Share News

AP Police:రౌడీమూకలపై ఉక్కుపాదం.. కఠిన చర్యలు చేపట్టిన ఏపీ పోలీసులు

ABN , Publish Date - Jan 04 , 2026 | 01:40 PM

కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు.

AP Police:రౌడీమూకలపై ఉక్కుపాదం.. కఠిన చర్యలు చేపట్టిన ఏపీ పోలీసులు
AP Police

కృష్ణాజిల్లా, మచిలీపట్నం, జనవరి4(ఆంధ్రజ్యోతి): కృష్ణాజిల్లాలోని మచిలీపట్నంలో (Machilipatnam) తాగుబోతుల ఆగడాలకు పోలీసులు గట్టి హెచ్చరిక ఇచ్చారు. మద్యం మత్తులో వీరంగం సృష్టించి ప్రజలకు ఇబ్బంది కలిగించిన యువకులపై పోలీసులు కఠినంగా వ్యవహరించారు. నిందితులను నడిరోడ్డుపై నడిపించుకుంటూ పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

గణేశ్ భవన్ వద్ద వీరంగం

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నిన్న(శనివారం) రాత్రి మచిలీపట్నంలోని గణేశ్ భవన్ ప్రాంతంలో ముగ్గురు యువకులు మద్యం మత్తులో రెచ్చిపోయారు. పాదచారులపై దాడికి పాల్పడటమే కాకుండా.. సమీపంలోని సిటీ కేబుల్ ఆఫీస్‌పై కూడా దాడి చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఒక్కసారిగా తీవ్ర ఉద్రిక్త పరిస్థితి నెలకొంది.


ఎస్పీ ఆదేశాలతో కఠిన చర్యలు

ఈ ఘటనను జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు సీరియస్‌గా తీసుకున్నారు. వెంటనే సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎస్పీ ఆదేశాల మేరకు ఆర్‌పేట సీఐ యేసుబాబు రంగంలోకి దిగారు. దాడికి పాల్పడిన ముగ్గురు యువకులను అదుపులోకి తీసుకుని కఠినంగా చర్యలు చేపట్టారు.


రోడ్డుపై నడిపిస్తూ స్టేషన్‌కు తరలింపు

నిందితులను సిటీ కేబుల్ ఆఫీస్ నుంచి కోనేరుసెంటర్ మీదుగా పోలీస్ స్టేషన్‌కు రోడ్డుపై నడిపించుకుంటూ పోలీసులు తీసుకెళ్లారు. అంతేకాకుండా, నిందితుల స్వస్థలమైన బలరామునిపేటలో కూడా రోడ్డుపై నడిపించారు. ఈ చర్యతో తాగుబోతులు, రౌడీ మూకలకు పోలీసులు స్పష్టమైన హెచ్చరిక ఇచ్చారు.


కేసు నమోదు.. దర్యాప్తు కొనసాగింపు

ఈ సందర్భంగా సీఐ యేసుబాబు మీడియాతో మాట్లాడారు. రౌడీ మూకలు, తాగుబోతులు, గంజాయి బ్యాచ్‌కు ఇది ఒక స్పష్టమైన హెచ్చరిక అని తెలిపారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తే తాము ఎలాంటి సడలింపులు ఇవ్వమని వార్నింగ్ ఇచ్చారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు సీఐ యేసుబాబు వెల్లడించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే ఇలాంటి ఘటనలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించబోమని సీఐ యేసుబాబు స్పష్టం చేశారు.


ప్రజల్లో మిశ్రమ స్పందన

పోలీసుల చర్యపై ప్రజల్లో మిశ్రమ స్పందన వ్యక్తమవుతోంది. కొందరు ఇది సరైన హెచ్చరిక అని అభినందిస్తున్నారు. మరికొందరు కఠిన చర్యల వల్లే ఇలాంటి ఘటనలు తగ్గుతాయని అభిప్రాయపడుతున్నారు. మచిలీపట్నంలో శాంతిభద్రతల పరిరక్షణకు పోలీసులు కట్టుదిట్టంగా వ్యవహరిస్తున్నారనే సంకేతంగా ఈ ఘటన నిలిచిందని ప్రజలు చెబుతున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి చారిత్రక ఘట్టం

సీఎం రేవంత్‌రెడ్డి వ్యాఖ్యలపై ఏపీ ప్రభుత్వం వివరణ

Read Latest AP News And Telugu News

Updated Date - Jan 04 , 2026 | 03:27 PM