Share News

ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?

ABN , Publish Date - Sep 05 , 2026 | 04:18 AM

రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హకీంపేట ఎడ్యుకేషనల్‌ హబ్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు

ఇలాగైతే పనులు ఎలా పూర్తవుతాయి?
CM Revanth Reddy

  • హకీంపేట ఎడ్యుకేషనల్‌ హబ్‌ నిర్మాణ పనుల పురోగతిపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసహనం

  • నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని అధికారులకు ఆదేశం

  • నారాయణపేట జిల్లా మద్దూరులో డిగ్రీ కళాశాల,

  • గురుకుల పాఠశాల భవన నిర్మాణాలను పరిశీలించిన సీఎం

  • నేడు కొడంగల్‌లో ఉపాధ్యాయ దినోత్సవం

  • ఉత్తమ ఉపాధ్యాయులకు సీఎం చేతుల మీదుగా అవార్డులు

  • నకిరేకల్‌లో నేడు పలు ప్రారంభోత్సవాలు, బహిరంగ సభ

వికారాబాద్‌, మహబూబ్‌నగర్‌, కొడంగల్‌, నల్లగొండ, దుద్యాల, సెప్టెంబరు 4 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న హకీంపేట ఎడ్యుకేషనల్‌ హబ్‌ నిర్మాణ పనుల్లో వేగం పెంచాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. వికారాబాద్‌ జిల్లా దుద్యాల మండలంలో జరుగుతున్న హకీంపేట ఎడ్యుకేషనల్‌ హబ్‌ నిర్మాణ పనులను, నారాయణపేట జిల్లా మద్దూరులో జరుగుతున్న డిగ్రీ కళాశాల, గురుకుల పాఠశాల భవన నిర్మాణ పనులను ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి శుక్రవారం స్వయంగా పరిశీలించారు. హకీంపేట ఎడ్యుకేషనల్‌ హబ్‌లో భాగంగా ఉన్న యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌, ఇంజనీరింగ్‌, ప్రభుత్వ మెడికల్‌, నర్సింగ్‌, ఫిజియోథెరపి, పారా మెడికల్‌ కళాశాలలు, 430 పడకల ఆసుపత్రి, ఇతర భవనాల నిర్మాణ పనులు జరుగుతున్న తీరుపై సీఎం అసహనం వ్యక్తం చేశారు. తాను ఎడ్యుకేషనల్‌ హబ్‌కు వచ్చి 45 రోజులవుతోందని, కొన్ని నిర్మాణాల పనులు ఆశించిన స్థాయిలో కొనసాగడం లేదన్నారు. ఇదే పద్ధతి కొనసాగితే గడువులోగా పనులు ఎలా పూర్తి చేస్తారని అధికారులను ప్రశ్నించారు. 2027 మార్చి నాటికి ఎడ్యుకేషనల్‌ హబ్‌లో అన్ని భవనాల నిర్మాణలు పూర్తయ్యేలా పనుల వేగం పెంచాలని స్పష్టం చేశారు.


అలాగే, నిర్మాణాల్లో నాణ్యత, ఇతర సాంకేతిక అంశాలను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. వర్షం కురిస్తే నీరు నిల్వ ఉండకుండా వాటర్‌ హార్వెస్టింగ్‌ వెల్స్‌ ఏర్పాటు చేయాలని, వాన నీటిని ఒడిసిపట్టి ల్యాండ్‌ స్కేపింగ్‌ పనులకు వినియోగించుకోవాలని సూచించారు. వివిధ విద్యా సంస్థల భవన సముదాయాల నిర్మాణాలను క్షేత్రస్థాయిలో ఒక్కొక్కటిగా పరిశీలించిన సీఎం రేవంత్‌ రెడ్డి.. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ భవనాన్ని నిశితంగా పరిశీలించారు. ఫిజియోథెరపి భవన నిర్మాణ పనులను పరిశీలించిన సీఎం అక్కడున్న కార్మికులతో మాట్లాడారు. ఎన్నిరోజుల నుంచి ఇక్కడ ఎంత మంది పని చేస్తున్నారని ఆయన ఆరా తీయగా, వంద మంది పనిచేస్తున్నామని కార్మికులు చెప్పారు. సీఎం వెంట పరిగి, తాండూరు ఎమ్మెల్యేలు రామ్మోహన్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, ఉన్నతాధికారులు ఉన్నారు. అలాగే, కొడంగల్‌ నియోజకవర్గం మద్దూరులో నిర్మాణంలో ఉన్న ప్రభుత్వ డిగ్రీ కళాశాల, సోషల్‌ వెల్ఫేర్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌ పనులను పరిశీలించిన సీఎం.. భవిష్యత్‌ అవసరాలను దృష్టిలో ఉంచుకొని నిర్మాణాలు ఉండాలని అధికారులకు సూచించారు. నిర్ణీత గడువులోగా భవన నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. పదేళ్ల క్రితం ప్రజల అవసరాల కోసం తన సొంత డబ్బుతో కొనుగోలు చేసిన భూమిలో సోషల్‌ వెల్ఫేర్‌ స్కూల్‌ నిర్మాణం జరుగుతుండటం సంతోషంగా ఉందన్నారు. ఆ రోజుల్లో తన పిలుపు మేరకు భూములు ఇచ్చిన రైతులను గుర్తించి ప్రతీ కుటుంబానికి ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.


ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు

రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు ఎంపికైన ఉపాధ్యాయులు ముఖ్యమంత్రి చేతులమీదుగా శనివారం పురస్కారాలు అందుకోనున్నారు. ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ప్రతీ ఏటా హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో జరిగే ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమం తొలిసారిగా కొడంగల్‌ వేదికగా జరగనుంది. కొడంగల్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. శనివారం ఉదయం ప్రభుత్వాసుపత్రి, అతిథి గృహం, బాలికల పాఠశాల, స్విమ్మింగ్‌ పూల్‌ను ప్రారంభించిన తర్వాత సీఎం రేవంత్‌ రెడ్డి.. ఉపాధ్యాయ దినోత్సవ కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం నల్లగొండ జిల్లా నకిరేకల్‌లో సీఎం పర్యటిస్తారు. నకిరేకల్‌లో రూ.32కోట్లతో నిర్మించిన 100 పడకల ఆస్పత్రిని ప్రారంభిస్తారు. నకిరేకల్‌ మండలం కడపర్తిలో నిర్మించే ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు, పబ్లిక్‌స్కూల్‌ పనులకు శంకుస్థాపన చేస్తారు. ఆ తర్వాత నకిరేకల్‌ మినీ స్టేడియంలో నిర్వహిస్తున్న ప్రజావికాస సభలో ముఖ్యమంత్రి మాట్లాడతారు.


నిధుల్లేవనే కారణంతో పనులు ఆగొద్దు: సీఎం

మక్తల్‌ - నారాయణపేట- కొడంగల్‌ ఎత్తిపోతల (ఎంఎన్‌కేఎల్‌ఐఎస్) ప్రాజెక్టు ఫేజ్‌-2 పనులకు వీలైనంత త్వరగా టెండర్లు పిలవాలని ముఖ్యమంత్రి ఎ.రేవంత్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. కొడంగల్‌ నియోజకవర్గంలో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం సమీక్ష నిర్వహించారు. ఎంఎన్‌కేఎల్‌ఐఎ్‌స ప్రాజెక్టుకు సంబంధించి పెండింగ్‌ భూసేకరణ ప్రక్రియ త్వరగా పూర్తి చేయాలని, ఫేజ్‌ 1, 2, 3 కలిపి సమాంతరంగా పనులు నిర్వహించాలని సూచించారు. నెల వారీగా లక్ష్యాలను నిర్దేశించుకుని పనులు పూర్తి చేయాలని, నిధులు లేని కారణంగా పనులు ఆగిపోయాయనే మాట వినిపించకూడదని స్పష్టం చేశారు. నిధులు ఎప్పటికప్పుడు విడుదలయ్యే విధంగా చూడాలని సీఎం ఆర్థిక శాఖ కార్యదర్శిని ఆదేశించారు. భూత్పూర్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంపుపై సాధ్యాసాధ్యాలను పరిశీలించి నివేదిక అందజేయాలని అధికారులను ఆదేశించారు. రంగారెడ్డి, వికారాబాద్‌, నారాయణపేట జిల్లాల్లో 81 కిలోమీటర్ల రోడ్డు, సమీకృత పారిశ్రామిక ప్రాజెక్టు అభివృద్ధికి ప్రతిపాదించిన 4 వేల ఎకరాల భూసేకరణ త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నియోజకవర్గంలో అన్ని తండాలకు రహదారులు ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు.

Updated Date - Sep 05 , 2026 | 05:43 AM