిగొండను పూర్తి చేసే బాధ్యత కూటమి ప్రభుత్వానిదే అని అన్నారు. భవిష్యత్తులో అన్ని ఏసీ బస్సులే ఉంటాయన్నారు. పీ4 కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. పేదవాళ్లందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు కల్పిస్తామన్నారు. డ్వాక్రా సంఘాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని కొనియాడారు.


అభివృద్ధి, సంక్షేమం కోసమే నా ప్రయత్నం..

ఎల్‌నినో ప్రభావం తీవ్రంగా ఉందని.. గత ఏడాది జూన్‌లోనే ప్రాజెక్టులకు నీళ్లు వచ్చాయని ముఖ్యమంత్రి తెలిపారు. ఈసారి జులై వచ్చినా.. ప్రాజెక్టులకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. వర్షాలు లేక కృష్ణా, గోదావరి నుంచి నీళ్లు వచ్చేలా లేవన్నారు. గోదారి-కావేరి అనుసంధానం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. యుద్ధం వల్ల అన్నింటి ధరలూ పెరుగుతున్నాయన్నారు. కష్టాలు వచ్చిన సమయంలో తెలివిగా వ్యవహరించాలని అన్నారు. దేశం నాకేం ఇచ్చింది కాదు.. దేశానికి నేనేం ఇచ్చానని ఆలోచించాలని సూచించారు. అభివృద్ధి, సంక్షేమం కోసమే తన ప్రయత్నమని తెలిపారు.


రౌడీయిజం చేస్తామంటే ఊరుకోం..

రాష్ట్రంలో ఓ గొడ్డలి పార్టీ ఉందని.. ప్రజలు కూడా ఆ పార్టీని గొడ్డలి పార్టీగానే పిలవాలంటూ సీఎం వ్యాఖ్యానించారు. గొడ్డలి పార్టీ నుంచి రోజుకో ఫేక్‌ న్యూస్‌ వస్తోందని మండిపడ్డారు. కులం, మతం, ప్రాంతాల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. అమరావతిని రాజధానిగా ప్రకటిస్తే అందరూ మద్దతు ఇచ్చారని.. అధికారంలోకి వచ్చాక అమరావతిపై మాట మార్చారని విమర్శించారు. మూడు రాజధానులు అంటూ మూడు ముక్కలాట ఆడారని.. ఇప్పుడు మావిగన్‌ అంటున్నారని ఫైర్ అయ్యారు. గొడ్డలి పార్టీకి తప్ప.. అందరికీ రాజధాని కావాలన్నారు. రాజధానిని వ్యతిరేకించినందుకే 11 సీట్లకు పరిమితమయ్యారని తెలిపారు. కుల రాజకీయాలు చేయాలని చూశారని ఆరోపించారు. కేంద్రానికి చెప్పి రాజధానికి చట్టం చేయించామని.. చట్టం చేసినా రాధానిని గొడ్డలిపార్టీ అంగీకరించడం లేదన్నారు. రౌడీలతో రాజధాని రైతులపై దండయాత్రకు వెళ్లారని మండిపడ్డారు. రౌడీయిజం చేస్తామంటే ఎవరూ ఊరుకోరని హెచ్చరించారు.


రౌడీలు, గూండాలకు వైసీపీ మద్దతు...

సాయికృష్ణ కేసులో ఉపముఖ్యమంత్రి పవన్‌ను తీసుకొచ్చారని చంద్రబాబు మండిపడ్డారు. పవన్‌, ఆయన కూతుళ్లపై ఇష్టారీతిన పోస్టులు పెట్టించారన్నారు. సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టించి పైశాచిక ఆనందం పొందారని ఆగ్రహించారు. బ్లేడ్‌ బ్యాచ్‌లు, రౌడీలు, గూండాలకు వైసీపీ మద్దతిస్తోందని ఆరోపించారు. హోం మంత్రిపై కూడా మేకప్‌ అంటూ కామెంట్స్‌ చేస్తున్నారని అన్నారు. ‘తప్పు కదా అంటే.. నా ఇష్టం అంటూ అమర్నాథ్‌ మాట్లాడుతున్నారు. ఆడబిడ్డల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది’ అంటూ సీఎం చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు.


ఇవి కూడా చదవండి...

కృష్ణా తూర్పు డెల్టా కాలువలకు 3200 క్యూసెక్కుల నీరు విడుదల

సాయికృష్ణ కేసు.. మరో ఇద్దరు కానిస్టేబుళ్లకు 14 రోజుల రిమాండ్

Read Latest AP News And Telugu News

Updated Date - Jul 01 , 2026 | 03:19 PM