మెగా డీఎస్సీపై వైసీపీవి నిరాధార ఆరోపణలు: సానా సతీష్ బాబు
ABN , Publish Date - Jul 29 , 2026 | 12:17 PM
మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్‌కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని విరుచుకుపడ్డారు.
న్యూఢిల్లీ, జులై 29: మెగా డీఎస్సీపై మాట్లాడే నైతిక హక్కు మాజీ సీఎం జగన్‌కు లేదని రాజ్యసభ సభ్యులు సానా సతీష్ బాబు అన్నారు. ఐదేళ్ల వైసీపీ పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా లక్షలాది మంది నిరుద్యోగ యువతను జగన్ మోసం చేశారని విరుచుకుపడ్డారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన గ్రూప్-1 నియామకాల అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించి, జగన్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. బీఈడ్, డీఈడ్ పూర్తి చేసిన నిరుద్యోగ యువతను ఎదురుచూపుల్లో ఉంచి, ఎన్నికల ముందు ఉద్యోగాలు, డీఎస్సీ పేరుతో హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని పూర్తిగా విస్మరించిన ప్రభుత్వం వైసీపీదేనని అన్నారు. మెగా డీఎస్సీపై వైసీపీ విమర్శలు చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని మండిపడ్డారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తొలి సంతకాన్ని మెగా డీఎస్సీ ఫైల్‌పైనే చేశారని సానా సతీష్ అన్నారు. ఇచ్చిన హామీ మేరకు కేవలం 100 రోజుల్లోనే 16,347 ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేశారని తెలిపారు. మెగా డీఎస్సీని అడ్డుకునేందుకు 150కి పైగా కోర్టు కేసులు వేసిన వారే ఇప్పుడు నిరుద్యోగుల పక్షాన మాట్లాడుతున్నట్లు నటించడం రాజకీయ కపటత్వానికి నిదర్శనమని విమర్శించారు. అన్ని న్యాయపరమైన అడ్డంకులను అధిగమించి చట్టబద్ధంగా నియామకాలు పూర్తి చేసిన కూటమి ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యోగాలు సాధించిన 16 వేలకుపైగా అభ్యర్థులను, వారి కుటుంబాలను అవమానిస్తున్నారని వ్యాఖ్యానించారు.
విద్యాశాఖ మంత్రిగా నారా లోకేశ్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత విద్యారంగంలో సంస్కరణలు అమలవుతున్నాయని సానా సతీష్ తెలిపారు. ఉపాధ్యాయ నియామకాలు, విద్యార్థుల సంక్షేమం, విద్యా మౌలిక సదుపాయాల అభివృద్ధికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యం ఇస్తోందన్నారు. రాష్ట్రంలో పెట్టుబడులు, పరిశ్రమలు, ఉపాధి అవకాశాలు పెరుగుతున్న నేపథ్యంలో వాటిని జీర్ణించుకోలేక వైసీపీ నిరాధార ఆరోపణలు చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెగా డీఎస్సీపై ఆరోపణలు నిరూపించాలని మంత్రి లోకేశ్ సవాల్ విసిరినా వైసీపీ నాయకులు వెనక్కి తగ్గారని గుర్తుచేశారు. తప్పుడు ప్రచారాలు మానేసి, మెగా డీఎస్సీపై బహిరంగ చర్చకు రావాలని వైసీపీకి సానా సతీష్ బాబు సవాల్ విసిరారు.
ఇవి కూడా చదవండి...
‘నేను కూడా మిమ్మల్ని కలవాలనుకుంటున్నా’.. ఆదోని చిన్నారుల వీడియోపై లోకేశ్
Read Latest AP News And Telugu News