ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసై భారీ అప్పులు.. దంపతుల బలవన్మరణం
ABN , Publish Date - Sep 28 , 2026 | 11:01 AM
నంద్యాల జిల్లాలోని గోస్పాడు మండలం సాంబవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. శేషాద్రి అనే వ్యక్తి భార్య అంజితతో కలిసి సాంబవరంలో నివాసం ఉంటున్నారు.
నంద్యాల, సెప్టెంబర్ 28: జిల్లాలోని గోస్పాడు మండలం సాంబవరంలో విషాదం చోటు చేసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్ దంపతుల ప్రాణాలను బలితీసుకుంది. ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడిన ఓ వ్యక్తి.. ఆర్థికి ఇబ్బందులు తాళలేక భార్యతో కలిసి ఆత్మహత్య చేసుకున్నాడు. శేషాద్రి అనే వ్యక్తి భార్య అంజితతో కలిసి సాంబవరంలో నివాసం ఉంటున్నారు. అయితే శేషాద్రి ఆన్‌లైన్ గేమింగ్‌కు అలవాటుపడ్డాడు. ప్రతిరోజు ఆన్‌లైన్ గేమ్ ఆడటం సరదాగా మారింది. కొద్దిరోజులకు అదికాస్తా వ్యసనానికి దారితీసింది. ఆన్‌లైన్ గేమింగ్‌కు బానిసైన శేషాద్రి భారీగా అప్పులు చేశాడు. అయినవాళ్ల దగ్గర డబ్బులు అప్పుగా తెచ్చి మరీ ఆన్‌లైన్ గేమ్ ఆడాడు. చివరకు భారీగా అప్పుల్లో కూరుకుపోయాడు.
అప్పులు తీర్చేందుకు భార్య అంజిత బంగారు నగలను తాకట్టు పెట్టాల్సి వచ్చింది. వచ్చిన డబ్బులతో అప్పులు తీర్చాలని భావించారు. అయితే నగలు తాకట్టు పెట్టినా అప్పులు తీరని పరిస్థితి. రోజురోజుకు అప్పుల భారం అంతకంతకూ పెరుగుతూనే ఉంది. అప్పుల బాధతో దంపతులు తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. డబ్బులు కట్టే మార్గం లేకపోవడంతో తనువు చాలించాలని నిర్ణయించిన శేషాద్రి, అంజిత.. ఇంట్లోనే చీరతో ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. దంపతులు తలుపులు తీయకపోవడంతో అనుమానం వచ్చిన స్థానికులు వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు.
అక్కడకు చేరుకున్న పోలీసులు తలుపులు పగులగొట్టి చూడగా భార్యాభర్తలు చీరకు వేలాడుతూ కనిపించారు. వెంటనే వారిని కిందకు దింపిన పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దంపతుల మృతిపట్ల కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఆన్‌లైన్ గేమింగ్ కారణంగా తీవ్ర అప్పుల పాలై దంపతులు ప్రాణాలు తీసుకోవడం స్థానికంగా సంచలనంగా మారింది.
ఇవి కూడా చదవండి...
రంగారెడ్డి జిల్లాలో జింక మాంసం పట్టివేత.. 8 మంది అరెస్ట్
Read Latest AP News And Telugu News