Share News

హాట్‌స్పాట్‌లపై ఫోకస్ పెట్టండి.. అధికారులకు జలమండలి ఎండీ ఆదేశాలు

ABN , Publish Date - Jul 29 , 2026 | 10:55 AM

హైదరాబాద్‌లో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హాట్‌స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు.

హాట్‌స్పాట్‌లపై ఫోకస్ పెట్టండి.. అధికారులకు జలమండలి ఎండీ ఆదేశాలు
Hyderabad heavy rains

హైదరాబాద్, జులై 29: నగరంలో భారీ వర్షాల నేపథ్యంలో అధికారులతో జలమండలి ఎండీ అశోక్ రెడ్డి అత్యవసర సమావేశం నిర్వహించారు. హాట్‌స్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని ఆదేశాలు జారీ చేశారు. ఉన్నతస్థాయి అధికారుల నుంచి క్షేత్రస్థాయి సిబ్బంది వరకు ప్రతి ఒక్కరూ క్షేత్రస్థాయిలో పనిచేస్తూ పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలన్నారు. భారీ వర్షాల నేపథ్యంలో అధికారులను జలమండలి ఎండీ అప్రమత్తం చేశారు. ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్ని రకాల ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో వరద నీటి తొలగింపు, సీవర్ జెట్టింగ్ యంత్రాల పనితీరును డీజీఎంలు తనిఖీ చేయాలన్నారు.


రహదారులపై మ్యాన్‌హోళ్ల వద్ద సీవరేజీ ఓవర్‌ఫ్లో ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలని అశోక్ రెడ్డి సూచించారు. ఇళ్ల వద్ద నిల్వ ఉండే మురుగు నీటి సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వాలని జీఎంలకు ఆదేశాలు జారీ చేశారు. లోతైన మ్యాన్‌హోళ్లు, మురుగు ఉప్పొంగే హాట్‌స్పాట్లను సందర్శించి తక్షణ చర్యలు చేపట్టాలన్నారు. తాగునీటి సరఫరా సమయంలో నీటి నాణ్యతను తప్పనిసరిగా పరీక్షించాలని ఆదేశించింది. తాగునీరు కలుషితం కాకుండా బస్తీలు, లోతట్టు ప్రాంతాల్లో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. పనులు చేపట్టే ప్రతి ప్రాంతంలో తప్పనిసరిగా బారికేడ్లు ఏర్పాటు చేసి, ప్రజల భద్రతకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.


క్షేత్రస్థాయి సిబ్బంది హెల్మెట్లు, గ్లౌజులు, గమ్‌బూట్లు ధరించి భద్రతా ప్రమాణాలు పాటించాలని జలమండలి ఎండీ ఆదేశించారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో క్లోరిన్ మాత్రలు పంపిణీ చేయాలన్నారు. హైడ్రా, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖ.. సమన్వయంతో సహాయక చర్యలు చేపట్టాలని తెలిపారు. నగర ప్రజలు ఎట్టి పరిస్థితుల్లోనూ మ్యాన్‌హోల్ మూతలను తెరవకూడదని జలమండలి తరఫున విజ్ఞప్తి చేశారు. నీటి సరఫరా, సీవరేజీ సమస్యలపై జలమండలి కస్టమర్ కేర్ నంబర్ 155313కు ఫోన్ చేయాలని జలమండలి ఎండీ అశోక్ రెడ్డి సూచించారు.


ఇవి కూడా చదవండి...

కామారెడ్డిలో మహిళను బురిడీ కొట్టించిన దొంగలు

భారీ వర్షాలు.. నిజాంసాగర్, జూరాల ప్రాజెక్ట్‌లకు వరద ఉధృతి

Read Latest Telangana News And Telugu News

Updated Date - Jul 29 , 2026 | 11:02 AM