Share News

డీఎస్సీ వివాదంపై అనిత ఫైర్.. జగన్ ఆరోపణలకు 16 వేల ఉద్యోగాలతో కౌంటర్

ABN , Publish Date - Sep 24 , 2026 | 03:53 PM

అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ అరాచకాలు చంద్రబాబు అరెస్ట్‌తో ముగిశాయని హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. నేడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉన్నందుకే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు.

డీఎస్సీ వివాదంపై అనిత ఫైర్.. జగన్ ఆరోపణలకు 16 వేల ఉద్యోగాలతో కౌంటర్
Home Minister Anitha

అమరావతి, సెప్టెంబర్ 24: అధికారంలో ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చివేతతో మొదలైన జగన్ అరాచకాలు చంద్రబాబు అరెస్ట్‌తో ముగిశాయని హోం మంత్రి వంగలపూడి అనిత(Home Minister Vangalapudi Anitha) అన్నారు. ఈరోజు(గురువారం) మీడియాతో మాట్లాడుతూ.. నేడు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సక్రమంగా ఉన్నందుకే పరిశ్రమలు, పెట్టుబడులు వస్తున్నాయని తెలిపారు. అన్ని రంగాల్లో రాష్ట్రం ముందుకు వెళ్తుంటే జగన్ విధ్వంసాలు, విధ్వేషాలు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. లా అండ్ ఆర్డర్ సమస్యను సృష్టిస్తే పెట్టుబడులు రావనే ఉద్దేశంతో జగన్ ఇలా రోడ్లపైకి రౌడీ షీటర్లను పంపుతున్నారని ఆరోపించారు. జగన్ 28 పరామర్శలు చేస్తే.. అందులో అంతా రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, గూండాలే ఉన్నారని విమర్శించారు. డీఎస్సీ ఇస్తామని మంత్రి లోకేశ్ చెప్పి 16 వేల ఉద్యోగాలను 150 రోజుల్లో భర్తీ చేశారని తెలిపారు.


తాను కూడా చంద్రబాబు హయాంలో 2001 డీఎస్సీలో ఉద్యోగం పొందిన ఉపాధ్యాయురాలినే అని హోంమంత్రి గుర్తుచేశారు. ఉపాధ్యాయ వృత్తి గౌరవప్రదమైనదని... ఈ వృత్తి అంటే జగన్‌కు ఎందుకంత కోపమని ప్రశ్నించారు. డీఎస్సీపై జగన్, గొడ్డలి పార్టీ చేసిన ప్రతి ఆరోపణకు, సోషల్ మీడియా తప్పుడు ప్రచారాలకు సమాధానం చెప్పామని తెలిపారు. చెప్పిన అబద్ధాన్ని 100 సార్లు చెప్పి అదే నిజమని నమ్మించేలా జగన్ కుట్రలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేశ్ మూడు సార్లు డీఎస్సీపై సవాల్ వేస్తే వైసీపీ నుంచి సమాధానం లేదన్నారు. డీఎస్సీపై హైకోర్టుకు పోయి చీవాట్లు తిన్నా జగన్‌కు బుద్ధి మారలేదని వ్యాఖ్యానించారు.


‘డీఎస్సీ ఉద్యోగాలు పొందామని ఆధారాలతో క్రీడాకారులు సమాధానం చెబితే వెళ్లి దాడులు చేస్తారా? శ్యాప్ కార్యాలయంపై రౌడీ షీటర్లు, గూండాలు, బ్లేడ్ బ్యాచ్‌ను తీసుకొచ్చి ఉపాధ్యాయులపై దాడులు చేస్తారా?’ అంటూ అనిత విరుచుకుపడ్డారు. జగన్ 2019-24లో రౌడీ షీటర్లతో రాజ్యం నడిపించారని దుయ్యబట్టారు. రౌడీలు, గూండాలు.. టీచర్లపై దాడులు చేస్తే వాళ్లని జగన్ సమర్థిస్తున్నారని మండిపడ్డారు. శ్యాప్ కార్యాలయంపై దాడికి వచ్చిన వాళ్లలో 60 శాతం మంది నేరస్థులే అని తెలిపారు. రౌడీ షీటర్లు, గూండాలు, బ్లేడ్ బ్యాచ్‌, పోక్సో కేసులు ఉన్న వాళ్లు, మహిళలను వేధించే వాళ్లు జెన్ జీనా అని నిలదీశారు. తాడేపల్లి ప్యాలెస్‌లో డైరెక్షన్ తీసుకొని 50 కార్లల్లో గూండాలు వచ్చి శ్యాప్ కార్యాలయంపై దాడి చేశారని ఆరోపించారు.


అభ్యర్థులపై కేసులు పెట్టి వేధిస్తున్నారని గవర్నర్‌ను కలిసి.. జగన్ దొంగ ఏడుపులు ఏడుస్తున్నారని హోంమంత్రి వ్యాఖ్యానించారు. ప్రశాంతంగా ఉన్న రాష్ట్రంలో విధ్వంసాలు సృష్టించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తున్నారన్నారు. ఏపీపీఎస్సీ అక్రమాలు, లిక్కర్ స్కాంపై జగన్ రెడ్డి ఎందుకు సమాధానం చెప్పడం లేదని ప్రశ్నించారు. జగన్ చేసిన తప్పులు ఒక్కొక్కటిగా బయటికి వస్తున్నాయనే డైవర్షన్ చేసేందుకు ఏమీ లేని డీఎస్సీపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. రౌడీ షీటర్లతో రాజకీయం చేస్తామంటే వినేందుకు ప్రజలు సిద్ధంగా లేరని.. తాము కూడా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఉపాధ్యాయులకు అత్యున్నత గౌవరం ఇస్తున్న వ్యక్తి మంత్రి నారా లోకేశ్ అని అన్నారు. మాట్లాడితే యుద్ధం చేస్తామని జగన్ అంటున్నారని... ప్రజల మద్దతుతో యుద్ధం చేసేందుకు తాము సిద్ధమే అని స్పష్టం చేశారు. జెన్ జీ అంటే జగన్ దృష్టిలో రౌడీ షీటర్లు, గంజాయి బ్యాచ్, పోక్సో కేసు నిందితులన్నారు. అన్ని రంగాల్లో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపేలా సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమిస్తుంటే... జగన్ రెడ్డి విధ్వంసంతో అడ్డుకునే కుట్రలు చేస్తున్నారంటూ అనిత తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.


ఇవి కూడా చదవండి...

ఏపీ మద్యం రవాణా స్కాం.. అంబటి రాంబాబుకు ఈడీ నోటీసులు

మరో రెండు రోజులు అప్రమత్తంగా ఉండాలి.. విశాఖలో వర్షాలపై కలెక్టర్ టెలికాన్ఫరెన్స్

Read Latest AP News And Telugu News

Updated Date - Sep 24 , 2026 | 04:15 PM