Cock Fighting: కృష్ణా జిల్లాలో సంచలనం.. కోటి రూపాయల కోడి పందెం..
ABN , Publish Date - Jan 16 , 2026 | 09:51 PM
కృష్ణా జిల్లా గన్నవరం కేసరపల్లి బరిలో జరిగిన కోటి రూపాయల కోడి పందెం తెలుగు రాష్ట్రాల్లో చర్చనీయాంశంగా మారింది. కోడి పందేల వెనుక నడుస్తున్న కోట్ల రూపాయల లావాదేవీలు మరోసారి వెలుగులోకి రావడంతో, రానున్న రోజుల్లో ఈ వ్యవహారంపై పోలీసుల చర్యలు ఎలా ఉంటాయన్నది చర్చనీయాంశంగా మారింది.
కృష్ణా జిల్లా: కృష్ణా జిల్లాలో మరోసారి కోడి పందేలు (Cock Fighting) సంచలనంగా మారాయి. గన్నవరం మండలం కేసరపల్లి బరిలో జరిగిన కోడి పందెం ఏకంగా కోటి రూపాయల వరకు చేరడంతో చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారి తీసింది. ఉత్కంఠగా సాగిన ఈ ముసుగు కోడి పందెంలో హైదరాబాద్‌కు చెందిన జినెక్స్ అమర్ కోడి విజయం సాధించి కోటి రూపాయలు దక్కించుకుంది.
ప్రత్యర్థి కోడిని ఓడించిన జినెక్స్ అమర్ కోడి
ఈ పందెంలో పాల్గొన్న కోళ్లల్లో హైదరాబాద్‌కు చెందిన జినెక్స్ అమర్ కోడి కృష్ణా జిల్లాకు చెందిన జాట్టు సుబ్రమణ్యం కోడి మధ్య తీవ్ర పోటీ నెలకొంది. కాసేపు ఉత్కంఠగా సాగిన పోరులో చివరికి జినెక్స్ అమర్ కోడి ప్రత్యర్థి కోడిని ఓడించి విజయం సాధించింది. దీంతో పందెం మొత్తం అమర్ వర్గం ఖాతాలో పడింది.
కోటి రూపాయలు కోల్పోయిన జాట్టు సుబ్రమణ్యం
ఈ కోడి పందెంలో ఓటమి పాలైన జాట్టు సుబ్రమణ్యం ఏకంగా కోటి రూపాయలు నష్టపోయారు. ఈ విషయం పందెం ముగిసిన తర్వాత వారి వర్గాల్లో తీవ్ర చర్చ జరిగింది. ఈ సంఘటన కోడి పందేల వెనుక జరుగుతున్న భారీ ఆర్థిక లావాదేవీలకు నిదర్శనంగా మారింది.
లక్షల్లో పై పందాలు
కోటి రూపాయల ప్రధాన పందెంతో పాటు చుట్టుపక్కల వారు, వివిధ వర్గాల మధ్య లక్షల రూపాయల్లో పై పందెలు జరిగినట్లు సమాచారం. ఒక్కో రౌండ్‌కు లక్షల రూపాయలు చేతులు మారినట్లు స్థానికంగా చర్చ జరుగుతోంది.
ముసుగు కోడి పందెంగా నిర్వహణ
ఈ పందెం ముసుగు కోడి పందెంగా నిర్వహించారు. బయటకు పెద్దగా సమాచారం లీక్ కాకుండా పరిమిత వ్యక్తుల మధ్యే ఈ పందెం జరిగినట్లు తెలుస్తోంది. అయినప్పటికీ ఈ కోడి పందెం విషయం బయటకు రావడంతో జిల్లావ్యాప్తంగా సంచలనంగా మారింది.
వీఐపీలకు అడ్రస్‌గా కేసరపల్లి బరి...
కేసరపల్లి బరి ఈ ఏడాది వీఐపీలకు కేరాఫ్ అడ్రస్‌గా మారింది. కేవలం కృష్ణా జిల్లా నుంచే కాకుండా హైదరాబాద్, భీమవరం, బెంగళూరు నుంచి కూడా ప్రముఖులు ఈ పందాలను వీక్షించడానికి తరలివచ్చారు. పోలీసులు ఆంక్షలు విధించినప్పటికీ, కొంతమంది నేతల అండదండలతో ఈ పందాలు బహిరంగంగానే సాగాయి. పందెం సందర్భంగా హై-టెక్ బరులు, బౌన్సర్లు, ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాట్లు చేశారు.
కోడి పందేలపై ప్రశ్నలు
సంక్రాంతి సమయంలో కోడి పందేలపై నిషేధం ఉన్నప్పటికీ ఇంత భారీగా పందెలు జరగడం పోలీసు నిఘాపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఈ ఘటనపై అధికారులు ఎలా స్పందిస్తారన్నది చర్చనీయాంశంగా మారింది.
ఇవి కూడా చదవండి...
వైభవంగా ప్రభల ఉత్సవం.. లక్షలాదిగా తరలిరానున్న భక్తులు
సంక్రాంతి పండుగ రోజు చోరీ.. కేవలం ఒక్కరోజులోనే..
Read Latest AP News And Telugu News