శ్రీశైలంలోకి నిలకడగా ప్రవాహం
ABN , Publish Date - Aug 13 , 2026 | 07:42 AM
శ్రీశైలం జలాశయంలోకి వరద నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నా.. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది.
ప్రస్తుతం 183 టీఎంసీల నిల్వ
ఇన్‌ఫ్లో కొనసాగితే ఐదారు రోజుల్లో డ్యాం నిండే అవకాశం
రోజుకు సగటున 6.50 టీఎంసీల ఇన్‌ఫ్లో
ప్రస్తుతం 76,416 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో
జూరాల నుంచి 83,161 క్యూసెక్కులు
తుంగభద్రకూ కొనసాగుతున్న వరద
కర్నూలు/అమరావతి, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం జలాశయంలోకి వరద నిలకడగా కొనసాగుతోంది. రాష్ట్రంలో ఎల్‌నినో ప్రభావంతో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు వెంటాడుతున్నా.. ఎగువన కర్ణాటక, మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు కృష్ణా, తుంగభద్ర నదులకు వరద పోటెత్తుతోంది. శ్రీశైలం, తుంగభద్ర, జూరాల జలాశయాలకు ఆశాజనకంగా వరద చేరుతోంది. బుధవారం సాయంత్రం 6 గంటల సమయానికి శ్రీశైలంలోకి 76,416 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉంది. జూరాల ప్రాజెక్టు నుంచి 83,161 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం డ్యాం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 215.810 టీఎంసీలు కాగా.. ప్రస్తుతం 183.419 టీఎంసీలున్నాయి. ఇంకో 32.39 టీఎంసీలు చేరితే పూర్తిగా నిండుతుంది. ప్రస్తుతం రోజుకు సగటున 6.50 టీఎంసీల ప్రవాహం చేరుతోంది. ఇది ఇలాగే కొనసాగితే ఐదారు రోజుల్లో డ్యాం పూర్తి స్థాయిలో నిండుతుందని ఇంజనీర్లు పేర్కొంటున్నారు. బుధవారం తెలంగాణ ప్రభుత్వం ఎడమగట్టు విద్యుత్కేంద్రంలో విద్యుదుత్పత్తి ద్వారా 35,315 క్యూసెక్కులు, ఏపీ ప్రభుత్వం కుడిగట్టు కేంద్రంలో విద్యుదుత్పాదనకు 14,160 క్యూసెక్కులు వినియోగించి దిగువన నాగార్జున సాగర్‌కు విడుదల చేశాయి. అలాగే.. రాయలసీమ జిల్లాల తాగునీటి అవసరాల కోసం ఏపీ హంద్రీ-నీవా కాలువకు 3,050 క్యూసెక్కులు.. లిఫ్టు, పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి ఎస్‌ఆర్‌ఎంసీ కాలువకు పది వేల క్యూసెక్కులు విడుదల చేస్తోంది. తెలంగాణ కల్వకుర్తి ఎత్తిపోతల ద్వారా 2,016 క్యూసెక్కులు ఎత్తిపోస్తోంది.
ఇక తుంగభద్ర డ్యాంకు 38,051 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో కొనసాగుతోంది. గరిష్ఠ సామర్థ్యం 105.788 టీఎంసీలకు గాను ప్రస్తుతం 85.359 టీఎంసీలు చేరింది. సరాసరి రోజుకు 3.5 టీఎంసీల ప్రవాహం చేరుతోంది. ఇలాగే కొనసాగితే పది రోజుల్లో పూర్తి స్థాయిలో నిండుతుందని అంచనా.
ఉదయం ఆలమట్టి ప్రాజెక్టు నుంచి 50,655 క్యూసెక్కులు విడుదల చేయగా.. నారాయణపూర్ డ్యాం నుంచి 44,013 క్యూసెక్కులు వదిలారు. సాయంత్రానికి వరద తగ్గడంతో ఆలమట్టి నుంచి 20 వేలు, నారాయణపూర్ నుంచి 12,960 క్యూసెక్కులు మాత్రమే వదులుతున్నారు.
నాగార్జున సాగర్ గరిష్ఠ నిల్వ 312.080 టీఎంసీలకు గాను 149.641 టీఎంసీలున్నాయి. 76,416 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. విద్యుత్ అవసరాల కోసం తూముల ద్వారా 15,450 క్యూసెక్కులను వదులుతున్నారు. పులిచింతల ప్రాజెక్టు సామర్థ్యం 45.77 టీఎంసీలకు గాను 28.68 టీఎంసీల నిల్వ ఉంది. పై నుంచి ఎలాంటి ప్రవాహమూ లేదు. లీకేజీల ద్వారా 400 క్యూసెక్కులు విడుదలవుతోంది.
కృష్ణా బోర్డు భేటీ వాయిదా
కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ సమావేశం వాయిదాపడింది. బోర్డు చైర్మన్ సుబ్రాంగ్షు బిశ్వాస్ నేతృత్వంలో ఈ కమిటీ గురువారం హైదరాబాద్ జలసౌధలో భేటీ అవ్వాల్సి ఉండగా.. చివరి నిమిషంలో వాయిదాపడినట్లు రెండు రాష్ట్రాలకూ సమాచారమిచ్చారు.
శ్రీశైలం డ్యాం నిర్వహణలో జాగ్రత్తలు అవసరం: జలసంఘం సభ్యుల సూచన
శ్రీశైలం, ఆగస్టు 12 (ఆంధ్రజ్యోతి): శ్రీశైలం డ్యాం నిర్వహణలో జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) అధికారులు సూచించారు. అలసత్వం వహించవద్దని డ్యాం సిబ్బందితో అన్నారు. జలసంఘం సభ్యుడు, కేంద్రప్రభుత్వ ఎక్స్ అఫీషియో అదనపు కార్యదర్శి యోగేశ్ పైథాంకర్, మరో ఇద్దరు అధికారులు బుధవారం సాయంత్రం ఈ జలాశయాన్ని సందర్శించారు. ప్రధానంగా నీటిమట్టం, ఇన్‌ఫ్లో, అవుట్ ఫ్లో, క్రస్ట్‌గేట్లు, గ్యాలరీ, విద్యుదుత్పత్తి కేంద్రాన్ని పరిశీలించారు. ప్లంజ్‌పూల్ మరమ్మతులు చేపట్టేందుకు వేస్తున్న అప్రోచ్ రోడ్ పురోగతి గురించి తెలుసుకున్నారు.
వార్తలు కూడా చదవండి...
చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిపై కఠినంగా వ్యవహరించాలి: సీఎం చంద్రబాబు
అమరావతి అభివృద్ధిలో మరో ముందడుగు.. సీడ్ యాక్సిస్ రోడ్డు, రెండు స్టీల్ బ్రిడ్జిల ప్రారంభం
నటి కాదంబరీ జెత్వానీ కేసులో కీలక పరిణామం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News