Share News

రాప్తాడు విద్యార్థినిపై దాడి ఘటన.. తీవ్రంగా ఖండించిన ఏపీ మంత్రులు

ABN , Publish Date - Oct 31 , 2026 | 04:33 PM

రాప్తాడు జెడ్పీ స్కూల్‌‌లో టెన్త్ విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఏపీ మంత్రులు స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు.

రాప్తాడు విద్యార్థినిపై దాడి ఘటన.. తీవ్రంగా ఖండించిన ఏపీ మంత్రులు
Raptadu School Attack

అమరావతి, అక్టోబర్ 31: రాప్తాడు జెడ్పీ స్కూల్‌‌లో టెన్త్ విద్యార్థినిపై ఓ ఉన్మాది రంపంతో దాడి చేసిన ఘటన రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ ఘటనపై ఏపీ మంత్రులు స్పందిస్తూ.. తీవ్రంగా ఖండించారు. నిందితుడిని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షిస్తామని తెలిపారు. విద్యార్థిని కుటుంబానికి ప్రభుత్వం అండగా నిలిస్తుందని హామీ ఇచ్చారు. రాప్తాడు ఘటన చాలా దురదృష్టకరమని హోంమంత్రి అనిత అన్నారు. పదో తరగతి చదువుతున్న విద్యార్థినిపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందించేలా సీఎం చంద్రబాబు ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అనంతపురం జిల్లా ఎస్పీకి ఆదేశాలు ఇచ్చినట్లు తెలిపారు. నిందితుడిని కఠినంగా శిక్షిస్తామన్నారు. విద్యార్థిని అతి త్వరగా కోలుకోవాలని భావిస్తున్నామని.. బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని హోంమంత్రి భరోసా ఇచ్చారు.


బాలికపై రంపంతో దాడి బాధాకరం: మంత్రి సవిత

రాప్తాడులో బాలికపై దాడి ఘటనపై మంత్రి సవిత దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అనంతపురం జిల్లా కలెక్టర్ ఓ.ఆనంద్, ఎస్సీ జగదీశ్‌తో ఫోన్లో మాట్లాడారు. నిందితుడిని తక్షణమే అరెస్ట్ చేయాలని ఆదేశించారు. నిందితుడు ఎంతటివాడైనా, ఏ పార్టీ వాడైనా ఉపేక్షించొద్దని తెలిపారు. క్షమించరాని నేరానికి పాల్పడ్డాడని మండిపడ్డారు. మహిళలు, బాలికల భద్రతే కూటమి ప్రభుత్వం లక్ష్యమని స్పష్టం చేశారు. భవిష్యత్తులో మహిళలవైపు ఎవరైనా కన్నెత్తి చూడాలంటే భయేపడేలా కఠినంగా శిక్షించాలన్నారు. తరగతి గదిలోనే విద్యార్థినిపై రంపంతో దాడి చేయడం బాధాకరమన్నారు. చదువుల తల్లి ఒడి విద్యార్థిని రక్తంతో తడవడం ఆవేదనకు గురిచేస్తోందని అన్నారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. విద్యార్థినికి మెరుగైన వైద్యం అందిస్తున్నామని మంత్రి సవిత తెలిపారు.


నిందితుడిపై చట్టపరమైన చర్యలు: మంత్రి టీజీ భరత్

రాప్తాడులో విద్యార్థినిపై అమానుష దాడి ఘటనపై మంత్రి టీజీ భరత్ ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థినిపై రంపంతో దాడి ఘటన దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ ఘటనకు సంబంధించి అనంతపురం జిల్లా కలెక్టర్, ఎస్పీతో మంత్రి ఫోన్‌లో మాట్లాడారు. విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. దాడి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థినికి మెరుగైన వైద్య సేవలు అందించాలని ఆదేశాలు జారీ చేశారు. నిందితుడిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మంత్రి టీజీ భరత్ సూచించారు.


బాలికపై దాడి కలచివేసింది: మాధవ్

రాప్తాడులో బాలికపై దారుణం కలచివేసిందని.. నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ ఏపీ అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఆడపిల్లలు, మహిళల జోలికి రావాలంటే భయపడేలా చట్టాన్ని అమలు చేయాలన్నారు. పిల్లల భద్రతలో నిర్లక్ష్యం వహిస్తే ఎంతటి వారైనా బాధ్యత వహించాల్సిందే అని పీవీఎన్ మాధవ్ స్పష్టం చేశారు.


ఘటనపై తక్షణమే స్పందించిన ఏపీ మహిళా కమిషన్

రాప్తాడులో పదో తరగతి విద్యార్థినిపై రంపంతో దాడి ఘటనపై మహిళా కమిషన్ చైర్‌పర్సన్ డా. రాయపాటి శైలజ స్పందించారు. దాడిని అడ్డుకునే క్రమంలో గాయపడిన మరో విద్యార్థిని ఆరోగ్య పరిస్థితిపైనా చైర్‌పర్సన్ ఆరా తీశారు. బాధిత విద్యార్థినుల ఆరోగ్య పరిస్థితిపై మహిళా కమిషన్ ఎప్పటికప్పుడు వివరాలు తెలుసుకుంటోంది.


ఇవి కూడా చదవండి...

అక్రమాలు నిరూపిస్తే రాజీనామా చేస్తా.. జగన్‌కు మంత్రి సత్యకుమార్ ఛాలెంజ్

‘ఓటు వేసి నేరుగా ఇంటికి వెళ్లాలి’.. జగన్‌కు డీఐజీ సూచన

Read Latest AP News And Telugu News

Updated Date - Oct 31 , 2026 | 04:54 PM