Share News

గుడివాడలో వైసీపీ ప్రచారంలోకి ఒంటరిగా వెళ్లిన ఎమ్మెల్యే రాము.. జెండా తొక్కడంపై ఫైర్

ABN , Publish Date - Nov 24 , 2026 | 02:36 PM

గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 28వ వార్డు బొమ్ములూరులో వైసీపీ ప్రచారంలోకి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది.

గుడివాడలో వైసీపీ ప్రచారంలోకి ఒంటరిగా వెళ్లిన ఎమ్మెల్యే రాము.. జెండా తొక్కడంపై ఫైర్
Venigandla Ramu

కృష్ణాజిల్లా, నవంబర్ 24: గుడివాడ మున్సిపల్ ఎన్నికల్లో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. 28వ వార్డు బొమ్ములూరులో వైసీపీ ప్రచారం జరుగుతున్న ప్రాంతానికి ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ద్విచక్ర వాహనంపై ఒంటరిగా వెళ్లడం చర్చనీయాంశంగా మారింది. కూటమి శ్రేణులకు కూడా సమాచారం ఇవ్వకుండా నేరుగా వైసీపీ ప్రచార శిబిరం వద్దకు ఎమ్మెల్యే చేరుకోవడంతో వైసీపీ నాయకులు, కార్యకర్తలు కూడా ఆశ్చర్యపోయారు.


కొద్దిసేపటి క్రితం ఇదే వార్డులో ఎమ్మెల్యే రాము ప్రచారంలో పాల్గొన్న కార్యకర్త నుంచి వైసీపీ వర్గీయులు టీడీపీ జెండా లాక్కుని కాలితో తొక్కడం రచ్చకు దారి తీసింది. దీంతో వార్డులో తన ప్రచారం ముగించుకున్న రాము.. ద్విచక్ర వాహనంపై నేరుగా వైసీపీ ప్రచారం వద్దకు వెళ్లారు. కొడాలి నాని సన్నిహితుడు దుక్కిపాటి శశిభూషణ్‌ను కలిసి ఎన్నికల్లో గొడవలు ఎందుకంటూ ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో లేదా ఇతర విషయాల్లో ఎక్కడైనా ఇబ్బందులు పెడుతున్నానా అంటూ నిలదీశారు. ‘ఎవరి ప్రచారం వాళ్లు చేసుకోవాలి, మా జెండాలు కాలితో తొక్కడం మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించను’ అంటూ హెచ్చరించారు. జెండా తొక్కిన వాళ్లను పిలిపించాలని ఎమ్మెల్యే రాము డిమాండ్ చేశారు.


అయితే ఎమ్మెల్యే రాము ప్రశ్నలకు వైసీపీ నేత దుక్కిపాటి శశిభూషణ్, వైసీపీ నాయకులు స్పందిస్తూ... జెండా తొక్కిన వాళ్ల తరఫున క్షమాపణలు చెప్పారు. ‘మీ జెండా కింద పడిపోతే తీసుకోమని వైసీపీ కార్యకర్తలకు నేను సూచించాను. మీరు ఎందుకు ఈ అరాచకాలు చేస్తున్నారు’ అంటూ రాము ప్రశ్నించారు. ఎవరి పార్టీ వారికి ముఖ్యమని.. టీడీపీ జెండాను ఎలా తొక్కుతారంటూ నిలదీశారు. జెండా తొక్కిన వాళ్లు వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి తరఫు వాళ్లని స్థానిక నాయకులు చెప్పారు. ఛైర్మన్ అభ్యర్థి అరాచకవాది అని అందరికీ తెలుసని.. అలాంటి వాడి వెనుక ఇలాంటి వారే ఉంటారంటూ ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు. అయితే ‘మరోసారి ఇలా జరగదని.. ఈ పని చేసిన వారిని మీ దగ్గరకు తీసుకొస్తాము’ అని వైసీపీ నాయకులు చెప్పగా.. ఎవరి పని వాళ్లు చేసుకుందామని.. లేదంటే తాము మరో రూట్లో వెళ్లాల్సి వస్తుందని చెప్పి ఎమ్మెల్యే రాము అక్కడి నుంచి వెనుదిరిగారు.


ఇవి కూడా చదవండి...

గుడివాడ ఎన్నికల ప్రచారంలో ఉద్రిక్తత.. రోడ్ షో మధ్యలోకి దూసుకొచ్చిన వైసీపీ బృందం

ప్రతి ఇంటా పారిశ్రామికవేత్త ఉండాలన్నదే చంద్రబాబు ఆలోచన: గళ్లా మాధవి

Read Latest AP News And Telugu News

Updated Date - Nov 24 , 2026 | 02:53 PM