కర్నూలు జిల్లాలో అమానుషం.. టీడీపీ నేత దారుణ హత్య
ABN , Publish Date - Jan 31 , 2026 | 12:28 PM
కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలం బందిమడుగుల గ్రామంలో విషాదం చోటు చేసుకుంది. టీడీపీ నాయకుడు, ఎమ్మార్పీఎస్ ఏపీ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్‌ను గుర్తుతెలియని దుండగులు హతమార్చారు.
కర్నూలు జిల్లా, జనవరి 31 (ఆంధ్రజ్యోతి): కర్నూలు జిల్లాలోని తుగ్గలి మండలంలో దారుణం జరిగింది. తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎమ్మార్పీఎస్(MRPS) ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రమేశ్.. ప్రత్యర్థుల దాడిలో దారుణ హత్యకు గురయ్యారు. పక్కా స్కెచ్‌తో జరిగిన ఈ హత్య స్థానికంగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనపై కర్నూలు జిల్లా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు.
ఘటన నేపథ్యమిదే..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నిన్న(శుక్రవారం) సాయంత్రం రమేశ్ తన స్వగ్రామమైన బొందిమడుగుల శివారులో రోజువారీ లాగే వాకింగ్‌కు వెళ్లారు. ఆ సమయంలో మాటువేసిన దుండగులు అత్యంత క్రూరంగా ఆయనపై దాడికి తెగబడ్డారు. మొదట రమేశ్‌ను వెనుక నుంచి ట్రాక్టర్‌తో బలంగా ఢీకొట్టారు. కిందపడిపోయిన ఆయనపై ఇనుప రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశారు. తీవ్ర గాయాలపాలైన రమేశ్ రక్తపు మడుగులో పడిపోయారు. గమనించిన స్థానికులు.. వెంటనే ఆయనను కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తీవ్రమైన గాయాలు కావడంతో.. చికిత్స పొందుతూ రమేశ్ మృతిచెందారు.
పోలీసుల చర్యలు..
దుండగులను గుర్తించేందుకు జిల్లా పోలీసులు గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. అయితే ఈ ఘటన జరగడానికి గల కారణాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఈ దాడి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ సంఘటన తర్వాత బందిమడుగుల గ్రామంలో భయానక వాతావరణం నెలకొంది. పోలీసులు గ్రామంలో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా గ్రామంలోని పలు ప్రాంతాలు సహా ఆస్పత్రి వద్ద పోలీసులు భారీగా మోహరించారు.
గ్రామంలో ఉద్రిక్తత..
రమేశ్ మరణవార్త తెలియడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి. ఆయన కుటుంబానికి సంఘీభావం తెలియజేస్తూ టీడీపీ శ్రేణులు, ఎమ్మార్పీఎస్ కార్యకర్తలు పెద్దఎత్తున ఆస్పత్రికి చేరుకున్నారు. ఈ దాడిని వారు ఖండించారు. రమేశ్ మృతిపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజకీయ కక్షల వల్లే ఈ హత్య జరిగిందని బాధితుడి అనుచరులు ఆరోపిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఈ దొంగతనం చూస్తే విస్తుపోవాల్సిందే.. కేవలం 15 సెకన్లలోనే..
బహిరంగ క్షమాపణ చెప్పాలి.. కౌశిక్‌రెడ్డిపై ఐపీఎస్‌ల సంఘం ఫైర్
Read Latest Telangana News And AP News And Telugu News