‘మడమ తిప్పను’ అనే జగన్ తీరు మాటలకే పరిమితం.. చేతల్లో యూటర్నే: రామ్మోహన్
ABN , Publish Date - Nov 07 , 2026 | 04:40 PM
మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లోనూ కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. 2.6 కోట్ల మంది ఓట్లేస్తే.. ఎన్నికల ప్రక్రియపై జగన్ మోహన్ రెడ్డి అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.
అమరావతి, నవంబర్ 7: మున్సిపల్ ఎన్నికల తరహాలోనే పరిషత్ ఎన్నికల్లోనూ కూటమికి ప్రజలు సంపూర్ణ మద్దతు పలికారని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. 2.6 కోట్ల మంది ఓట్లేస్తే.. ఎన్నికల ప్రక్రియపై జగన్ మోహన్ రెడ్డి అనుమానాలు రేకెత్తించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. 2024 ఎన్నికల్లో ఈవీఎంలను తప్పుపట్టిన వైఎస్సార్సీపీ.. ఇప్పుడు బ్యాలెట్ ఫలితాలపై ఏం చెబుతుందని నిలదీశారు. ఫలితాలను వక్రీకరించడం మాని, ప్రజల్లో వ్యతిరేకతకు కారణాలపై వైఎస్సార్సీపీ నేతలు ఆత్మపరిశీలన చేసుకోవాలని హితవుపలికారు.
9 వేల పైచిలుకు స్థానాలకు వైఎస్సార్సీపీ నుంచే 17 వేల నామినేషన్లు పడ్డాయని.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగాయనేందుకు ఇదే నిదర్శనమని ఎమ్మెల్యే చెప్పుకొచ్చారు. పట్టణాల్లోనే కాకుండా గ్రామీణ ప్రాంతాల్లోనూ ప్రజలు కూటమి ప్రభుత్వానికే పట్టం కట్టారని అన్నారు. కడప, పులివెందుల జడ్పీటీసీ స్థానాల్లోనూ కూటమి అభ్యర్థుల భారీ విజయం ప్రజాభిప్రాయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు. గత ఐదేళ్ల వైసీపీ విధ్వంస పాలనను ప్రజలు ఇంకా మర్చిపోలేదన్నారు. కేంద్ర నిధులను రాబట్టడంలో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
కూటమి ప్రభుత్వ సంక్షేమం, అన్న క్యాంటీన్లు, తల్లికి వందనం, ఉచిత ఆర్టీసీ ప్రయాణాలపై ప్రజలు పూర్తి సంతృప్తితో ఉన్నారని రామ్మోహన్ తెలిపారు. ఈ స్థానిక సంస్థల ఫలితాలు కూటమి ప్రభుత్వ బాధ్యతను మరింత పెంచాయని వెల్లడించారు. ప్రజాస్వామ్యం, ఎన్నికల ప్రక్రియపై జగన్‌కు ఏమాత్రం గౌరవం లేదని వ్యాఖ్యానించారు. ‘మడమ తిప్పను’ అనే జగన్ తీరు మాటలకే పరిమితమని... చేతల్లో ఎప్పుడూ యూటర్నే అంటూ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ రావు ఎద్దేవా చేశారు.
ఇవి కూడా చదవండి...
ఏపీ పెట్టుబడులకు గ్లోబల్ వేదిక.. విశాఖ సీఐఐ సమ్మిట్‌పై సీఎం చంద్రబాబు ఫోకస్
శ్రీకాళహస్తిలో టీడీపీ హవా.. మూడు మండలాల్లో కూటమి ఘన విజయం
Read Latest AP News And Telugu News