సమన్వయంతో పనిచేయండి
ABN , Publish Date - Jul 29 , 2026 | 10:31 AM
భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు.
భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవం, ప్రధాని పర్యటన ఏర్పాట్లు వేగంగా పూర్తిచేయండి
అధికారులకు మంత్రి లోకేశ్ సూచనలు
విజయనగరం/భోగాపురం: భోగాపురం అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను మంత్రి లోకేశ్ ఆదేశించారు. అందరూ సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూసేలా ప్రజా ప్రతినిధులు బాధ్యత తీసుకోవాలన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ శనివారం విమానాశ్రయాన్ని ప్రారంభిస్తున్న నేపథ్యంలో ఆయన పర్యటన ఏర్పాట్లను కేంద్ర మంత్రి రామ్మోహన్‌నాయుడు, పలువురు రాష్ట్ర మంత్రులతో కలిసి లోకేశ్ మంగళవారం భోగాపురం ఎయిర్‌పోర్టులో సమీక్షించారు.
రహదారుల పనులు, పార్కింగ్, బహిరంగ సభావేదిక, భద్రత, జనసమీకరణ, ప్రొటోకాల్ గ్యాలరీ, భోజనం, రవాణా ఏర్పాట్లపై ఇప్పటి వరకు చేపట్టిన చర్యలను అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా రామ్మోహన్‌నాయుడు, లోకేశ్ అధికారులకు పలు సూచనలు చేశారు. కార్యక్రమానికి హజరయ్యే ప్రజల కోసం ప్రధాన రహదారికి ఇరువైపులా 20 భోజన కౌంటర్లు ఏర్పాటు చేయాలన్నారు. ఫైర్, అంబులెన్స్‌లు అందుబాటులో ఉంచాలని సూచించారు. బస్సులన్నీ ఉదయం 9 గంటలకే పార్కింగ్ స్థలాలకు చేరుకోవాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రులు అనిత, అచ్చెన్నాయుడు, అనగాని సత్యప్రసాద్, బీసీ జనార్దనరెడ్డి, గుమ్మిడి సంధ్యారాణి, కొలుసు పార్థసారథి, గొట్టిపాటి రవికుమార్, కొండపల్లి శ్రీనివాస్, డోలా బాల వీరాంజనేయస్వామి తదితరులు పాల్గొన్నారు.
గేట్‌వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రాగా ఎయిర్‌పోర్టు
ఎయిర్‌పోర్టు పరిసరాలు, ప్రధాని పర్యటన ఏర్పాట్లను మంత్రులు పరిశీలించిన అనంతరం మంత్రి కొలుసు పార్థసారథి భోగాపురం విమానాశ్రయం పరిపాలన భవనంలో విలేకరులతో మాట్లాడారు. ఈ విమానాశ్రయం గేట్‌వే ఆఫ్ గ్లోబల్ ఆంధ్రాగా మారబోతోందన్నారు. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు గౌరవార్థం ఈ విమానాశ్రయానికి ఆయన పేరు పెట్టడం ప్రతి తెలుగువాడికీ గర్వకారణమని చెప్పారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.. ఈ రోజు మీ నగరంలో ఎలా ఉన్నాయంటే..
బొండా ఉమా వివరణతో సంతృప్తి చెందిన అధిష్ఠానం
Read Latest AP News And Telangana News And International News And Telugu News