వెలిగొండ ప్రాజెక్టును జగన్ నిర్లక్ష్యంగా వదిలేశారు: మంత్రి నిమ్మల
ABN , Publish Date - May 06 , 2026 | 09:33 AM
వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలిగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యం చేశారని ధ్వజమెత్తారు.
మార్కాపురం, మే 6 (ఆంధ్రజ్యోతి): వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ మంత్రి నిమ్మల రామానాయుడు (Minister Nimmala Ramanaidu) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ హయాంలో వెలిగొండ పనులు పూర్తి చేయకుండా నిర్లక్ష్యంగా వదిలేశారని ధ్వజమెత్తారు. వెలిగొండ టన్నెల్‌లో నిన్న (మంగళవారం) రాత్రంతా ఉండి లైనింగ్, బెంచింగ్ పనులను పరిశీలించారు. టన్నెల్‌లో 19 కిలోమీటర్లు ప్రయాణించి 5 గ్యాంట్రీలతో జరుగుతున్న పనులను, కార్మికుల యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. టన్నెల్-2లో 12వ కిలోమీటరు దగ్గర చిక్కుకుపోయిన టీబీఎం మెషిన్ దగ్గరకు వెళ్లి మంత్రి పరిశీలించారు.
ఈ సందర్భంగా మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. గత వైసీపీ ప్రభుత్వంలో టీబీఎం తొలగించడానికి ఎలాంటి ప్రయత్నం చేయలేదని దుయ్యబట్టారు. టీబీఎం తొలగించకపోతే చుక్క నీరు కూడా టన్నెల్ నుంచి బయటకు రాదని చెప్పుకొచ్చారు. టీబీఎం తొలగించకుండా, ఇంకా రూ.3 వేల కోట్ల పనులు చేయాల్సి ఉందని అన్నారు. అయిన వెలిగొండను జాతికి అంకితం చేసి ప్రకాశం జిల్లా రైతులను జగన్ మోసం చేశారని మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు.