సాయికృష్ణ కేసు.. విచారణను 23కి వాయిదా వేసిన సుప్రీంకోర్టు
ABN , Publish Date - Jul 15 , 2026 | 11:42 AM
గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు విచారణ జరగింది.
ఢిల్లీ, జులై 15 (ఆంధ్రజ్యోతి): గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో (Sai Krishna Case) కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దాఖలు చేసిన పిటిషన్‌పై సుప్రీంకోర్టులో ఈరోజు (బుధవారం) విచారణ జరిగింది. ఈ కేసు తదుపరి విచారణను జులై 23వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. జస్టిస్ విక్రమ్‌నాథ్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం ముందు ఈ కేసు విచారణ జరిగింది. ఏపీ ప్రభుత్వం తరఫున దాఖలైన పిటిషన్‌పై స్పందించేందుకు ప్రతివాది, కృష్ణలంక సస్పెండెడ్ సీఐ నాగరాజుకు సుప్రీంకోర్టు వారం రోజుల సమయం ఇచ్చింది. నాగరాజు పోలీస్ కస్టడీకి సంబంధించి హైకోర్టు విధించిన షరతులను సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) సుప్రీంకోర్టును ఆశ్రయించింది.
ఏపీ హైకోర్టు తన తీర్పులో నిందితుడి ట్రాన్సిట్ సమయంలో పూర్తి నిడివి వీడియో రికార్డింగ్ చేయాలని ఆదేశించింది. అయితే ఈ షరతులపై రాష్ట్ర ప్రభుత్వం, సిట్ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నిరంతర వీడియో నిఘా కారణంగా దర్యాప్తు గోప్యత దెబ్బతినే అవకాశం ఉందని ఏపీ సర్కార్ తెలిపింది. ఈ కేసు విచారణకు సంబంధించిన కీలక అంశాలు బయటకు వెళ్లే ప్రమాదం ఉందని ప్రభుత్వం తన పిటిషన్‌లో పేర్కొంది. అదేవిధంగా సాయికృష్ణ మృతదేహం అన్వేషణ, సంఘటన స్థల పునర్నిర్మాణం (సీన్ రికన్‌స్ట్రక్షన్) వంటి కీలక దర్యాప్తు చర్యలకు హైకోర్టు విధించిన నిబంధనలు అడ్డంకిగా మారుతున్నాయని సిట్ అధికారులు వాదించారు.
ఈ కేసు పూర్తి స్థాయిలో విచారించేందుకు నిందితుడికి ఎలాంటి షరతులు లేకుండా కస్టడీలో ప్రశ్నించేందుకు అనుమతి ఇవ్వాలని సుప్రీంకోర్టును ఏపీ ప్రభుత్వం కోరింది. ఈ నేపథ్యంలో సుప్రీంకోర్టు ప్రతివాది సస్పెండెడ్ సీఐ నాగరాజు నుంచి సమాధానం కోరుతూ విచారణను జులై 23వ తేదీకి న్యాయస్థానం వాయిదా వేసింది. తదుపరి విచారణలో సిట్ అభ్యర్థనపై కీలక నిర్ణయం వెలువడే అవకాశం ఉంది.
ఈ వార్తలు కూడా చదవండి...
ఉడాన్ పథకం మరో పదేళ్లు పొడిగిస్తున్నాం: రామ్మోహన్
రాయలసీమను జగన్ ముంచేశారు.. సోమిరెడ్డి ధ్వజం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News