ఉపాధ్యాయులందరికీ ‘టీచర్స్ డే’ శుభాకాంక్షలు: చంద్రబాబు, పవన్, లోకేశ్
ABN , Publish Date - Sep 05 , 2026 | 10:27 AM
ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు.
అమరావతి, సెప్టెంబర్ 5: ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సోషల్ మీడియా ఎక్స్ వేదికగా వీరు విషెస్ తెలియజేశారు. ఉపాధ్యాయ దినోత్సవం అందరిలో స్ఫూర్తి నింపాలని సీఎం అన్నారు. భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ స్ఫూర్తిని ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు తీసుకెళ్లాలని డిప్యూటీ సీఎం పవన్ తెలిపారు. రాధాకృష్ణన్ జయంతిని పురస్కరించుకుని ప్రతి ఏటా ఉపాధ్యాయ దినోత్సవాన్ని జరుపుకుంటున్నామని లోకేశ్ వెల్లడించారు.
చంద్రబాబు పోస్ట్..
‘పాఠ్యాంశాలతో పాటు విలువలు బోధిస్తూ, క్రమశిక్షణ నేర్పుతూ విద్యార్థులను తీర్చిదిద్దే ఉపాధ్యాయులందరికీ ‘ఉపాధ్యాయ దినోత్సవం’ శుభాకాంక్షలు. భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా నిర్వహించుకునే ఉపాధ్యాయ దినోత్సవం మనందరిలో స్ఫూర్తి నింపాలి. ఆదర్శ జీవితం గడిపి అత్యున్నత స్థానానికి వెళ్లిన ఆయనను భావితరాలు ఆదర్శంగా తీసుకోవాలి. భావి భారత పౌరులను సమాజానికి అందించి బలమైన దేశ నిర్మాణం కోసం అహర్నిశలూ కృషి చేస్తున్న ఉపాధ్యాయినీ, ఉపాధ్యాయులకు శుభాకాంక్షలు తెలుపుతున్నాను’ అంటూ ఎక్స్‌లో సీఎం చంద్రబాబు పోస్ట్ చేశారు.
రాధాకృష్ణన్ స్ఫూర్తితో ముందు సాగాలి: పవన్ కల్యాణ్
విజ్ఞాన వృక్షంలాంటి గురువు గొప్పదనాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని ఉపముఖ్యమంత్రి పవన్ అన్నారు. అక్షర జ్ఞానాన్ని అందించి, వ్యక్తిత్వ వికాసానికి బాటలు వేసి, ఉజ్వల భవిష్యత్తుకు మార్గదర్శకులుగా నిలిచే ఉపాధ్యాయులను నిత్యం గౌరవించాలని సూచించారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవాన్ని అత్యున్నత స్థాయికి చేర్చిన భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆయన స్ఫూర్తిని ప్రతి ఉపాధ్యాయుడు ముందుకు తీసుకెళ్లాలన్నారు. బంగారు భారతావనిని నిర్మించే బాధ్యతగల పౌరులను తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. బోధన రంగంలో ఉన్నవారందరికీ పవన్ హృదయపూర్వకంగా ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
తల్లి, తండ్రి తర్వాతి స్థానం టీచర్‌దే: మంత్రి లోకేశ్
‘భారతరత్న, డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఆ మహనీయునికి నివాళులర్పిస్తున్నాను. మహా మహోపాధ్యాయుడి జయంతిని పురస్కరించుకుని ఉపాధ్యాయ దినోత్సవం(గురుపూజోత్సవం) ప్రతి ఏటా జరుపుతున్నాం. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురువులు అందరికీ శుభాకాంక్షలు. తల్లి, తండ్రి తర్వాతి స్థానం టీచర్‌దే. ప్రతి ఒక్కరి విజయంలో టీచర్ పాత్ర కీలకం. ఉపాధ్యాయులను గౌరవిద్దాం. విలువలతో కూడిన విద్యా, విజ్ఞానవంతమైన సమాజ నిర్మాణానికి కృషి చేద్దాం’ అంటూ ఎక్స్‌లో లోకేశ్ పోస్ట్ చేశారు.
ఇవి కూడా చదవండి...
ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?
జూబ్లీహిల్స్ రిచ్ కిడ్స్ కేసు.. రెండో రోజు నిందితులను ప్రశ్నిస్తున్న పోలీసులు
Read Latest AP News And Telugu News