పల్లెపాలెం అగ్నిప్రమాదంపై విచారణకు పవన్ ఆదేశం.. బాధితులకు తక్షణ సాయం
ABN , Publish Date - Nov 18 , 2026 | 11:23 AM
ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదంలో మత్స్యకారుల వలలు దగ్ధమవడంపై విచారం వ్యక్తం చేశారు.
అమరావతి, నవంబర్ 18: ప్రకాశం జిల్లా కొత్తపట్నం మండలం పల్లెపాలెంలో జరిగిన అగ్నిప్రమాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పందించారు. ప్రమాదంలో మత్స్యకారుల వలలు దగ్ధమవడంపై విచారం వ్యక్తం చేశారు. ఘటనపై ప్రకాశం జిల్లా కలెక్టర్‌ను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అగ్నిప్రమాదంపై సమగ్ర విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. బాధిత మత్స్యకార కుటుంబాలకు తక్షణమే నిత్యావసర సరుకులు అందించాలన్నారు.
వేట విరామంతో పాటు వలలు కాలిపోవడంతో మత్స్యకారులు ఉపాధి కోల్పోయిన పరిస్థితి నెలకొంది. దీంతో బాధితులకు తగిన నష్టపరిహారం అందించాలని డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారు. ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన 2.0 కింద కొత్త వలలు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. అగ్నిప్రమాద బాధిత మత్స్యకారులకు కూటమి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. మత్స్యకారుల జీవనోపాధికి ఇబ్బంది కలగకుండా తక్షణ సహాయం అందించాలని డిప్యూటీ సీఎం పవన్ స్పష్టీకరించారు.
అర్ధరాత్రి అగ్నిప్రమాదం
ప్రకాశం జిల్లాలోని పల్లెపాలెంలో అర్ధరాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మత్స్యకారుల వలలు అగ్నికి ఆహుతయ్యాయి. షెడ్లలో నిల్వ ఉంచిన దాదాపు 250 నుంచి 300 వలలు పూర్తిగా దగ్ధమయ్యారు. వలలన్నీ ఒకే చోట ఉండటంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి. రూ.10 కోట్ల విలువైన మత్స్యకారుల వలలు మంటల్లో కాలిపోయాయి. సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది అక్కడకు చేరుకుని మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. అయితే ప్రమాదంపై మత్స్యకారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషయం తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్ రాజాబాబు, ఎస్పీ హర్షవర్ధన్ రాజు, ఎమ్మెల్యే దామచర్ల జనార్ధన్ ఘటనాస్థలికి చేరుకుని అక్కడి పరస్థితిని పరిశీలించారు. మత్స్యకారులను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
ఇవి కూడా చదవండి..
ఇన్సూరెన్స్ తప్పనిసరి.. వాహనదారులకు మంత్రి మండిపల్లి కీలక సూచనలు
ఏలూరు జిల్లాలో పెద్దపులి సంచారం.. గ్రామాల ప్రజలకు అటవీ శాఖ హెచ్చరికలు
Read Latest AP News And Telugu News