అభ్యంతరాలుంటే కోర్టుకెళ్లండి.. రౌడీయిజం ఎందుకు? మంత్రి అచ్చెన్నాయుడు
ABN , Publish Date - Sep 21 , 2026 | 05:19 PM
డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించిన ఉపాధ్యాయులపై దాడి చేయడం అత్యంత హేయమైన చర్య అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. గురువులపై దాడులతో వైసీపీ నిజస్వరూపం బయటపడిందని ఆయన అన్నారు.
అమరావతి, సెప్టెంబర్ 21: ఉపాధ్యాయులపై దాడి చేయడం అత్యంత అమానుషమైన చర్య అని మంత్రి అచ్చెన్నాయుడు అన్నారు. కష్టపడి ఉద్యోగాలు సాధించిన టీచర్లను ‘ఫేక్’ అంటూ అవమానించడం, వారిపై దాడికి పాల్పడడం వైసీపీ దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు.
డీఎస్సీలో ఎటువంటి అక్రమాలు జరగలేదని అచ్చెన్నాయుడు అన్నారు. ఏమైనా సందేహాలు ఉంటే.. వాస్తవాలను చూపెట్టి తగిన సమాధానం చెబుతామని.. కానీ.. టీచర్లపై దాడులు చేయడమేమిటని ఆయన నిలదీశారు. ‘డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆరోపించడం కాదు.. ఏమైనా ఆధారాలుంటే చూపండి.. లేదంటే కోర్టుకు వెళ్లి పోరాడండి.. అంతేకానీ రౌడీయిజం ఎందుకు?’ అని మంత్రి ప్రశ్నించారు. గురువులను బెదిరించడం, దాడికి దిగడం సరికాదని.. వారి ఆత్మగౌరవంతో రాజకీయాలు చేయడం తగదని ఆయన హితవు పలికారు. నియామకాలను అడ్డుకునే ప్రయత్నాలు విఫలమవడంతో వైసీపీ ఈ దుష్ప్రచారం చేస్తోందని మంత్రి ఆరోపించారు.
గురువులకు భద్రత కల్పిస్తాం: మంత్రి
వైసీపీ బెదిరింపులకు ఉపాధ్యాయులు భయపడాల్సిన అవసరం లేదని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. గురువులు భద్రత, గౌరవం విషయంలో ప్రభుత్వం ఏ మాత్రం రాజీపడదని ఆయన తెలిపారు. దాడులకు పాల్పడిన వారిని గుర్తించి.. వారిపై చట్టబద్దమైన చర్యలు తీసుకుంటామని మంత్రి హామీ ఇచ్చారు. అసత్య ప్రచారంతో నిజాన్ని ఎక్కువకాలం దాచలేరని.. త్వరలోనే ప్రజల ముందు వాస్తవాలు పెడతామని.. అందాకా ఉపాధ్యాయులు ఆత్మస్థైర్యంతో ముందుకెళ్లాలని ఆయన సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఏపీ విద్యావ్యవస్థను నంబర్ వన్‌గా తీర్చిదిద్దుతాం: మంత్రి లోకేశ్
వైసీపీ నేతల తీరు మార్చుకోకపోతే ప్రజల ఛీత్కారానికి గురికాక తప్పదు: మంత్రి నారాయణ
శుభ్రమైన వీధి చీపురుతో మొదలవ్వదు: పవన్ కల్యాణ్
Read Latest AP News And Telangana News And National News
And Telugu News